మెదక్‌ ఉప ఎన్నిక ప్రశాంతం

CV

66శాతం పోలింగ్‌

చింతమడకలో ఓటేసిన కేసీఆర్‌

స్థానిక కారణాలతో పలుచోట్ల ఎన్నికల బహిష్కరణ

గెలుపు మాదే : హరీశ్‌

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 13 (జనంసాక్షి) :

మెదక్‌ లోక్‌సభ ఉప ఎన్నిక శనివారం ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 66శాతం పోలింగ్‌ నమోదైంది. తన సొంత గ్రామం చింతమడకలో ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్‌రావు ఓటేశారు. స్థానిక కారణాలతో పలుచోట్ల ప్రజలు ఎన్నికలు బహిష్కరించారు. అయితే పోలింగ్‌ సరళి తమకే అనుకూలంగా ఉందని, తమ అభ్యర్థే విజయం సాధిస్తాడని మంత్రి హరీశ్‌రావు ధీమా వ్యక్తంచేశారు. ఉదయం మందకొడిగా మొదలైన ఓటింగ్‌ మధ్యాహ్నానికి పుంజుకొంది. పోలింగ్‌ ప్రారంభమైన తొలి రెండు గంటల్లోపు కేవలం 15శాతం మాత్రమే ఓటింగ్‌ నమోదైంది. ఉదయం 11 గంటల తర్వాత ఓటింగ్‌ క్రమంగా పుంజుకొంది. అన్ని పోలింగ్‌స్టేషన్ల వద్ద ఓటర్లు బారులుతీరారు. ప్రజలు పెద్దసంఖ్యలో ఓటు వేసేందుకు తరలిరావడంతో పోలింగ్‌కేంద్రాలు కిటకిటలాడాయి. మరోవైపు, పలుచోట్ల ఈవీఎంలు మొరాయించగా, మరికొన్ని చోట్ల ప్రజలు ఓటింగ్‌ను బహిష్కరించారు. ఉప ఎన్నికల్లో పలువురు ప్రముఖులు తమ ఓటుహక్కు వినయోగించుకున్నారు. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు తన సతీమణితో కలిసి తన స్వగ్రామం చింతమడకలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. కేసీఆర్‌ దంపతులు క్యూలైన్‌లో వెళ్లి ఓటు వేయడం విశేషం. మంత్రి హరీశ్‌రావు సిద్దిపేటలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటువేశారు. మెదక్‌ లోక్‌సభ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి దుబ్బాక మండలం పోచారంలో, బీజేపీ-టీడీపీ కూటమి అభ్యర్థి జగ్గారెడ్డి సంగారెడ్డిలో ఓటు వేశారు. కాంగ్రెస్‌ అభ్యర్థి, మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి శివ్వంపేట మండలం గోమారంలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. పోలింగ్‌ ఆరంభమైన కొద్దిసేపటికే సిద్దిపేటలోని భరత్‌నగర్‌, మార్కెట్‌యార్డు పోలింగ్‌స్టేషన్లలో ఈవీఎంలు పని చేయకపోవడంతో పోలింగ్‌ నిలిచిపోయింది. ఈవీఎంలు మార్చి కొత్తవి ఏర్పాటు చేయడంతో పోలింగ్‌ ఆలస్యంగా ప్రారంభమైంది. మెదక్‌ మండలి తిమ్మాపూర్‌లో ఈవీఎం మొరాయించడంతో పోలింగ్‌ ప్రారంభం కాలేదు. రామాయంపేట మండలంలోనూ ఓ పోలింగ్‌స్టేషన్‌లోనూ ఈవీఎం మొరాయించింది.

పోలింగ్‌కు దూరంగా పలు గ్రామాలు

ములుగు మండలం గంగాపూర్‌లో గ్రామస్తులు పోలింగ్‌ను బహిష్కరించారు. గ్రామాభివృద్ధిని పట్టించుకోలేదని వారు ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారులు పోలింగ్‌ కేంద్రం ఏర్పాటుచేయలేదని, అందుకే తాము ఓటుహక్కు వినియోగించుకోవడం గ్రామస్తులు తెలిపారు. వెల్దుర్తి మండలం పెద్దాపూర్‌లో పోలింగ్‌ను గ్రామస్తులు బహిష్కరించారు. గ్రామానికి సరైన రహదారి సదుపాయం లేకపోవడం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోవడాన్ని నిరసిస్తూ పోలింగ్‌ను బహిష్కరించామని వారు చెప్పారు. జిల్లాస్థాయి అధికారులు వచ్చి హావిూ ఇచ్చే వరకు ఓటింగ్‌లో పాల్గొనమని గ్రామస్తులు తేల్చి చెప్పారు. తూప్రాన్‌ మండలం కూచారం తండాలో గ్రామస్తులు పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. తండాకు రోడ్డు వేయలేదంటూ పోలింగ్‌ను బహిష్కరించారు.