ఆంధ్రప్రదేశ్ మాకు పోటీయేకాదు
మా పోటీ అభివృద్ధి చెందిన రాష్ట్రాలతోటే
ఆరునూరైనా రుణమాఫీ
ఆత్మహత్యల పాపం కాంగ్రెస్‌దే
సర్వేలో పాల్గొన్నట్టే ఓటింగ్‌లో పాల్గొనండి
నర్సాపూర్ బహిరంగ సభలో కేసీఆర్
మెదక్, సెప్టెంబర్ 10 (జనంసాక్షి) :
అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ పోటీయేకాదని టిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంచేశారు. అభివృద్ధి చెందిన రాష్ట్రాల తోనే పోటీ ఉంటుందన్నారు. బుధవారం మెదక్ జిల్లా నర్సాపూర్‌లో బహి రంగ సభలో ఆయన మాట్లాడారు. ఆరునూరైనా రుణమాఫీ అమలు జరుగు తుందని చెప్పారు. రైతుల ఆత్మహత్యల పాపం ముమ్మాటికీ కాంగ్రెస్ పారీ ్టదేనని అన్నారు. సర్వేలో పాల్గొన్నట్టే ఓటింగ్‌లో పాల్గొని టీఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపించాలని ఆయన కోరారు. మెదక్ ఉప ఎన్నికలో తనకు ఇచ్చిన మెజా ర్టీని మించి కనీసం 4, 5 లక్షల మెజార్టీతొ టిఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభా కర్‌రెడ్డిని గెలిపించాలన్నారు. తక్కువ మెజార్టీ ఇచ్చి తెలంగాణను పలుచన చేయొద్దన్నారు. సర్వేకు ఎట్లయితే జనం వచ్చిండ్రో ఈ ఎన్నకల్లో కూడా ఎక్కడెక్కడ ఉన్నోళ్లంతా వచ్చి ఓటేయాలన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి, బిజెపి అభ్యర్థి జగ్గారెడ్డిలు చెల్లని రూపాయిలన్నారు. గత ఎన్నికల్లో వారు ఓడిపోయారని, ప్రజలు వారిని తిరస్కరించాలక మళ్లీ ఎట్లా పనికి వస్తారని అన్నారు. ఇక రైతు రుణమాఫితో సహా ప్రకటించి, హావిూ ఇచ్చిన అన్ని పథకాలను నూటికి నూరుశాతం అమలు చేస్తామన్నారు. తామేం చేసినా తెలంగాణ ప్రజలకోసమేనని, ప్రజల కోరిక మేరకే రాష్ట్రం సాధిం చామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తాను రైతు బిడ్డనని, రైతుల కష్టాలు తెలుసని, రుణమాఫీ అమలుచేసి తీరతామని కేసీఆర్ చెప్పారు. రైతులకు కొత్త రుణాలు ఇవ్వాలని బ్యాంకులకు చెప్పామన్నారు. పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తామని, దసరా నుంచి కల్యాణలక్ష్మి పథకం అమలుచేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రభుత్వ పథకాలు దొంగల పాలు కాకూడదని, ఇళ్లనిర్మాణంలో డబ్బులు మింగినవారి భరతం పడతామని కేసీఆర్ చెప్పారు. సమగ్ర సర్వేలో పాల్గొన్నంత ఉత్సాహంగా మెదక్ ఉప ఎన్నికలో పాల్గొనాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. కనీవినీ ఎరగని రీతిలో పాలన అందిస్తామని హావిూ ఇస్తున్నానన్నారు. 2001లో తాను తెలంగాణ కోసం వచ్చినప్పుడు ఆదరించారని, అదే ఆదరణతో బంగారు తెలంగాన కోసం పనిచేస్తున్నానని అన్నారు. తనను చంపినా అబద్ధం మాట్లాడానని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. తాను ఏం చెప్పినా అమలు చేసి తీరుతానన్నారు. ప్రజలను కొంత మంది నేతలు అయోమయానికి గురి చేస్తున్నారు. ఇతర పార్టీల నేతలు దిమాక్ లేని మాటలు మాట్లాడుతుండ్రు. చేయగలిగిందే చెప్తా.. చెప్పిందే చెస్తా. వాళ్ల వీళ్లలాగా అవినీతికి పాల్పడను. ఈ వంద రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండి ఉంటే రూ. 3, 4 వేల కోట్లు మింగి ఉండేదన్నారు. . కాంగ్రెసోళ్ళు రుణమాఫీ చేస్తలేరని కథలు పుట్టిం చారు. పొన్నాల లక్ష్మయ్య ఏనాడైనా రైతుల గురించి మాట్లాడిండా? ఆయన మాటలు పట్టించుకోవద్దు. వాళ్ల చేతిలో మన్ను కూడా లేదు. రుణమాఫీపై రిజర్వ్ బ్యాంక్‌తో పదే పదే మాట్లాడుతున్నాం. రుణాలు మాఫీ చేసేది టీఆర్‌ఎస్ ప్రభుత్వమే. ఏ కార్యక్రమం చేసినా బంగారు తెలంగాణెళి లక్ష్యం. ఆంధప్రదేశ్ నుంచి వారసత్వ దారిద్రం చాలా ఉంది. వాటిని తరిమేందుకు తెలంగాణ కొత్త చట్టాలు తయారు చేసుకోవాలి. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణలో కొత్త చట్టాలతో ముందుకు పోదామని అన్నారు.
