భారత్‌ ప్రపంచాన్నే కుటుంబంగా భావిస్తుంది

modiఈ వేదికపై కాశ్మీర్‌ ప్రస్తావన ఎందుకు?

ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కారం

నవాజ్‌కు మోడీ చురక

ఐరాసాలో గ్రూపులెందుకు?

ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీలో ప్రధాని మోడీ హిందీలో ప్రసంగం

న్యూయార్క్‌, సెప్టెంబర్‌ 27 (జనంసాక్షి) : భారతదేశం ప్రపంచాన్ని కుటుంబంగా భావిస్తుందని భారత ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. కాశ్మీర్‌ ప్రస్తావన ఈ వేదికపై ఎందుకని, ద్వైపాక్షిక చర్చల ద్వారానే సమస్య పరిష్కారం అవుతుందని పాకిస్తాన్‌ ప్రధాని నవాజ్‌షరీఫ్‌కు చురకలంటించారు. ఐక్యరాజ్యసమితిలో గ్రూపులెందుకని ప్రశ్నించారు. ఐరాస జనరల్‌ అసెంబ్లీలో మన ప్రధాని హిందీలో ప్రసంగించారు. ఇరుగుపొరుగు దేశాలతో భారతదేశం శాంతి, సౌహార్ద్ర సంబంధాలనే కోరుకుంటుందని మోడీ తేల్చిచెప్పారు. ఇరుగుపొరుగు సమస్యలపై ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రస్తావించినంత మాత్రాన సమస్యలు పరిష్కారమైపోవని ఆయన హెచ్చరించారు. పాకిస్తాన్‌ ప్రధానమంత్రి నవాజ్‌ షరీఫ్‌ శుక్రవారంనాడు ఐక్యరాజ్య సమితిని ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఇప్పుడు కావలసింది శాంతి అని ఆయన అన్నారు. జమ్మూ-కశ్మీర్‌లో ప్లెబిసైట్‌ నిర్వహించాలన్న నవాజ్‌ ప్రసంగాన్ని మోదీ ప్రత్యక్షంగా ప్రస్తావించకుండా శాంతియుత వాతావారణాన్ని పాకిస్తానే సృష్టించి చర్చలకు ముందుకు రావాలని మోదీ హితవు చెప్పారు. పాకిస్తాన్‌ చేసిన ప్రసంగానికి మోదీ నేటి ప్రసంగంలో గట్టిగా సమాధానం చెబుతారా, లేక ఆ ప్రకటనను పట్టించుకోకుండా తాను చెప్పదలచింది చెప్పి ఊరుకుంటారా అని ప్రపంచవ్యాప్తంగా రాజకీయ పరిశీలకులు ఎదురుచూస్తున్నవేళ మోదీ ఇది శాంతి స్థాపన సమయమని తేల్చిచెప్పారు. ఆయన హిందీలో ప్రసంగిస్తూ టెర్రరిస్టు ఛాయల కింద, బెదరింపులు, హెచ్చరికల మధ్యగాక, సద్బుద్ధితో, సుహృద్భావంతో మైత్రీ వాంఛతో పాకిస్తాన్‌ చొరవతో చర్చలకు ముందుకు రావాలని, ఇందుకు ఇండియా ఎపడూ ముందువరుసలో ఉంటుందని ఆయన నీళ్లు నమలకుండా చెప్పారు. అందరం ఆకలి, పేదరికం లేని ప్రపంచం కోసం కృషి చేద్దాం అనీ, ఐక్యరాజ్య సమితి వంటి గొప్ప సంస్థలలో ముఠాలు కట్టవలసిన అవసరం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఇటువంటి పరిస్థితులలో అందరం కలసికట్టుగా పనిచేయాలని ఆయన అన్నారు. ఐక్యరాజ్య సమితి సర్వ సభ్య సమావేశాన్ని ఉద్దేశించి తమ మొట్టమొదటి ప్రసంగంలో మోదీ ప్రసంగిస్తూ భారత దేశం వేదకాలం నుంచి వసుధైక కుటుంబం అనే ధార్మిక సిద్ధాంతంతోనే మనుగడ సాగిస్తున్నదని ఆయన చెప్పారు. మోదీ ఆవేశపరడకుండా చెప్పదలిచింది స్పష్టంగా చెబుతూ సమితి సర్వసభ్య సమావేశాన్ని ఆకట్టుకున్నారు. నేటి ఆధునిక ప్రపంచం ఎన్నో కొత్తపుంతలు తొక్కుతుందని, శాస్త్ర సాంకేతిక రంగాలు ఉవ్వెత్తున ముందుకు పరుగులు తీస్తున్నాయని, ఇటువంటి పరిస్థితులలో ఒక దేశానికి మరో దేశం సహకరించుకుని పరస్పరం సాంకేతిక సహకారంతో, సోషల్‌ విూడియాను సైతం ఉపయోగించుకుని ప్రగతి పథంలో ముందుకుసాగాలని ఆయన ఆకాంక్షించారు.

నరేంద్రమోడీ ఐక్య రాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ సమావేశంలో యోగా ప్రాశస్త్యం గూర్చి చెప్తూ.. యోగా 5000ఏళ్ళ నాటి భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక సాధన అని, శరీరాన్ని, మనస్సును పరివర్తింజేస్తుందన్నారు. శరీరాన్ని,మనస్సును మరియు ఆలోచన, ఆచరణను ఏకం చేస్తుందన్నారు. ప్రకృతి, మనిషుల మధ్య సామరస్యం సాధిస్తుందన్నారు. ఆరోగ్యం మరియు శ్రేయస్సుకు దగ్గరి దారి అని, ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకోవాలన్నారు. జీవన విధానాన్ని మార్చుకొని, చైతన్యాన్ని ప్రోది చేసుకోవాలన్నారు. వాతావరణ మార్పులకు సంబంధించి ఒక ఒప్పందానికి రావడంలో యోగా దారిచూపగలదన్నారు. భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మోదీ జపాన్‌లో పర్యటించారు. ఆ తర్వాత చైనా అధ్యక్షుడు భారత్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల ఫలితంగా జపాన్‌, చైనాలనుంచి మోదీ దాదాపు 5500 కోట్ల డాలర్ల మేర పెట్టుబడులకు వాగ్దానాలు సాధించగలిగారు. అమెరికా ప్రభుత్వం నుంచి ఈ పర్యటనలో భారత్‌కు పెద్దగా పెట్టుబడుల హావిూలు రాకపోవచ్చు గాని, ప్రయివేటు కంపెనీలనుంచి మాత్రం పెద్ద ఎత్తున పెట్టుబడులకు అవకాశం ఉంది. అయితే ఈ పెట్టుబడిదారులకు భారత్‌లో ప్రస్తుతం అధికార స్థాయిలో అమలులో ఉన్న పద్ధతులు కొంత ఇబ్బందికరంగా ఉన్నాయి. వీటి గురించే వారు ఎక్కువగా మోదీతో చర్చించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.