అంతర్జాతీయంగా అత్యుత్తమ పారిశ్రామిక విధానం మనది

ccc

దేశంలోనే తెలంగాణ టాప్‌

ఆకుపచ్చని మహబూబ్‌నగర్‌ జిల్లా

వలసలు ఆగాలి.. ప్రాజెక్టులు పూర్తి కావాలి..

ప్రతి ఇంటికి తాగునీటి నళ్లా

బంగారు తెలంగాణ లక్ష్యంగానే సర్కారు

సీఎం కె.చంద్రశేఖర్‌రావు

కోజెంట్‌ గ్లాస్‌ పరిశ్రమ ప్రారంభం

మహబూబ్‌నగర్‌, సెప్టెంబర్‌ 18 (జనంసాక్షి) : తెలంగాణ ప్రభుత్వానిది అంతర్జాతీయంగా అత్యుత్తమ పారిశ్రామిక విధానం అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఉత్తమ స్థానంలో నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. పలేరుగాయల జిల్లాను ఆకుపచ్చిని మహబూబ్‌నగర్‌గా మారుస్తానని హామీనిచ్చారు. జిల్లాలోని ప్రాజెక్టులు పూర్తిచేసి వలసలు నివారిస్తానన్నారు. ప్రతి ఇంటికి తాగునీరు అందించడమే తమ లక్ష్యమన్నారు. బంగారు తెలంగాణ లక్ష్యంగా తెలంగాణ సర్కారు ముందుకు సాగుతుందన్నారు.  గురువారం మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్డాకుల మండలం వేములలో కోజెంట్‌ గ్లాస్‌ పరిశ్రమను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో సీఎం ప్రసంగించారు. పరిశ్రమలకు కేవలం 15 రోజుల్లోనే అన్ని అనుమతులు ఇవ్వనున్నట్లు చెప్పారు. బంగారు తెలంగాణ నిర్మాణానికి అందరూ కలిసిరావాలని పిలుపునిచ్చారు. అనేక ఉద్యమాలు, పోరాటాలు, త్యాగాలు చేసి ప్రత్యేక రాష్టాన్న్రి సాధించుకున్నామని.. అయినా తెలంగాణకు వ్యతిరేకంగా ఇంకా కుట్రలు కొనసాగుతున్నాయని తెలిపారు. వాటిన్నంటినీ ఛేదించుకుని మందుకు వెళ్తామని, భారతదేశంలో నెంబర్‌వన్‌ రాష్ట్రంగా ఎదుగుతామని ప్రకటించారు. తెలంగాణ ఉద్యమం జరిగే సందర్భంలో చాలా మంది విద్యార్థులు, యువకులు స్థానిక పరిశ్రమల్లో  ఉద్యోగాలు ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేసేవారని కేసీఆర్‌ గుర్తుచేశారు. ఇక నుంచి అలాంటి వాటికి అవకాశం ఉండదని చెప్పారు. కోజెంట్‌ పరిశ్రమలో 70శాతం మంది స్థానికులను నియమించాని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. భవిష్యత్తులో మరో 500మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారన్నారు. కోజెంట్‌ పరిశ్రమతోపాటు కొత్తూరు ప్రాంతంలో మరో రెండు ఫ్యాక్టరీలు వస్తున్నాయని, అందులో స్థానికులకు ఉద్యోగాలు లభిస్తాయన్నారు. కోజెంట్‌ పరిశ్రమ సహా మరో రెండు పరిశ్రమల అనుమతులకు చాలా చాలా ఇబ్బందులు పెట్టారని తెలిసిందని, ఇది చాలా బాధాకరమని అన్నారు. ఇక నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిశ్రమలకు అనుమతులు ఇస్తామన్నారు. ఈ మేరకు కొత్త పారిశ్రామిక విధానం తీసుకురానున్నట్లు తెలిపారు. ముసాయిదా పారిశ్రామిక విధానం రెడీగా ఉందన్నారు. ప్రపంచంలోనే నెంబర్‌ వన్‌ పారిశ్రామిక విధానం తీసుకురాబోతున్నామని, బడ్జెట్‌ సమావేశాల తర్వాత ప్రకటిస్తామన్నారు.

