తెలంగాణకు ప్రత్యేక ¬దా కావాలి
ఆకుపచ్చని తెలంగాణ.. ప్రతి ఇంటికి తాగునీరు
సమైక్య రాష్ట్రంలో వివక్షకు గురయ్యాం
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సంక్షేమానికి కట్టుబడ్డాం
ప్రత్యేక రాయితీలు, సమగ్ర అభివృద్ధికి సిఫారస్ చేయండి
14వ ఆర్థిక సంఘానికి సీఎం కేసీఆర్ విజ్ఞప్తి
తెలంగాణకు సరిపోయే వాస్తవిక ప్యాకేజీ ఇస్తాం : వై.వి.రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 19 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక ¬దా కల్పించేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి సిఫారస్ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు విజ్ఞప్తిచేశారు. ఆకుపచ్చని తెలంగాణగా మారుస్తామని, ప్రతి ఇంటికి తాగునీరు అందించేందుకు కృషిచేస్తామని ఆయన పునరుద్ఘాటించారు. శుక్రవారం 14వ ఆర్థిక సంఘం ప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, ఉన్నతాధికారులు హాజరైన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ వివక్షకు గురయ్యిందని చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టంచేశారు. ప్రత్యేక రాయితీలు, సమగ్ర అభివృద్ధికి సిఫారస్ చేయాలని 14వ ఆర్థిక సంఘాన్ని కోరారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం అన్ని రకాలుగా సహకారం అందించాలని విన్నవించారు. రాష్ట్ర జనాభాలో 86 శాతం మంది ప్రజలు ఎస్సీ, ఎస్టీ, బీసీలేనని.. వారి సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. సమూల పేదరిక నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, ప్రణాళికలు, చేపట్టనున్న పథకాలు వివరించారు. ఐదేళ్లలో చేపట్టబోయే కార్యక్రమాలను తెలిపారు. కేంద్రం వాటా కింద ఐదేళ్లలో రూ.25 వేల కోట్లు సాయం చేయాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థల గ్రాంటు 4 శాతానికి పెంచాలని కోరారు. ఎఫ్‌ఆర్ బియ్యం నిబంధనలలో మార్పులు చేయాలని విన్నవించారు. రాష్టాల్రపై సబ్సడీ భారం తగ్గించేందుకు కేంద్రం వాటా పెరగాలని, విపత్తు నిర్వహణలకు అవసరమయ్యే నిధులు పెంచాలన్నారు. అభివృద్ధి పనులకు నిదులివ్వాలని కోరారు. సుదీర్ఘంగా పోరాటాల తర్వాత సాధించుకున్న నూతన రాష్టాన్రికి ఆర్థిక సంఘం అన్నివిధాలుగా సహకరించాలని, ప్రత్యేక రాయితీలు కల్పించాలని కోరారు. కేంద్రప్రభుత్వం నుంచి వాటాలను పెంచాలని విజ్ఞప్తిచేశారు. తాగునీరు, విద్యుత్, రవాణా, సాగునీరు రంగాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం తీవ్రంగా వెనుకబడిందన్నారు. హైదరాబాద్ మినహా అన్ని జిల్లాలు వెనుకబడి ఉన్నాయని.. మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాలు మరింత వెనుకబాటులో ఉన్నాయని వివరించారు. రాష్ట్ర ఆదాయంలో హైదరాబాద్‌దే సింహభాగంగా ఉందని ఆర్థిక సంఘం ప్రతినిధులకు వివరించారు. మిగతా జిల్లాలన్నీ వెనుకబాటుకు గురయ్యాయని తెలిపారు. వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైన తెలంగాణలో 50 శాతానికి పైగాప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడిఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో 81 శాతం వ్యవసాయం బోరుబావులపైనే ఆధారపడి ఉందన్నారు. దేశంలోని 31జిల్లాల్లో రైతుల ఆత్మహత్యలు జరుగుతుంటే.. అందులో తొమ్మిది జిల్లాలు తెలంగాణలోనివేనని తెలిపారు. అకాల వర్షాలు, కరువుతో తెలంగాణ రైతులు చాలా ఇబ్బందులు పడ్డారని, తీవ్రంగానష్టపోయారన్నారు. 