సంస్కారంలేని వారికి ‘స్వేచ్ఛ’ కావాలా?
మీడియా ముసుగులో తెలంగాణను అవమానపరిస్తే పాతరేస్తాం
సీమాంధ్ర మీడియా జాగ్రత్త !
ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరిక
తెలంగాణ అధికార భాషా దినోత్సవంగా కాళోజీ జయంతి
కాళోజీ విశ్వకవి.. వ్యక్తిత్వానికి కొలమానం లేదు
సీఎం కె.చంద్రశేఖర్‌రావు
వరంగల్/హైదరాబాద్, సెప్టెంబర్ 9 (జనంసాక్షి) :
మీడియా స్వేచ్ఛ పేరుతో అవమానిస్తే చూస్తూ ఊరుకొనేదిలేదని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు స్పష్టంచేశారు. సంస్కారంలేని వారికి స్వేచ్ఛ కావాలా? అని ప్రశ్నించారు. తెలంగాణ సమాజాన్ని కించపరిచేలా ప్రసారాలు చేస్తే పాతరేస్తామని సీమాంధ్ర మీడియా ను హెచ్చరించారు. మంగళవారం కాళోజీ శత జయంత్యుత్స వాల్లో కేసీఆర్ ప్రసంగిస్తుండగా కొందరు జర్నలిస్టులు నిరసన వ్యక్తంచేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ ప్రజల ఆగ్రహాన్ని చవిచూసి దాదాపు కనుమరుగైన ఆ రెండు చానెళ్లకు ఇంకా బుద్ధిరాలేదని విమర్శించారు. పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే మెడలు విడిచి అవతల పాడేస్తామని వ్యాఖ్యానించారు. ఆ రెండు చానెళ్లను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించలేదని ఆయన స్పష్టం చేశారు. తనతోపాటు
ఈ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ హాజరైన సభకు సదరు చానళ్ల ప్రతినిధులు ముఖానికి నల్లగుడ్డలు కట్టుకొని వచ్చి మరో తప్పు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ రాష్ట్రం సిద్దించి మొదటిసారిగా కొలువైన శాసనసభనుద్దేశించి అత్యంత నీచంగా వార్తాకథనాలను ప్రసారంచేసి తప్పు చేసినందుకే తెలంగాణ సమాజం ఆ చానెళ్లను కిలోవిూటరు లోతున పాతరేశారని, అయినా వారి డ్రామాలు ఆగట్లేదన్నారు. మొన్న ఢిల్లీలో, ఇవాళ ఇక్కడ పిచ్చిపిచ్చి వేశాలు వేస్తున్నారని జర్నలిస్టులపై మండిపడ్డారు. విూడియా స్వేచ్ఛ పేరుతో ఈ రాష్ట్ర ప్రజానికాన్ని, తెలంగాణ జాతిని అవమానించేలా వార్తలు ప్రసారం చేస్తే పది కిలోవిూటర్ల మేర పాతరేస్తామన్నారు. తెలంగాణ శాసనభ్యులను పట్టుకొని పాచి కల్లు తాగిన ముఖాలాంటారా? టూరింగ్ టాకీసుల సినిమా చేసెటోల్లను పట్టుకొచ్చి మల్టీఫ్లెక్సుల సినిమా చూపిస్తే గిట్టనే ఉంటదని ఎగతాలి చేస్తరా? ఇది సంస్కారమా? ఇది విూడియా స్వేచ్ఛనా..? పత్రిక స్వేచ్ఛ అంటే ఇదేనా..? మెడలు విరిచేస్తాం ఏమనుకున్నారో.. అంటూ మండిపడ్డారు. వ్యక్తిగతంగా కేసీఆర్‌ను తిడితే అభ్యంతరం లేదు..విూడియా స్వేచ్ఛ ముసుగులో ఈ రాష్ట్ర ప్రజలను అవమానిస్తే చూస్తూ ఊరుకోం తాట తీస్తామని హెచ్చరించారు. తెలంగాణ స్వేచ్ఛను అగౌరవపరిస్తే ఊరుకొనేదిలేదని స్పష్టంచేశారు. ముఖ్యమంత్రిగా నేను జాగ్రత్త చెబుతున్నా.. విూడియా సంయమనం పాటించాలని కోరారు. ప్రజాస్వామ్యబద్ధంగా, సంస్కారవంతంగా వ్యవహరిస్తే విూడియాకు గౌరవం దొరుకుతుందని చెప్పారు. తెలంగాణ శాసనసభ అస్తిత్వాన్ని, గౌరవాన్ని కించపరిచేలా వ్యవహరిస్తే మెడలు విడిచి అవతల పడేస్తామన్నారు.
