వరద నీటిలోనే కాశ్మీరీలు
లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకు చేర్చిన సైన్యం
ఇల్లు వదిలి రావడానికి జంకుతున్న బాధితులు
శ్రీనగర్, సెప్టెంబర్ 11 (జనంసాక్షి) :
జమ్మూకాశ్మీర్ ప్రజలు ఇప్పటికీ వరద నీటిలోనే ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటివరకు సైన్యం లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకు చేర్చింది. అయితే ఇల్లు వదిలి రావడానికి అక్కడి బాధిత ప్రజలు జంకు తున్నారు. దాదాపు వందేళ్లలో కనీవినీ ఎరగని రీతిలో వరద ముంపును ఎదుర్కొన్న జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో పరిస్థితి ఇప్పటికీ దయనీయంగానే ఉంది. అనేక ప్రాంతాల్లో ప్రజలు ఇంకా వరద ప్రాంతాల్లోనే చిక్కుకుని సాయం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే వీరికి ఆహారం, నీరు సరఫరా చేస్తున్నామని, మందులు పంపించామని ఆ రాష్ట్ర సిఎం ఓమర్ అబ్దుల్లా వెల్లడించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు. బాధితులకు రక్షణగా ఉంటామని అన్నారు. మరోవైపు సైన్యమే తమకు సాయం అందిస్తోందని, రాష్ట్రప్రభుత్వం ఏవిూ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు వరదబాధితులు. ఆహారం సరఫరా గురించి, పునరావాస శిబిరాల్లో వసతులలేమి గురించి వారు ఫిర్యాదు చేస్తున్నారు. భారీ వర్షాలు ప్రారంభంకావడానికి ముందే తాము పలు ప్రదేశాలనుంచి అప్రమత్తంగా ఉండాలని ప్రకటనలు చేయించామని, ప్రజలు వాటిని పెడచెవిన పెట్టారని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆరోపిస్తున్నారు. ఆయన పలు పునరావాస శిబిరాలను సందర్శించి ఆహారం అందించారు. మరోవైపు సైన్యం పూర్తిస్తాయిలో రంగంలోకి దిగి సహాయక చర్యలను వేగం చేసింది. ఇప్పుడిప్పుడే ముంపు నెమ్మదిగా తగ్గుముఖం పడుతోంది. అయినా అసలు సవాలు ఇప్పుడే ఉందంటున్నాయి సహాయ చర్యలు చేపడుతున్న సంస్థలు. నీటి మధ్య చిక్కుకున్న వారిని సురక్షితప్రాంతాలకు తరలించాలని ప్రయత్నిస్తున్న సిబ్బందికి ఇళ్లు వదిలిరావడానికి ఇష్టపడని వారే ఎక్కువగా కన్పిస్తున్నారు. పైగా తమకు ఆహారం, నీళ్లూ సరఫరా చేయాల్సిందిగా వారు డిమాండ్‌చేస్తున్నారు. మరి కొన్ని ప్రాంతాల్లోనేమో తమను సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లడంలో జాప్యం చేస్తున్నారంటూ వరద బాధితులు సిబ్బంది విూదే విరుచుకుపడుతున్నారు. పలుచోట్ల సిబ్బందివిూద, వారి హెలిక్టాపర్లవిూద రాళ్లు విసిరి దాడులకు సైతం పాల్పడ్డారు. రోజుల తరబడి ప్రాణాలరచేత పెట్టుకుని వరదనీటి మధ్య చిక్కుకున్నవారి నిస్పృహను అర్థం చేసుకోవచ్చని, అయితే వారికి నచ్చజెప్పి సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి సిబ్బంది పడుతున్న అష్టకష్టాలను కూడా అర్థం చేసుకోవాలని అధికారులు అంటున్నారు. ఎలాంటి దాడులు సరికాదని సిఎం ఇప్పటికే పలుమార్లు విన్నవించారు. సాయం చేసేవారిని దూరం చేసుకోవద్దన్నారు. ఇప్పటివరకూ సహాయ చర్యల్లో పాల్గొంటున్న ఎన్డీఆర్‌ఎఫ్ 18,600 మందిని, సీఆర్‌పీఎఫ్ పాతికవేలమందిని, ఆర్మీ 50వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. మరో పక్క ముంపు తగ్గుముఖం పడుతున్నా… ఎక్కడికక్కడ కొట్టుకువచ్చిన చెత్త, విరిగిపడినచెట్లు, వైర్లు, రాష్ట్ర ప్రభుత్వ సిబ్బందినుంచి తగిన సహకారం లభించని వైనం… వెరశి సహాయ చర్యల్లో పాల్గొంటున్నవారికి విధినిర్వహణ కత్తి విూద సాము అవుతోంది. ప్రాధాన్యక్రమంలో ముందుగా తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాలపై దృష్టిపెట్టాలని ప్రయత్నిస్తున్న కేంద్ర బలగాలకు ఆయా ప్రాంతాలకు దారి చూపాల్సిన బాధ్యత రాష్ట్రప్రభుత్వ సిబ్బందిపై ఉంది. అయితే వరద సమస్యల్లోనే తలమునకలుగా ఉన్న వారు ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించలేకపోవడంతో కేంద్ర బలగాల పని మరింత క్లిష్టమవుతోంది. ఎక్కడికక్కడ చిక్కుకుని ఉన్నవారిని వెతుక్కుంటూ వెళ్లి ఆహారం, నీళ్లు, దుప్పట్లు, మందులు సరఫరా చేసేపని ఇప్పుడు యుద్ధప్రాతిపదికన చేపడుతున్నట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. భారీ వరదలతో అతలాకుతలమైన జమ్మూకాశ్మీర్లో బాధితులను ఆదుకునేందుకు ఆర్మీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగిస్తోంది. ఇప్పటివరకూ వరద ప్రాంతాల్లో 77 వేలమంది బాధితులను రక్షించారు. మృతుల సంఖ్య 215కి పెరిగింది.
ఆప్‌కే సాత్ హమ్ హై
రూ.10కోట్ల సహాయం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
ఒమర్ అబ్దుల్లాతో ఫోన్‌లో మాట్లాడిన కేసీఆర్
హైదరాబాద్, సెప్టెంబర్ 11 (జనంసాక్షి) :
జమ్మూకాశ్మీర్ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. వరద ల్లో సర్వం కోల్పోయిన బాధితు లను ఆదుకు నేందుకు.ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రూ.10కోట్ల ఆర్థిక సహాయం ప్రకటించారు. ఈమేరకు గురువారం జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో కేసీఆర్ ఫోన్‌లో మాట్లాడారు. అక్కడి తాజా పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు.