మెట్రో ఆగదు
సీమాంధ్ర మీడియా దుష్ప్రచారం
ప్రాజెక్టుపై సమీక్షించిన సీఎం కేసీఆర్
హైదరాబాద్, సెప్టెంబర్ 17 (జనంసాక్షి) :
ఆరునూరైనా మెట్రో రైలు ప్రాజెక్టు ఆగదని ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. మెట్రోపై సీమాంధ్ర మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రాజెక్ట్ ఒప్పందం నుంచి వైదిలిగేందుకు సిద్ధమని నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ రాసినట్లు పత్రికల్లో వచ్చిన లేఖపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు బుధవారం సవిూక్షించారు. ప్రతి ష్టాత్మక హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు (హెచ్‌ఎం ఆర్) సంక్షోభంలో చిక్కుకున్నట్లు వస్తున్న వార్తలపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ప్రాజెక్టు నిర్మాణం లో ఎలాంటి వివాదం లేదని, యథావిధిగా పనులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. నిర్దేశిత గడువు లోగా ప్రాజెక్టును పూర్తిచేస్తామని హెచ్‌ఎంఆర్ ప్రక టించింది. మరోవైపు, నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ కూ డా పత్రికల్లో వచ్చిన వార్తలను తోసిపుచ్చింది. మెట్రో రైలు ప్రాజెక్టుపై వస్తున్న వదంతులను నమ్మవద్దని పేర్కొంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, మెట్రో రైలు ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డిలతో పరిస్థితిని సవిూక్షించారు. మెట్రో ప్రాజెక్టు రైలు ఒప్పందం నుం చి తప్పుకొనేందుకు నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ వైదొ లిగేందుకు సిద్ధమైందని బుధవారం పత్రికల్లో పతాక శీర్షికల్లో వార్తలు వచ్చాయి. ప్రాజెక్టు నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారంలో సహకార లోపం, హెచ్‌ఎంఆర్‌పై కినుక వహించిన ఎల్‌అండ్ టీ.. ఒప్పందం నుంచి తప్పుకొనేందుకు సిద్ధమైందని వార్తలొచ్చాయి. అవసరమైతే తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వమే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని నిర్మాణ సంస్థ పేర్కొంది. రాష్ట్ర విభజన వల్ల హైదరాబాద్ ప్రాధాన్య తల్లో వచ్చిన అనూహ్య మార్పులతో ఈ ప్రాజెక్టు ఆర్థికంగా పెనుభారం కానుందని, అలాగే, లాభదాయకత కాదని భావిస్తున్నట్లు ఎల్‌అండ్‌టీ లేఖ రాసినట్లు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయమే మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మతో సమావేశమయ్యారు. ప్రాజెక్టు పనితీరుపై వివరణ ఇచ్చారు. అనంతరం మునిసిపల్ శాఖ ముఖ్య కార్యదర్శితో సమావేశమై పరిస్థితిని వివరించారు. అనంతరం సీఎస్ రాజీవ్‌శర్మతో కలిసి సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమయ్యారు. మెట్రో ప్రాజెక్టు పనుల స్థితిగతులు, ఎల్‌అండ్‌టీ లేఖ తదితర అంశాలపై ముఖ్యమంత్రికి వివరించారు. పత్రికల్లో వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని, పనులు సజావుగా సాగుతున్నాయని పేర్కొన్నారు. గడువులోగా పనులు పూర్తి చేయాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ సూచించినట్లు తెలిసింది. విూడియాలో వచ్చే వార్తలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. దానిపై అవసరమైతే తానే వివరణ ఇస్తానని చెప్పినట్లు సమాచారం.భారతదేశంలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) విధానంలో చేపట్టిన ప్రాజెక్టుల్లో మొట్టమొదటిది హెచ్‌ఎంఆర్. మొత్తం మూడు కారిడార్లలో 70 కిలోవిూటర్ల మేర రూ.14 వేల కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టును 2017లోగా పూర్తి చేయాల్సి ఉంది. నాగోలు-మాదాపూర్ కారిడార్‌లో పనులు వేగంగా సాగుతున్నాయి. 2015 మార్చి నాటికి నాగోలు-మెట్టుగూడ మధ్య మెట్రో రైలు ప్రయాణాలు ప్రారంభించేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. ఉగాది రోజున ప్రతిష్టాత్మకంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మెట్రో ప్రాజెక్టు సంక్షోభంలో చిక్కుకోవడం ఆందోళన కలిగించే అంశం. అయితే, ప్రాజెక్టు యథావిధిగా కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కొందరు పనిగట్టుకొని కుట్రలు చేస్తున్నారని, తెలంగాణ ప్రభుత్వాన్ని చిన్నగా చూపేందుకు యత్నిస్తున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఎల్‌అండ్‌టీ లేఖ రాసిన విషయం తనకు తెలియదని, పత్రికల్లోనే చూశానన్నారు. దీనిపై ముఖ్యమంత్రి సవిూక్ష నిర్వహించి, సరైన సమయంలో స్పందిస్తారని చెప్పారు.