తెలంగాణ అధికార భాషా దినోత్సవంగా కాళోజీ జయంతి
ఇక నుంచి కాళోజీ జయంతిని తెలంగాణ అధికార భాషా దినోత్సవంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. కాళోజీ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా వరంగల్‌లో కాళోజీ కళాక్షేత్రానికి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం నిట్‌లో ఏర్పాటుచేసిన సభలో ఆయన ప్రసంగించారు. కాళోజీ వ్యక్తిత్వానికి కొలమానం లేదని, ఆయన విశ్వకవి అని తెలిపారు. కాళోజీ ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదని.. ఆయన విశ్వ కవి, విశ్వ మానవుడు అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆయనది ఏ విషయాన్ని దాచుకొనే మనస్తత్వం కాదని.. ముక్కుసూటి మనిషి అని పేర్కొన్నారు. కాళోజీ పేరుతో రానున్న రోజుల్లో విశ్వవిద్యాలయం ఏర్పాటుచేస్తామని, ఆయన రచనలు ఇతర భాషల్లోకి అనువదించి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొస్తామన్నారు. ఆయన జయంతి రోజే తెలంగాణ భాష దినోత్సవం నిర్వహిస్తామని ప్రకటించారు. కాళోజీ స్ఫూర్తితో తెలంగాణను అభివృద్ధి చేస్తామని చెప్పారు. దళితవాడల నుంచి దరిద్య్రాన్ని తరిమికొడతామని తెలిపారు. కాళోజీ కవిత్వం ఎంత పాడుకున్నా, ఎంత చెప్పుకున్నా తక్కువేనని అన్నారు. ఆయన ఒక్క వరంగల్‌కో, తెలంగాణకో చెందిన వ్యక్తి కాదని.. విశ్వ మానవుడు అని కొనియాడారు. ఆయన గొంతు నుంచి, కలం నుంచి జాలువారిన మాటలు, కవిత్వాలు విశ్వజనీనమైనవి, సార్వజనీనమైనవి అన్నారు. నా గొడవ అని కాళోజీ అన్నారు. కానీ ప్రజల గొడవే ఆయన గొడవ అని తెలిపారు. ఆయన గొంతులో, కలంలో జాలువారింది ప్రజల గొడవేనని చెప్పారు. విశ్వజనీనమైన ఆలోచనలతో సమాజాన్ని ప్రభావితం చేసిన కాళోజీ విశ్వ మానవుడు అని ప్రశంసించారు. ఆయనను ఎంత పొగిడినా తక్కువేనని.. ఎప్పుడు ఎక్కడ రాజీపడని వ్యక్తిత్వం ఆయనదన్నారు. అలాంటి వ్యక్తితం ఉన్న వారిలో జయశంకర్ సార్ ఒకరని
చెప్పారు. కాళోజీ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని జయశంకర్ సార్ చెప్పవారని గుర్తుచేసుకున్నారు. కాళోజీ ఉన్నతమైన శిఖరం. ఆయన వ్యక్తిత్వానికి కొలమానంలేదని తెలిపారు. అలాంటి వ్యక్తికి చంద్రుడికో నూలుపోగులాగా.. కళాక్షేత్రం ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. ఆయన పేరుతో రవీంద్రభారతిని మించిన ఏసీ కళాక్షేత్రం నిర్మిస్తామని, గ్రంథాలయం, ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. వరంగల్‌లో అందమైన తోటలా కాళోజీ కళాక్షేత్రాన్ని నిర్మిస్తామన్నారు.