2005-09 మధ్య కాలంలో 10.5 శాతంగా ఉన్న ఆర్థిక వృద్ధి రేటు 013 నాటికి 4.5 శాతానికి పడిపోయింది. వృద్ధి చేటు పెంచడమే లక్ష్యంగా, ప్రజలందరికీ సమానంగా ఆర్థికంగా అవకాశాలు కల్పించే దిశగా పని చేస్తామన్నారు. ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాల ద్వారా వచ్చే ఐదేళ్లలో అభివృద్ధి వేగవంతంఅవుతుందని కేసీఆర్ తెలిపారు. పేదరిక నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. దళితులకు మూడు ఎకరాల భూ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కొరకు ఐదేళ్లలో రూ.50వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. గిరిజనుల అభివృద్ధికి 12శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారు. బీసీల అభివృద్ధికి రూ.20వేల కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు. మైనార్టీ సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, వెనుకబడిన మైనార్టీల అభివృద్ధికి ఏటా రూ.1000 కోట్లు వెచ్చించచనున్నట్లు వివరించారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కేసీఆర్ తెలిపారు. పారిశ్రామిక అభివృద్ధి కోసం ఖాళీగా ఉన్న భూములను గుర్తించామన్నారు. పరిశ్రమల స్థాపనకు సౌకర్యాలు కల్పిస్తామన్నారు. రాష్ట్రం ప్రస్తుతం తీవ్ర విద్యుత్ సమ్యలను ఎదుర్కొంటుందని వివరించారు. విద్యుత్ లోటు పారిశ్రామిక అభివృద్ధికి ఆటంకంగా మారిందన్నారు. విద్యుత్ కోతలను అధిగమించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఇంటింటికీ తాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఇటీవల నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే విజయవంతమైందని, సర్వే వల్ల అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరే అవకాశముందని తెలిపారు. హరిత హారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు చెప్పారు. ప్రతి నియోజక వర్గంలో 40 లక్షల మొక్కలు నాటుతామని స్పష్టంచేశారు. వెనుకబడిన ప్రాంతాల కోసం ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వనున్నట్లు వివరించారు. నిధుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపించాలని ఆర్థికసంఘాన్ని కోరారు.
తెలంగాణకు సరిపోయే వాస్తవిక ప్యాకేజీ ఇస్తాం : వై.వి.రెడ్డి
తెలంగాణ రాష్ట్రానికి సరిపోయే వాస్తవిక ప్యాకేజీ ఇస్తామని 14వ ఆర్థిక సంఘం చైర్మన్ వైవీ.రెడ్డి తెలిపారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ప్రభుత్వ ప్రతిపాదనలు అభినందించదగినవి అని చెప్పారు. ప్రభుత్వ ప్రతిపాదనలపై ఈ నెల 22న సమగ్రంగా చర్చిస్తామని స్పష్టంచేశారు. తెలంగాణకు సరిపోయే, సాధ్యమయ్యే వాస్తవిక ప్యాకేజీ ఇస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర సమస్యలను సీఎం కేసీఆర్ బలంగా వివరించారని తెలిపారు. సీఎం, అధికారుల చిత్తశుద్ధి, సమర్థతలను అభినందిస్తున్నామని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంఘానికి పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ప్రతిపాదనలు సమర్పించింది. ఈ ప్రతి పాదనల విలువ రూ.23,475 కోట్లుగా ఉంటుందని అధికారులు తెలిపారు. వీటిలో పోలీసు వ్యవస్థ ఆధునికీకరణకు రూ.4216కోట్లు, చెరువుల పునరుద్దరణ, అభివృద్ధికి రూ.4,200 కోట్లు, ఐటీ రంగానికి రూ.1,091కోట్లు, వాటర్‌గ్రిడ్‌కు రూ.3,500కోట్లు, హరితహారానికి రూ.1000 కోట్లు, ప్రాథమిక విద్యకు రూ.1,300కోట్లు, వ్యవసాయ విద్యుత్ కోసం రూ.1,300కోట్లుగా పేర్కొంటూ ప్రతిపాదనలు రూపొందించి సమర్పించింది. అంతేకాకుండా కేంద్ర పన్నుల్లో రాష్ట్రవాటాను 50శాతానికి పెంచాలని కోరింది.