వార్తల్లో వాస్తవం లేదు: ఎన్‌వీఎస్ రెడ్డి
మెట్రో ప్రాజెక్టు కొనసాగింపుపై ఎలాంటి ప్రతిష్టంభన లేదని హెచ్‌ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పష్టంచేశారు. మెట్రో పనులు కొనసాగుతాయని, పనలు ఆగే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పత్రికల్లో వచ్చిన వార్తల్లో వాస్తవం లేదన్నారు. మెట్రో పనులు ఆగే ప్రసక్తేలేదని, ఎల్‌అండ్‌టీ కంపెనీతో మెట్రో పనులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. నిర్ణీయ సమయంలో మెట్రో పనులు పూర్తవుతాయని ధీమా వ్యక్తం చేశారు. పత్రికల్లో వచ్చిన వార్తలు రాష్ట్ర విభజనకు ముందు రాసిన ఉత్తరాలకు సంబంధించినవని చెప్పారు. ఇప్పటికి నాలుగుసార్లు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయని వివరించారు. ప్రస్తుత ప్రభుత్వంతో ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలు జరగడం లేదని తెలిపారు. ఉత్తరప్రత్యుత్తరాలు జరుగుతూనే ఉంటాయి. అలాంటి వాటికి మేం సమాధానం ఇస్తుంటామన్నారు. మెట్రో పనులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని.. సాఫీగా జరుగుతాయని వెల్లడించారు. కొందరు కావాలనే విూడియాకు లీకులు ఇచ్చి వార్తలు రాయిస్తున్నారని మండిపడ్డారు. పనులు నిలిచిపోయాన్న వార్తల్లో వాస్తవం లేదని, మెట్రో పనులు కొనసాగుతున్నాయి.. ఎక్కడా ఆగలేదన్నారు.
వదంతులు నమ్మొద్దు: ఎల్‌అండ్‌టీ
జంటనగరాల ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు చేపట్టిన హెచ్‌ఎంఆర్ ప్రాజెక్టుకు ఎలాంటి ఆటంకాలు లేవని నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ స్పష్టం చేసింది. దీనిపై వస్తున్న వదంతులను నమ్మొద్దని ఆ సంస్థ అధికారులు తెలిపారు. ప్రాజెక్టు అమలు విషయంలో కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిపై ప్రబుత్వంతో ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగుతూనే ఉంటాయని వివరించారు. ప్రాజెక్టుకు ఎలాంటి అడ్డంకులు లేవని, కొంత మంది కావాలనే దీనిపై వదంతులు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు.