పరాయి పాలనలో చాలా బాధపడ్డామని కేసీఆర్ తెలిపారు. కాళోజీ కళాక్షేత్రానికి 500 గజాల స్థలం కావాలని కోరినా ఇవ్వలేదని చెప్పారు. కానీ, తెలంగాణ రాష్ట్రంలో మూడెకరాలు అడిగితే.. మూడున్నర ఎకరాలు ఇచ్చామని చెప్పారు. మూడు ఎకరాల్లో అద్భుతమైన కళాక్షేత్రం నిర్మిస్తామని తెలిపారు. ముందర పెద్ద కాళోజీ కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. ‘కాళోజీ కళాక్షేత్రం ఆషామాషిగా అల్లాటప్పాగా ఉండదు.. 1500 మంది కూర్చొనేలా ఏసీ సౌకర్యంతో రవీంద్రభారతిని మించేలా కళాక్షేత్రం ఉంటుంది. ఇందుకోసం రూ.1200 కోట్లు మంజూరు చేస్తున్నాం. మరో అర ఎకరంలో కాళోజీ ఫౌండేషన్ భవనం ఏర్పాటుచేయనున్నట్లు’ తెలిపారు. కాళోజీ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, ఆ మహానియుడి కుటుంబానికి అండగా ఉంటామన్నారు. కాళోజీ ఫౌండేషన్ పేరిట రూ.10లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి, దానిపై వచ్చే వడ్డీ కుటుంబానికి ఇవ్వనున్నట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన తర్వాత కాళోజీ ఆశీర్వాదం కోసం వచ్చానని కేసీఆర్ తెలిపారు. ‘బిడ్డ మంచిగానే మొదలుపెట్టినవ్. కడదాకా కొట్లాడు’ అని ఆశీర్వదించారు. ఆయన దయ, స్ఫూర్తితో, రాజీలేని పోరాటం చేయాలన్న ఆదేశంతో చివరకు తెలంగాణ సాకారమైందన్నారు. తెలంగాణ ఏర్పడిన ఈ సందర్భంలో కాళోజీ, జయశంకర్ సార్ ఉంటే చాలా సంతోషపడేవారని తెలిపారు. కాళోజీ రచనలు జాతీయ, ఇతర భాషల్లోకి అనువదించనున్నట్లు ప్రకటించారు. మార్కెట్ చేసుకొంటేనే ప్రచారం వస్తుందని తెలిపారు. ఆంధ్రవాల్లు అలా చేసే పొట్టొడ్ని కూడా పొడుగొడ్ని చేసిన్రు అని విమర్శించారు. మన తెలంగాణ వారు చరిత్రకు రాకుండా చేశారన్నారు. కాళోజీ పేరిట ఒక స్టాంప్ విడుదల చేస్తామన్నారు. దీనిపై మంత్రిమండలిలో చర్చించి కేంద్రానికి సిఫార్సు చేస్తామని చెప్పారు. కాళోజీ జయంతి రోజున తెలంగాణ బాష దినోత్సవం నిర్వహిస్తామని పేర్కొన్నారు. సాహిత్య, సామాజిక రంగాల్లో కృషిచేసిన వారికి పురస్కారం అందించేందుకు సిద్ధమని తెలిపారు. అందరి ముఖ్యమంత్రుల్లాగా విూరు కూడా పదవి చేపట్టి, టాటా చెప్పేసి వెళ్లిపోతారా? లేక ఏమన్న చేస్తారా? అని ఎంపీ కే.కేశవరావు తనను ప్రశ్నించారని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా చేసేదిలేదని, పేదల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. దళితులకు మూడెకరాల భూమితో మొదలుపెట్టామని, ఆరంభం మాత్రమే.. ఇది అంత కాదన్నారు. పేదరికం నుంచి లక్ష కుటుంబాలు విముక్తి కావాలి. అది జరిగితే మనం గొప్పోళ్లమన్నారు. లక్ష కుటుంబాలకు మూడెకరాల భూమి ఇచ్చి, వారికి భూస్వాములు చేయాల్సి ఉందని చెప్పారు. కల్యాణలక్ష్మి పేరుతో కొత్త పథకం తీసుకొచ్చామని, దళిత, గిరిజన, మైనార్టీ యువతుల వివాహాలకు రూ.51 వేల కట్నం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందన్నారు.
అలాగే పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యపై కేసీఆర్ విమర్శలు సంధించారు. ‘పొన్నాల లక్ష్మయ్య మెదక్‌లో రోజూ మొత్తుకుంటున్నాడు. ఏం చేయడంలేదని విమర్శిస్తున్నారు. ఏమయ్యా పొన్నాల.. విూ జన్మల దళితులకు భూమి ఇస్తామని ఆలోచన చేశారా? కల్యాణ లక్ష్మి పథకం తేవాలని ఆలోచించిన్రా?’ అని ప్రశ్నించారు.