రైతుల ఆత్మహత్యలపై పొన్నాల లక్ష్మయ్య టీఆర్‌ఎస్‌పై నిందలు వేయడం సరికాదని సీఎం అన్నారు. దీనికి గత పదేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ది, పొన్నాలది కాదా అని అన్నారు. దాదాపు 60ఏళ్ల పాలనలో రాష్టాన్న్రి భ్రష్టు పట్టించారని అన్నారు. గత పదేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పాపాలే రైతుల ఆత్మహత్యకు కారణమని తెలిపారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు కూడా కాలేదు అప్పుడే విమర్శలా అని వ్యాఖ్యానించారు. వీరి పాపాలు కడగాలంటే ఎంతకాలం పడ్తదని అన్నారు.
ఇంటి దొంగల పనిపడతాం :
గతంలో ఇచ్చిన హావిూ మేరకు పక్కా ఇళ్లను తప్పకుండా నిర్మింపజేస్తామని కేసీఆర్ స్పష్టంచేశారు. గత ప్రభుత్వ పాలనలో పేదలకు ఇళ్ల నిర్మాణంలో అనేక అక్రమాలు జరిగాయి. వాటిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సీబీసీఐడీని ఆదేశించాం. ఇంటి దొంగల భరతం పట్టాలని సూచించాను. ఇంటి దొంగలపై చర్యలు తీసుకున్న తర్వాతే పథకం ప్రారంభిస్తాం. ప్రభుత్వం చేపట్టే ఒక్క పథకం కూడా వృధాకాకూడదు. ప్రతీ పైసా ప్రజలకు చేరాలనేదే ప్రభుత్వ లక్ష్యం. దసరా తెల్లవారి నుంచి వితంతువులు, వికలాంగులకు పెన్షన్ పథకం అమలు చేస్తాం. దసరా నుంచి కల్లు దుకాణాలు తెరిపిస్తాం. దళితవాడల దారిద్య్రాన్ని తరిమే వరకు పోరాడుతూనే ఉంటాం. కాంగ్రెసోళ్ల లాగా దందాలు చేసే అలవాటులేదని సీఎం కేసీఆర్ మరోసారి పునరుద్ఘాటించారు. ఇప్పటికే ఇందిరమ్మ గృహలపై సీఐడీ విచారణ చేస్తోందన్నారు. విచారణ అనంతరం అవినీతిపరుల నుంచి సొమ్మును రికవరీ చేయిస్తామన్నారు. ప్రభుత్వం నుంచి వెళ్లే ప్రతి పైసా నేరుగా అర్హుడి జేబులోకి వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు. ఎప్పుడు అధికారంలోకి వచ్చి మళ్లీ దందాలు చేయాలని కాంగ్రెసోళ్లు తాపత్రాయ పడుతున్నారని ధ్వజమెత్తారు. వాళ్లలాగా పేదల సొమ్మును జేబులో వేసుకునే అలవాటు తనకు లేదని తేల్చిచెప్పారు. అర్హులందరికీ ఇళ్లు కట్టిచ్చి ఇస్తామని మరోసారి పునరుద్ఘాటించారు. త్వరలోనే అధికారులు గ్రామాల్లో తిరిగి అర్హులను గుర్తిస్తారని చెప్పారు. ఇళ్లు మంజూరైతే ఎగబడేందుకు కాచుకుని కూసున్నారని అన్నారు. అయితే ప్రతి పేదవాడికి ఇచ్చిన హావిూ మేరకు డబుల్ బెడ్‌రూమ్ కట్టించి ఇస్తామని అన్నారు.
గెలిపిస్తే అభివృద్ధిలో ముందుంటా
తనను మెదక్ ఎంపీగా గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేస్తానని టీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. నర్సాపూర్ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ తన విూద నమ్మకం ఉంచి మెదక్ ఎంపీగా పోటీచేయించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. బంగారు తెలంగాణ రావాలంటే టీఆర్‌ఎస్‌నే గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య అభద్రతా భావంతో మాట్లాడుతున్నాడని మంత్రి పోచారం అన్నారు. వైఎస్ పాలనలో పొన్నాల ఏం చేసిండో ప్రజలకు తెలుసునన్నారు. జలయజ్ఞాన్ని ధన యజ్ఞంగా మార్చింది పొన్నాల కాదా అని ప్రశ్నించారు. పొన్నాల వైఎస్ పాలనలో 90 ఛార్జిషీట్లు దాఖలు చేయలేదా అన్నారు. పొన్నాల ఇకనైనా కేసీఆర్‌పై వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని సూచించారు.