గులాబీ గుబాలింపు
మెదక్‌లో సత్తా చాటిన తెరాస
భారీ మెజార్టీతో ప్రభాకర్‌రెడ్డి గెలుపు
రెండో స్థానంలో కాంగ్రెస్, మూడో స్థానంలో బిజెపి
హైదరాబాద్, సెప్టెంబర్ 16 (జనంసాక్షి) :
మెదక్‌లో గులాబీ గుబాలించింది. లోక్‌సభ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్ పార్టీ సత్తా చాటింది. ఆ పార్టీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ రెండో స్థానానికి, బిజెపి మూడో స్థానానికి పరిమితమయ్యాయి. అందరూ ఊహించినట్లుగానే నాలుగు లక్షల పైచిలుకు మెజార్టీ టీఆర్‌నఎస్ సాధించి ప్రత్యర్థులను చిత్తుచేసింది. లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఎక్కడ కూడా కాంగ్రెస్, బీజేపీ పోటీ ఇవ్వలేదు. రెండో స్థానం కోసమే ఆ రెండు పార్టీల మధ్య పోటీ సాగింది. కొత్త రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకున్న ఉద్యమ పార్టీ… వంద రోజుల పాలనపై వచ్చిన విమర్శలను తట్టుకొని నిలబడింది. ఆ పార్టీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి ఘన విజయం సాధించగా, కాంగ్రెస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి రెండో స్థానంలో నిలిచారు. బీజేపీ-టీడీపీ ఉమ్మడి అభ్యర్థి తూర్పు జయప్రకాశ్‌రెడ్డి మూడో స్థానానికే పరిమితమయ్యారు. జగ్గారెడ్డి సొంత నియోజకవర్గం సంగారెడ్డిలోనూ గులాబీ పార్టీ ఆధిక్యం సంపాదించడం విశేషం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి సొంతమైన నర్సాపూర్‌లోనూ అధికార పార్టీ సత్తా చాటింది. ఏకపక్షంగా సాగిన పోరులో ఘన విజయం సాధించింది. 3.61లక్షల పైచిలుకు ఓట్ల మెజార్టీతో ప్రభాకర్‌రెడ్డి గెలుపొందారు. టీఆర్‌ఎస్ భారీ విజయంతో పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. బాణాసంచా కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు, విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. కౌంటింగ్ కేంద్రంతోపాటు తెలంగాణ భవన్‌లోనూ సంబరాలు నిర్వహించారు.
అన్ని సెగ్మెంట్లలో ఆధిపత్యం
విస్తృత ప్రచారంతో విపక్షాలను కలవరపెట్టిన టీఆర్‌ఎస్.. ఊహించినట్లుగానే భారీ విజయం కైవసం చేసుకుంది. గతంలో కేసీఆర్ సాధించిన మెజార్టీని తిరగరాస్తూ.. ప్రభాకర్‌రెడ్డి రికార్డు స్థాయిలో ఓట్లు సాధించారు. బీజేపీ, కాంగ్రెస్‌లు ఆయన దరిదాపుల్లోకి రాలేదు. మొత్తం 10 లక్షల పైచిలుకు ఓట్లు పోలవగా.. సగానికి పైగా ఆయనకే పడడం గమనార్హం. మొత్తం 10,46,080 ఓట్లు పోలయ్యాయి. టీఆర్‌ఎస్‌కు 5,71,800, కాంగ్రెస్‌కు 2,10,523, బీజేపీకి 1,86,334 ఓట్లు లభించాయి. అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో టీఆర్‌ఎస్ ఆధిక్యం సంపాదించడం విశేషం. సిద్దిపేట, గజ్వేల్, సంగారెడ్డి, నర్సాపూర్, మెదక్, దుబ్బాకలలో ఆ పార్టీ పట్టు నిలుపుకొంది. జగ్గారెడ్డి సొంత నియోజకవర్గమైన సంగారెడ్డిలోనూ 19 వేలు, సునీతాలక్ష్మారెడ్డి నియోజకవర్గమైన నర్సాపూర్‌లో 6 వేల పైచిలుకు మెజార్టీ లభించడం విశేషం. ఇక హరీశ్‌రావు కంచుకోట అయిన