మెట్రోపై తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం
మెట్రోపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా పత్రికల్లో కథనాలు రాస్తున్నారని సీఎంవో విమర్శించింది. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం పత్రికా ప్రకటన విడుదలచేసింది. ఎల్‌అండ్‌టీ, ప్రభుత్వం మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు సాధారణమని సీఎంవో పేర్కొంది. మెట్రో ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి కార్యాలయం పత్రికా ప్రకటనను విడుదల చేసింది. మెట్రో ప్రాజెక్టు అంశంలో ఎల్‌అండ్‌టీ, ప్రభుత్వం మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు సాధారణమేనని సీఎంవో కార్యాలయం పేర్కొంది. కొన్ని పత్రికలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా కథనాలను రాస్తున్నాయని తెలిపారు. మెట్రో ప్రాజెక్టు అంశంపై చర్చించేందుకు సీఎస్ రాజీవ్‌శర్మ, ప్రభుత్వ సలహాదారు పాపారావు త్వరలో ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసేలా కొన్ని పత్రికలు కధనాలు రాస్తున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కార్యాలయం వ్యాఖ్యానించింది. కెసిఆర్ తో ఎల్‌అండ్‌టి సిఇఓ గాడ్గిల్ భేటీ అయిన తర్వాత గాడ్గిల్ తమ లేఖపై వివరణ ఇవ్వగా,ఆ తర్వాత సీఎం కార్యాయం ఒక ప్రకటన చేసింది. అందులో కావాలని తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతినేలా కొన్ని పత్రికలు కొన్ని అంశాలనే రాశాయని కార్యాలయం వ్యాఖ్యానించింది. ఎల్‌అండ్‌టి కంపెనీకి, ప్రభుత్వానికి మధ్య లేఖలు రాయడం సాధారణమేనని, దానిని దురుద్దేశ్యంతో కొంత భాగమే రాశారని కార్యాలయం వ్యాఖ్యానించింది. మెట్రో ప్రాజెక్టు ఇమేజీ దెబ్బతీయడానికి ప్రయత్నించారని పేర్కొన్నారు. కాగా ఈ సమస్య పరిష్కారం అయిందని,మెట్రోను మరింత ముందుకు తీసుకువెళ్లడానికి రెండో దశపై అనుమతులు సాధించేందుకు ఢిల్లీ వెళ్లి సంప్రదింపులు జరపాలని కూడా సంబందిత అధికారులను ఆదేశించారు. కాగా గాడ్గిల్ కూడా లేఖలోని కొన్ని అంశాలనే రాయడం ప్రమాదకరమని వ్యాఖ్యానించడం విశేషం. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసేలా రెండు పత్రికలు మెట్రోపై కథనాన్ని ప్రచురించాయని పేర్కొన్నారు. మెట్రోరైలు ఎల్‌అండ్‌టీ, ప్రభుత్వం మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు సర్వసాధారణమని తెలిపింది. ఉద్దేశపూర్వకంగానే తప్పుదోవ పట్టించేలా రెండు పత్రికల కథనాలు ఉన్నాయని పేర్కొంది. మెట్రో రైలు ప్రాజెక్టుపై రెండు పత్రికల్లో వచ్చిన కథనాలు తెలంగాణ, హైదరాబాద్ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి సముద్రాల వేణుగోపాలచారి అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా కథనాలు రాయటం ఏమేరకు సమంజసమని ఆయన అడిగారు. ప్రైవేటు కంపెనీకి వత్తాసు పలికేలా కథనాలు రాయటం వెనకున్న ఉద్ధేశాలను ఆయన ప్రశ్నించారు. మెదక్ ఉప ఎన్నికలో తెలంగాణ రాష్ట్ర సమితి ఘన విజయం సాధించిన విషయానికి ప్రాధాన్యత తగ్గించడానికి మెట్రో వివాదాన్ని కొందరు తెరవిూదకు తెచ్చి ఉండవచ్చన్న అనుమానాన్ని ఐటి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు వ్యక్తంచేశారు. తాను కూడా విూడియాలోనే ఈ విషయాన్ని చూశానని అన్నారు.సరిగ్గా ఉప ఎన్నిక ఫలితం వెలువడిన రోజునే ఈ లేఖ బయటకు రావడం వెనుక ఏదో ఉందని అనుమానం వ్యక్తంచేశారు. అయితే గతంలో కూడా ఎల్‌అండ్‌టి సంస్థ వారు తమ ఇబ్బందులను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారని అన్నారు. పనులు ఎక్కడా ఆగలేదని, కాకపోతే కొన్ని చోట్ల మార్పు విషయంలో పరిశీలించాలని ప్రభుత్వం కోరిందని ఆయన అన్నారు.