ఆంగ్లేయులు అబ్బురపడేలా ఆంగ్ల విద్య
దశలవారిగా కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య
సమాజ నిర్మాణంలో టీచర్ల పాత్ర కీలకం
ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో సీఎం కేసీఆర్
హైదరాబాద్, సెప్టెంబర్ 5 (జనంసాక్షి) : ఆంగ్లేయులు అబ్బురపడేలా ఆంగ్ల విద్యను ప్రవేశపెడుతామని, దశలవారిగా కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యనందిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ప్రపంచం అబ్బురపోయే విద్యాక్షేత్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు కృషిచేద్దామన్నారు. సమాజ నిర్మాణంలో టీచర్ల పాత్ర కీలకమన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి సిఎం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో వచ్చే యేడు నుంచే మెరికల్లాంటి విద్యార్థులను తయారుచేసుకుని ప్రపంచానికి అందిద్దామన్నారు. తెలంగాణను ఓ అద్భుతమైన విద్యాక్షేత్రంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఇక్కడి టీచర్లపై ఉందన్నారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ.. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో ఉచిత నిర్బంధ విద్య అమలుచేస్తమని స్పష్టంచేశారు. పట్టుబడితే, జట్టుకడితే సాధించలేనిదిలేదని తెలంగాణ సమాజం నిరూపించిందని అన్నారు. మన విద్యార్థులను ప్రపంచంలోనే గొప్ప విద్యార్థులుగా తీర్చిదిద్ది ప్రపంచానికవసరమయ్యే వజ్రాలను తయారుచేద్దామని పేర్కొన్నారు. ఆంగ్ల విద్యకు ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు. టీచర్లు ఆంగ్లంలో బోధించేందుకు సిద్ధం కావాలన్నారు. దీనిద్వారా మన విద్యార్థులను మ¬న్నతులుగా తయారుచేసి ప్రపంచానికి అందించాల్సిన బాధ్యత విూపై ఉందన్నారు. ఇంగ్లీషు రాదన్న బెంగ అవసరం లేదన్నారు. అదేవిూ బ్రహ్మ విద్య కూడా కాదన్నారు. పట్టుబట్టి నేర్చుకుంటే తప్పకుండా వస్తుందన్నారు. తెలుగును రక్షించుకుంటూనే, దానిని అభివృద్ధి చేసుకుంటూనే ఆంగ్లవిద్యను ప్రాంభించాలన్నారు. ఒక్కరోజులోనే దీనిని అధిగమిద్దామని అనుకోవడం లేదని ఏటేటా ఒక్కో క్లాసు పెంచుకుంటూ 12 తరగతుల వరకు పోదామన్నారు. తాను కూడా తెలుగు విూడియం నుంచే వచ్చానని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా చెప్పారు. తెలంగాణను పట్టి సాధించుకున్న మనకు ఇంగ్లీష్ ఒంటబట్టించుకోవడం ఓ లెక్కా అని అన్నారు. ఒకప్పుడు చైనాలో ఇంగ్లీష్ నిషేధమని కాని నేడు అక్కడ అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారని అన్నారు. క్రీడల సందర్భంగా అక్కడి ¬టళ్లు, రెస్టారెంట్లలో పనిచేసే వారికి, టాక్సీ డ్రైవర్లకు ఇంగ్లీష్ నేర్పారన్నారు. మొన్నీ మధ్యన మన తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన చైనా ప్రతినిధులు కూడా బ్రహ్మాండంగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారని అన్నారు. కష్టపడితే ఇంగ్లీష్ రాకపోవడమనేది లేదన్నారు. ప్రపంచంతో పోటీ పడాలంటే ఇంగ్లీష్ తప్పనిసరన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ దేశానికి అందించిన సేవలు వెలకట్టలేనివన్నారు. అమ్మ జన్మనిస్తే… గురువు జీవితాన్ని ఇస్తాడు.. తమను గొప్పగా తీర్చిదిద్దిన ఘనత గురువులదేనన్నారు. ఎలాంటి ఫీజులు తీసుకోకుండానే తమ గురువు మృత్యుంజయ శర్మ తనకు చదువుచెప్పారని ఈ సందర్భంగా కేసీఆర్ గుర్తు చేశారు. తొమ్మిదో తరగతిలోనే పద్యం రాశా.. అది మా గురువు దయ అని వివరించారు. గురువు సద్గురువు అయితే రాయి సైతం నేర్చుకోలేని విద్య ఉండదన్నారు. ప్రపంచంలో ఎంత పెద్ద వ్యక్తికైనా మొదటి బడి అమ్మ ఒడి అన్నారు. గురువు సద్గురువైతే రాయి కూడా పాఠం నేర్చుకుంటదన్నారు. గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం కేసీఆర్ టీచర్లందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఉత్తర గో గ్రహణం పాఠం గుర్తు చేసుకున్నారు. మృత్యుంజయ శర్మ గారి దగ్గర విద్య నేర్చుకున్నానన్నారు. ఫీజు లేకుండా శర్మగారు తనకు పాఠాలు చెప్పిండని.. తాను ఇలా మాట్లాడుతున్ననంటే మా గురు దేవులు పెట్టిన అక్షరభిక్షేనని ఉద్ఘాటించారు. తమను తీర్చిదిద్దిన ఘనత గురువులదే అన్నారు. అంతకు ముందు ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదిలావుంటే కరీంనగర్ జిల్లాలోని జగిత్యాలలో గురుపూజోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ గురువు మృత్యుంజయశర్మకు సన్మానం జరిగింది. ఓ ప్రవేట్ స్కూల్ యాజమాన్యం ఆయనను ఘనంగా సత్కరించింది.