సిద్దిపేట సెగ్మెంట్‌లో 86 వేలు, మెదక్ సెగ్మెంట్‌లో 41 వేలు, దుబ్బాకలో 67 వేల ఓట్ల ఆధిక్యం సంపాదించింది. మొదటి రౌండ్ నుంచి టీఆర్‌ఎస్ ఆధిక్యం కొనసాగింది. రెండో స్థానం కోసం తొలి నుంచి కాంగ్రెస్, బీజేపీ మధ్య ¬రా¬రీ పోరు నెలకొంది. ఒక రౌండ్‌లో కాంగ్రెస్ ఆధిక్యంలో వెళ్లగా, మరో రౌండ్‌లో బీజేపీ ఆధిక్యంలోకి రావడంతో రెండో స్థానంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
డిపాజిట్లు దక్కించుకున్న విపక్షాలు
ఉప ఎన్నికలో ఘోర ఓటమి మూటగట్టుకున్న కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్లు దక్కడం కొంతలో కొంత ఊరట కలిగించే అంశం. ఆ రెండు పార్టీలు తమకు పోటీయే కాదని, వారికి డిపాజిట్ కూడా దక్కదని మొదటి నుంచీ టీఆర్‌ఎస్ చెబుతూ వస్తోంది. తెలంగాణ వ్యతిరేకులైన జగ్గారెడ్డి, సునీతాలక్ష్మారెడ్డిలకు డిపాజిట్ దక్కనీయోద్దని విస్తృతంగా ప్రచారం చేసింది. అయితే, అధికార పార్టీకి ఎక్కడా పోటీ ఇవ్వని కాంగ్రెస్, బీజేపీ డిపాజిట్ దక్కించుకోవడం విశేషం. ఓడిపోయినప్పటికీ డిపాజిట్ దక్కడం ఆ రెండు పార్టీలకు కొంత సాంత్వన చేకూర్చింది.
ప్రజలు మా వెంటే: ప్రభాకర్‌రెడ్డి – ఓటర్లందరికీ ధన్యవాదాలు
టీఆర్‌ఎస్ ప్రభుత్వం పట్ల ప్రజలకు నమ్మకం ఉందని చెప్పడానికి మెదక్ ఉప ఎన్నిక ఫలితామే నిదర్శనమని ఆ పార్టీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు వల్లే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారని చెప్పారు. తనకు వచ్చిన మెజార్టీయే అందుకు నిదర్శనమన్నారు. మెదక్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ విజయం ఊహించినదేనని తెలిపారు. మంగళవారం ఫలితాలు వెలువడిన అనంతరం ప్రభాకర్‌రెడ్డి విూడియాతో మాట్లాడారు. ఓటింగ్ శాతం తగ్గినా టీఆర్‌ఎస్‌కు మంచి మెజార్టీ వచ్చిందని చెప్పారు. ఈ విజయం నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలకు అంకితమన్నారు. ప్రజలు టీఆర్‌ఎస్‌ను నమ్మారని, మా ప్రభుత్వం విూద ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారని చెప్పారు. ప్రణాళికాబద్దంగా వెల్తున్న కేసీఆర్‌కు మరోసారి మద్దతుగా నిలిచారని తెలిపారు. తనను ఆదరించిన ప్రజలకు, ఓటర్లకు, పార్టీ నేతలు, కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. టీఆర్‌ఎస్‌కు ఓటర్లు బ్రహ్మరథం పట్టారని, తమ అధినేత కేసీఆర్ పట్ల సంపూర్ణ విశ్వాసం ఉంచి ఓటు వేశారన్నారు. మెదక్ జిల్లాపై కేసీఆర్‌కు ప్రత్యేక శ్రద్ద ఉండడం వల్లే భారీ మెజార్టీ సాధ్యమైందన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎల్లవేళలా జిల్లా అభివృద్ధి కోసం పాటుపడతామన్నారు. కేసీఆర్ ఇచ్చిన మాట విూద నిలబడి హావిూలను నెరవేరుస్తున్నారని, వంద రోజుల పాలనే అందుకు నిదర్శనమన్నారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఎంతగా విమర్శలు చేసినా ప్రజలు వారిని నమ్మలేదని చెప్పారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో అందరం పాలుపంచుకుంటామని తెలిపారు.