‘పథకాలన్నీ దసరా నుంచి మొదలైతయని చెప్పినం.. అయినా ఇంత గగబడి ఎందుకు? గోల్‌మాల్ చేయడం, మాయమశ్చింద్ర చేయడం నాకు రాదు.. మంత్రులకు కూడా అదే విషయం చెప్పిన. ఎవరైనా సరే ఆలోచన చేసి ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి.. కాళోజీ అదే చెప్పిండు’ అని అన్నారు. గత ప్రభుత్వాలన్ని అదే చేశాయి.. ఎందుకు అలా చేయాలి. ప్రజాస్వామ్యంగా వ్యవహరిద్దాం.. వాస్తవాలను ప్రజలకు చెబుదాం, చేసేదే చెబుదామని అన్నారు. తత్తరపడి, బిత్తరపడి, ఎవరో ఒక పార్టీ వాడు ఏదో మాట్లాడిండు అని నేను ఆగం కాను అని స్పష్టం చేశారు. చెప్పేదే చేస్తాం.. చేసేదే చెప్తాం.. సాధ్యం కాని విషయాలు అసలే చెప్పమన్నారు. అబద్దాలు చెప్పడం తనకు రాదన్నారు. వంద రోజుల్లో ఏదో చేసేసినమని తన సహచరులు పొగుడుతున్నారని.. వాస్తవానికి ఏవిూ జరగలేదని కేసీఆర్ అన్నారు. కేవలం ప్రణాళికలు చేసుకున్నమని, దాన్ని అమలు చేయాల్సి ఉందన్నారు. ఇచ్చిన మాట తప్పడం గత ప్రభుత్వాలకు చెల్లిందేమో కానీ ఆచరణ సాధ్యమయ్యే హావిూలను మాత్రమే ఇచ్చామని.. ఆరు నూరైనా మాట నెరవేరుస్తామని స్పష్టం చేశారు. మూడేళ్లలో 24 గంటల విద్యుత్ ఇస్తామని, మరో ఏడాదిలో విద్యుత్ సమస్య ఓ కొలిక్కి వస్తుందన్నారు.
ప్రజాకవి కాళోజీ నారాయణరావు వ్యక్తిత్వానికి కొలమానమంటూ లేదని, ఆయన కవిత్వం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అన్నారు. కాళోజీ నారాయణరావు శతజయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని వరంగల్‌లో 15కోట్ల రూపాయలతో నిర్మించతలపెట్టిన కాళోజీ కళాక్షేత్రానికి ముఖ్యమంత్రి కేసిఆర్ మంగళవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ కాళోజీ విశ్వ జనీనమైన వ్యక్తి అని, ఏ సందర్భంలోను రాజీపడే మనసత్వం ఆయనది కాదని, ముక్కుసూటిగా వెళ్లే వ్యక్తి అని కొనియాడారు. ఆయన గురించి వ్యక్తిత్వం గురించి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని ప్రొఫెసర్ జయశంకర్ తనతో అన్నమాటలను కేసీిఆర్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. వరంగల్‌లో కాళోజీ కళాక్షేత్రాన్ని అందమైన తోటలా నిర్మిస్తామని, హైదరాబాద్‌లోని రవీంద్రభారతిని మించిన రీతిలో కాళోజీ కళాక్షేత్రాన్ని తీర్చిదిద్దుతామని కేసిఆర్ అన్నారు. వరంగల్‌లో ఆయన పేరుతో గ్రంధాలయం, ప్రదర్శనశాల ఏర్పాటుచేస్తామని అన్నారు. కాళోజీ రచనలను ఇతర భాషలలోకి అనువదించి అంతర్జాతీయ గుర్తింపు తీసుకువస్తామని కేసిఆర్ సూచించారు. తెలంగాణ ఉద్యమానికి కాళోజీ ఎంతో స్ఫూర్తి ఇచ్చారని అన్నారు. కేంద్రప్రభుత్వంతో చర్చించి కాళోజీ పేరుతో ఒక పోస్టల్ స్టాంపును విడుదల చేస్తామని స్పష్టం చేశారు. కాళోజీ శతజయంతి రోజున తెలంగాణ భాషా దినోత్సవం నిర్వహిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ముందుగా కాళోజీ కూడలిలో గల ఆయన విగ్రహానికి ముఖ్యమంత్రి కేసిఆర్ పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసనసభాపతి మధుసూదనాచారి, ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య, పార్లమెంట్ సభ్యులు కడియం శ్రీహరి, కే.కేశవరావు, కలెక్టర్ జి.కిషన్, పర్యాటక, సాంస్కృతిక, ప్రణాళిక ప్రిన్సిపల్ సెక్రటరీ బిపి ఆచార్య, శాసనమండలి సభ్యులు రాజలింగం, వెంకటేశ్వర్లు, వరంగల్ జడ్పీ చైర్మన్ జి.పద్మ, ఎమ్మెల్యే వినయభాస్కర్, కొండాసురేఖ, శంకర్‌నాయక్, రెడ్యానాయక్‌తోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.