బస్తీమే సవాల్‌

CCC
జగ్గారెడ్డి గెలిస్తే రాజకీయ సన్యాసమే

ఎర్రబెల్లి సవాల్‌ను స్వీకరించిన హరీశ్‌

తెరాస గెలిస్తే నువ్వు సిద్ధమా?

సంగారెడ్డి, సెప్టెంబర్‌ 4 (జనంసాక్షి) : మెదక్‌ ఉప ఎన్నికలో జగ్గారెడ్డి గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ప్రతి సవాల్‌ విసిరారు. టీడీపి నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు చేసిన సవాల్‌ను ఆయన స్వీకరిస్తూ ఈ ప్రకటన చేశారు. తెరాస గెలిస్తే నువ్వు రాజకీయ సన్యాసానికి సిద్ధమా అని హరీశ్‌ ప్రశ్నించారు. గురువారం మెదక్‌ జిల్లా సంగారెడ్డిలో సిపిఐ తెలంగాణ అధ్యక్షులు చాడా వెంకటరెడ్డి, ఆ పార్టీ కార్యకర్తలతోపాటు  నిర్వహించిన సమావేశంలో హరీశ్‌రావు ప్రసంగించారు. మెదక్‌ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మద్దతివ్వాలని నిర్ణయించిన సీపీఐ, సీపీఎం నాయకులకకు, కార్యకర్తలకు హరీశ్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. వామపక్ష కార్యకర్తలను సమన్వయం చేసుకొని ప్రచారంలో పాల్గొనాలని టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు సూచించారు. మెదక్‌ లోక్‌సభ ఉప ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ ఓటమి ఖాయమైపోయిందని, డిపాజిట్ల కోసమే వాటి ఆరాటమని ఆయన  విమర్శించారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించినా ఇంకా ఏ ముఖం పెట్టుకొని ఎన్నికల్లో నిలబడ్డారని బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులు జగ్గారెడ్డి, సునీతాలక్ష్మారెడ్డిలను ఆయన ప్రశ్నించారు. పదేళ్ల పాటు మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా పని చేసిన విూరు ఇక అక్కర్లేదని ప్రజలు తిరస్కరించారన్నారు. విూరు అవినీతి ఎక్కువ చేశారు.. విూ సేవలు మాకు అవసరంలేదని ప్రజలు ఇటీవలి ఎన్నికల్లో ఓడించి పంపించారన్నారు. ఒకసారి ఓడిపోయిన నేతలు మళ్లీ ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వస్తారన్నారు. ఐదేళ్ల దాకా ఇంట్లో కూర్చోవాలని ప్రజలు స్పష్టంగా చెప్పినా.. మళ్లీ పోటీకి దిగడం ప్రజలను అవమానించడం కాదా? అని ప్రశ్నించారు. తెలంగాన వ్యతిరేకులను మెదక్‌ ప్రజలు ఘోరంగా ఓడించి తగిన బుద్ది చెబుతారన్నారు. సమైక్యవాది అయిన జగ్గారెడ్డి తెలంగాణకు వ్యతిరేకంగా లాబీయింగ్‌ చేయలేదా? తెలంగాణ ఇవ్వొద్దని హైకమాండ్‌కు లేఖ రాయలేదా? ఇప్పుడు ఆయన ఏ ముఖం పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేస్తాడని ప్రశ్నించారు. సమైక్యవాదికి టికెట్‌ ఇచ్చి బీజేపీ తన ఓటమిని ముందుగానే అంగీకరించిందన్నారు. బీజేపీలో పోటీచేసే వారే కరువయ్యారని.. అభ్యర్థిని అరువు తెచ్చుకొని నిలబెట్టాల్సిన దుస్థితి దాపురించిందని ఎద్దేవా చేశారు. సునీతాలక్ష్మారెడ్డి ఏరోజైనా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా? అని ప్రశ్నించారు. సమైక్యవాద ముఖ్యమంత్రి కిరణ్‌కు తొత్తుగా వ్యవహరించిన ఆమెకు మొన్నటి ఎన్నికల్లో ప్రజలు బుద్ధిచెప్పారని, ఇప్పుడు మళ్లీ అదేరీతిలో బుద్ది చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. నర్సాపూర్‌, సంగారెడ్డి నియోజకవర్గాల్లో సునీత, జగ్గారెడ్డి చేసిన అభివృద్ధి ఏమైనా ఉందా? అడిగారు.