తెలంగాణ సాంస్కృతిక సారథి

A

సర్కారు ప్రచార వారధి : సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 30 (జనంసాక్షి) : ‘తెలంగాణ సాంస్కృతిక సారథి.. సర్కారు ప్రచార వారధి’ అని సీఎం కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ‘తెలంగాణ సాంస్కృతక సారథి’ అనే పథకానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం చేపట్టే ప్రజాహిత కార్యక్రమాలను అట్టడుగు స్థాయి వరకు, గ్రామ గ్రామానికి చేరవేసే విధంగా ఈ పథకం పనిచేస్తుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రభుత్వ సలహాదారు కెవి.రమణాచారి, ప్రముఖ కవులు డాక్టర్‌ సిధారెడ్డి, గోరెటి వెంకన్న, జయరాజ్‌, మిట్టపల్లి సరేందర్‌, యశ్‌పాల్‌, దేశపతి శ్రీనివాస్‌, వరంగల్‌ శ్రీనివాస్‌, మార్త రవి తదితరులతో తన అధికారిక నివాసంలో కేసీఆర్‌ మంగళవారం సమావేశమయ్యారు. ఉద్యమ కాలంలో వందలాది మంది తెలంగాణ కళాకారులు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం వనరులు, వసతలు ఉన్నా, లేకపోయినా పనిచేశారని సీఎం అన్నారు. వారందరినీ తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములను చేయాల్సి ఉందని సీఎం చెప్పారు. దాదాపు 500 మంది కళాకారులకు ఉద్యోగావకాశం కల్పించే అంశాన్ని కూడా పరిశీలిస్తామని తెలిపారు. ఇందుకోసం నిబంధనలను సడలించే విషయాన్ని కూడా పరిశీలిస్తామన్నారు. తెలంగాణ ఉద్యమంలో కళా బృందాలుగా పనిచేసిన వేలాది మందికి సముచిత పారితోషికాన్ని అందిస్తూ ఉపాధి కల్పించే దిశలో ప్రభుత్వం ఉన్నట్లు సీఎం వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కవులకు, కళాకారులకు సముచిత గౌరవాన్ని కల్పిస్తుందని చెప్పారు.