తమ పారిశ్రామిక విధానాన్ని ప్రపంచంలోని పెట్టుబడిదారులంతా ప్రశంసిస్తారన్నారు. తమ విధానం ఏకగవాక్ష, పారదర్శకంగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో అవినీతి రహిత పాలన అందిస్తామని ప్రకటించారు. పెట్టుబడిదారులు దరఖాస్తు చేసుకుంటే చాలు.. చేజింగ్‌ సెల్‌ ఆఫీస్‌ ద్వారా ప్రతిపాదనలు పరిశీలించి అనుమతులు ఇస్తామన్నారు. పారిశ్రామికవేత్తలు శంషాబాద్‌ విమానాశ్రయంలో దిగగానే ప్రోటోకాల్‌ అధికారి స్వాగతం పలికి ముఖ్యమంత్రి కార్యాలయానికి తీసుకువస్తారన్నారు. తనతో పాటు పరిశ్రమల శాఖ అధికారులను కలువవచ్చని.. అన్ని అనుమతులు సీఎంఓ నుంచి ఒకేసారి పొందవచ్చన్నారు. అధికారులు, కార్యాలయాలచుట్టూ తిరగాల్సిన అవసరం లేదని… కేవలం 15 రోజుల్లో అన్ని అనుమతులు వస్తాయని తెలిపారు. విద్యుత్‌, భూమి, నీళ్ల కేటాయింపు సహా అన్ని వసతులకు సంబంధించి అనుమతులు ఇస్తామన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని ఉత్తమ విధానం తెలంగాణలో చూస్తారని చెప్పారు. మహబూబ్‌నగర్‌ త్వరలోనే అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందని కేసీఆర్‌ తెలిపారు. జిల్లాలో పరిశ్రమల కోసం 34,100 ఎకరాల భూమిని పరిశీలించారని.. సుమారు 13,500 ఎకరాల భూమిలో ఇప్పటికిప్పుడు పరిశ్రమలు స్థాపించేందుకు సిద్ధంగా ఉందన్నారు. రూ.50-80 వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశముందని, చాలా మందికి ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. అనేక ఉద్యమాలు చేసి రాష్టాన్న్రిసాధించుకున్నామని, భారత్‌లో నెంబర్‌వన్‌గా రాష్టాన్న్రి తీర్చిదిద్దుతామన్నారు. తాను గతంలో పాలమూరులో పోటీ చేస్తే నన్ను ప్రజలు ఆదరించి, దీవించి ఎంపీగా గెలిపించారన్నారు. తాను పాలమూరు ఎంపీగానే తెలంగాణ సాధించానని, ఈ జిల్లా తన గుండెల్లో ఉందన్నారు. జిల్లాలోని ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. నెట్టేంపాడు, కల్వకుర్తి, బీమా ప్రాజెక్టులకు రూ.వెయ్యి కోట్లు ఇస్తే వచ్చే జూన్‌ నెలాఖరుకు 6.50 లక్షల ఎకరాలకు నీరు ఇస్తామని అధికారులు చెప్పారన్నారు. అవసరమైతే రూ.1100 కోట్లు ఇస్తామని, కానీ పని పూర్తి చేయాలని ఆదేశించామని తెలిపారు. పాలమూరు పచ్చగా కళకళలాడాలి.. వలసలు నిలిచిపోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.బంగారు తెలంగాణను నిర్మించుకోవడానికి అందరం కలిసి కృషి చేద్దామని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో చాలా సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చాలా ప్రాంతాల్లో నాలుగైదు రోజులకు ఒకసారి మాత్రమే తాగు నీరు వస్తోందని.. ఆ సమస్యను తీర్చాలన్న ఉద్దేశ్యంతో తెలంగాణ వాటర్‌ గ్రిడ్‌కు శ్రీకారం చుట్టామన్నారు. నాలుగేళ్లలో గ్రిడ్‌ పూర్తి చేసి ప్రతి గుడిసెకు, లంబాడ తండాకు, ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్‌ ఇచ్చి రోజూ తాగునీటిని అందిస్తామన్నారు. పాలమూరులో కొత్త ప్రాజెక్టులు కూడా ప్రారంభించబోతున్నామని, కృష్ణా నుంచి పాకాల వరకు కాలువ, పాలమూరు ఎత్తిపోతల పథకం కోసం సర్వే జరుగుతోందని, ఇందుకోసం రూ.1100కోట్లు మంజూరుచేశామన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తిచేసి మహబూబ్‌నగర్‌ను పచ్చగా మారుస్తామన్నారు. తెలంగాణలో రిజర్వ్‌ ఫారెస్ట్‌ తగ్గిపోయిందని కేసీఆర్‌ తెలిపారు. రాబోయే మూడేళ్లలో తెలంగాణలోని ప్రతి గ్రామంలో 1.20లక్షల మొక్కుల నాటబోతున్నామని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో చిన్ననీటిపారుదల భయంకరంగా నిర్లక్ష్యానికి గురైందని, అనేక చెరువులు కుంటలు పూడికతో నిండిపోయాయన్నారు. రూ.20 వేల కోట్ల ఖర్చుతో దశల వారీగా చెరువులను పునరుద్ధరిస్తామన్నారు. సర్పంచ్‌ సహా ప్రజాప్రతినిధులు అందరూ సక్రమంగా పని చేయాలని, బాద్యత పంచుకోవాలని కోరారు. రాజ్యాంగం ప్రకారం ఎవరి అధికారాలు వారికి అప్పగిస్తామని, అధికారాలతో పాటు విధులు కూడా పంచుకోవాలన్నారు. సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి రూ.4 వేల కోట్లు వెచ్చించనున్నట్లు చెప్పారు. నిరుద్యోగ భూతం పారిపోవాలి.. పాలమూరు ముఖచిత్రం మారిపోవాలి అన్నారు. నాలుగైదేళ్లలో పాలమూరు పరవశించిపోతుందని, పచ్చదనం సంతరించుకుంటుందన్నారు. తెలంగాణ తెచ్చుకున్నాం.. ఇప్పుడు నిలబడాలా.. కలబడాల్సి ఉందన్నారు. ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో.. ఇంకా  ఏ రకమైన కుట్రలు జరుగుతున్నాయో ప్రజలంతా గమనిస్తున్నారని చెప్పారు. ఇలాంటి వాటికి వెరిసేదిలేదన్నారు. కేసీఆర్‌ దేనికీ భయపడడు.. 14ఏళ్ల తెలంగాణ ఉద్యమంలో చాలా మందిని చూశానని తెలిపారు. తెలంగాణ దుర్మార్గులను కట్టిపెట్టి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామని.. ఇక బంగారు తెలంగాణ నిర్మించుకోవాల్సి ఉందని అన్నారు.