కేసీఆర్‌ ఢిల్లీ టూర్‌ గ్రాండ్‌ సక్సెస్‌

CCC
రాజ్‌నాథ్‌, స్మృతి ఇరానీ, జవదేకర్‌లతో సీఎం భేటీ

తెలంగాణ సమస్యలపై మోడీ సానుకూల స్పందన

హైదరాబాద్‌ చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 7 (జనంసాక్షి) :

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరావు ఢిల్లీ పర్యటన విజయవంతంగా ముగిసింది. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర హోంమంత్రి  రాజ్‌నాథ్‌సింగ్‌ను, 2 గంటలకు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీని, 2.30 గంటలకు సమాచార శాఖ మంత్రి ప్రకాశ్‌జవదేకర్‌ తదితరులను కలిశారు. కేసీఆర్‌ తిరిగి హైదరాబాద్‌ చేరుకున్నారు. తన పర్యటన రెండోరోజు కూడా బీజీబీజీగా గడిపారు. రాష్ట్రానికి సంబంధించి 21 అంశాలపై ప్రధాని నివేదిక సమర్పించిన కేసీఆర్‌ శాఖలవారిగా మంత్రులను కలిసే పనిలో నిమగ్నమయ్యారు. హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ భేటీలో ఉద్యోగుల విభజన, కష్టాలు, గవర్నర్‌ అధికారాలపై చర్చించారు. వీటితోపాటు రాష్ట్ర విభజన చట్టంలోని పలు అంశాలపై కూడా కేసీఆర్‌ హోంమంత్రితో చర్చించినట్టు సమాచారం. అనంతరం పర్యావరణ శాఖ మంత్రి ఇరానీతో భేటీ అయిన కేసీఆర్‌ అడవుల పరిరక్షణ, వన్యప్రాణుల రక్షణ, హరితహారం ప్రాజెక్టు కోసం నిధులు పెంచాలని కోరారు. అనంతరం ప్రకాశ్‌ జవదేకర్‌తో భేటీ అయిన కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రంలోని ప్రాజెక్టుల నిర్మాణానికి పర్యావరణ అనుమతులు ఇవ్వాలని కోరారు. శనివారం ఢిల్లీ వెళ్లిన సందర్భంలో ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సందర్భంలో రెండు తెలుగు రాష్ట్రాలు సమన్వయంతో ఉండాలంటూ మోడీ కేసీఆర్‌ను కోరిన విషయం తెలిసిందే. దీనిపై కేసీఆర్‌ సానుకూలంగా స్పందించారు. ఆయనను కలిసిన సందర్భంలో తెలంగాణకు కావాల్సిన పలు వసతులపై ప్రధానికి కేసీఆర్‌ వివరించారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని, విభజన బిల్లులో పొందుపరిచిన మాదిరిగా 4వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న కేసీఆర్‌ విజ్ఞప్తికి కేంద్రంనుండి సానుకూల స్పందనే లభించింది. కేంద్ర విద్యుత్‌ శాఖమంత్రి పీయూష్‌గోయల్‌ సైతం పాలమూరులో వెయ్యి మెగావాట్ల సౌరవిద్యుత్‌ ఉత్పిత్తి కేంద్రాన్ని ఏర్పాటుకు అంగీకరించారు. అదేరీతిలో హైకోర్టు విభజనపై కూడా న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌ సానుకూలంగానే స్పందించారు. ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కొత్త హైకోర్టును ఏర్పాటుచేయడం సాధ్యంకాదని, హైదరాబాద్‌లో హైకోర్టు కోసం ఒక భవానాన్ని కేటాయించేందుకు అంగీకరిస్తే హైకోర్టును విభజిస్తామంటూ రవిశంకర్‌ స్పష్టంచేశారు. దీనికి సైతం కేసీఆర్‌ అంగీకారం తెలిపారు. హైకోర్టు కోసం ప్రత్యేకంగా భవనాన్ని కేటాయించేందుకు సీఎం అంగీకరించారు. సుప్రీంకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తి పదవి స్వీకారం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు కొత్త హైకోర్టును ఏర్పాటుచేస్తానని రవిశంకర్‌ప్రసాద్‌ హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో రహదారుల నిర్మాణానికి, గ్రామీణ ప్రాంతాల మరమ్మతులకు నిధులు కేటాయించాలంటూ కేసీఆర్‌ చేసిన విజ్ఞప్తికి ప్రధాని నరేంద్ర మోడీ సానుకూలంగానే స్పందించారు. వరంగల్‌, హైదరాబాద్‌, నాగ్‌పూర్‌ పరిశ్రమల కారిడార్‌ల ఏర్పాటుకు సైతం మోడీ సానుకూలంగానే స్పందించారు. అదేవిధంగా జహీరాబాద్‌లో ప్లాస్టిక్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ను ఏర్పాటుకు కేంద్రం సుముఖత వ్యక్తంచేసింది. ప్రాణహిత- చేవేళ్ల ప్రాజెక్టు జాతీయ హోదా కల్పించాలంటూ చేసిన విజ్ఞప్తిపై ప్రధాని ఆలోచిస్తామని హామీఇచ్చారు. కొత్త రాష్ట్రంలో పన్ను మినహాయింపుపై సైతం కేంద్రం కొంతమేర స్పందించింది. కేసీఆర్‌ మొత్తం 20 అంశాలకు సంబంధించి ప్రధానితో మాట్లాడారు. ధర్మల్‌ పవర్‌ ప్రాజెక్టులకు కొత్త బొగ్గు బ్లాక్‌లను కేటాయించాలని చేసిన విజ్ఞప్తికి సుప్రీంకోర్టులో ఉన్న కేసులు పరిష్కారం అయ్యాక కేటాయిస్తామనే హామీ లభించింది. కృష్ణా, గోదావరి నది జలాల్లో తెలంగాణ వాటాను స్పష్టంచేయాలని కేసీఆర్‌ కోరారు. తెలంగాణలో ఏర్పాటుచేయబోయే వాటర్‌ గ్రిడ్‌కు కేంద్ర సహాయం కోరారు. ఇలా ప్రతిఒక్క సమస్యపై సానుకూలంగా స్పందించిన మోడీ ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పాలని సూచించారు. దీనికి సైతం కేసీఆర్‌ సానుకూలంగా స్పందించారు.