సాగర తీరం వికసించిన పూలవనం.. అంబరాన్నంటిన సంబురం

Untitled-1

అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ

జనసంద్రమైన ట్యాంకుబండ్‌

లేజర్‌ కాంతులతో నెక్లెస్‌ రోడ్‌ మిరిమిట్లు

పాల్గొన్న గవర్నర్‌, కేసీఆర్‌ దంపతులు

హైదరాబాద్‌, అక్టోబర్‌ 2 (జనంసాక్షి) : సాగర తీరం పూలవనంలా వికసించింది. బతుకమ్మ సంబురం అంబరాన్నంటింది. అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ ఉత్సవం జరిగింది. బతుకమ్మలను ఎత్తుకున్న మహిళలు, ప్రజలతో ట్యాంక్‌బండ్‌ జనసంద్రమైంది. లేజర్‌ కాంతులతో నెక్లెస్‌ రోడ్డు మిరిమిట్లు గొలిపింది. ఈ సద్దుల బతుకమ్మ ఉత్సవాల్లో గవర్నర్‌ నరసింహన్‌, ఆయన భార్య విమల,  ముఖ్యమంత్రి కేె.చంద్రశేఖర్‌రావు, ఆయన భార్య శోభ పాల్గొన్నారు. ట్యాంక్‌బండ్‌ వద్ద సద్దుల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ట్యాంక్‌బండ్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్‌, గవర్నర్‌ నరసింహన్‌ బెలూన్లను ఎగురవేసి బతుకమ్మ వేడుకలను ప్రారంభించారు. బతుకమ్మ వేడుకలను వీక్షించేందుకు ఆడపడుచులు వేలాదిగా తరలివచ్చారు. బతుకమ్మ పాటలు, డప్పులు, వాయిద్యాలతో హుస్సేన్‌ సాగర ప్రాంతం మార్మోగిపోయింది. కళాకారుల నృత్యాలు కనువిందు చేశాయి. విద్యుత్‌ కాంతులతో సాగర తీరం దేదీప్యమానంగా వెలుగొందింది. లైటింగ్‌ తోరణాలు జిగేల్‌మన్నాయి. విద్యుత్‌ దీపాల అలంకరణతో ట్యాంక్‌బండ్‌ పరిసర ప్రాంతాలు కళకళలాడాయి. వజ్ర కాంతులతో సాగర తీరం ధగధగలాడింది. బతుకమ్మ పాటలతో నగరమంతా సందడిగా మారింది. విద్యుత్‌ కాంతులతో సాగర తీరం మిరుమిట్లు గొలిపేలా ప్రకాశించింది. ట్యాంక్‌బండ్‌ చేరుకున్న సీఎం కేసీఆర్‌, గవర్నర్‌ బెలూన్లను ఎగురవేసి సద్దుల బతుకమ్మ ఉత్సవాలను ప్రారంభించారు. బతుకమ్మ చిహ్నంగా పది జిల్లాలు శకటాలను ప్రదర్శించాయి. ఆడపడుచులు బతుకమ్మలను పేర్చి బొడ్డెమ్మ ఆడారు. సీఎం సతీమణి శోభ, గవర్నర్‌ భార్య విమలతోపాటు ప్రభుత్వ మహిళా అధికారులు బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా తెలంగాణ మాస పత్రికను కేసీఆర్‌ ఆవిష్కరించారు. పాలమూరు జిల్లాకు చెందిన పన్నెండు మెట్ల కిన్నెర కళాకారుడు మొగులయ్య తన ప్రదర్శనను సీఎం ముందు చూపించారు. చిందు యక్షగానం, పేరిని శివతాండవం, డప్పు వాయిద్యాలు, ఒగ్గు కథలతో లంబాడీలు నృత్యం అలరించింది. ట్యాంక్‌బండ్‌ వద్ద లేజర్‌ షో అలరించింది. సుమారు 25వేల మంది మహిళలు ఎల్బీ స్టేడియం నుంచి ట్యాంక్‌బండ్‌ వరకు బతుకమ్మలతో ర్యాలీగా వచ్చారు.

బతుకమ్మను నిమజ్జనం చేసిన కవిత

ట్యాంక్‌బండ్‌ వద్ద సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా నిజామాబాద్‌ ఎంపీ కవిత బతుకమ్మను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేశారు. ఆమెతోపాటు తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌రెడ్డి కూడా బతుకమ్మను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేశారు. ట్యాంక్‌బండ్‌ సాగరతీరంలో జరుగుతున్న సద్దుల బతుకమ్మలో తెలంగాణా సాంస్కృతిక వైభవ ప్రదర్శనలు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా జరుగుతున్నాయి. వేడుకలను గవర్నర్‌ నరసింహన్‌, తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌లు ప్రారంభించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన శకటాల ప్రదర్శన సాంస్కృతిక వైభవాన్ని ప్రదర్శించాయి. వేలాదిమంది పాల్గొన్న వేడుకల్లో మహిళలు బతుకమ్మ ఆడారు. సద్దుల బతుకమ్మలో భాగంగా ట్యాంక్‌బండ్‌పై వివిధశాఖలు, జిల్లాలకు చెందిన శకటాల ప్రదర్శన జరిగింది.  పౌరసంబంధశాఖ ఆధ్వర్యంలో ఈ ప్రదర్శనను ఏర్పాటుచేశారు. ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మలను నిమజ్జనం చేసేందుకు వేలాదిమంది మహిళలు బతుకమ్మలతో తరలిరావడంతో ట్యాంక్‌బండ్‌పై పండగ వాతావరణం ఏర్పడింది. ఘాట్‌లో మహిళలు బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ట్యాంక్‌బండ్‌ సాగరతీరం లేజర్‌ వెలుగులతో మెరిసిపోయింది. సద్దుల బతుకమ్మ సందర్భంగా ఏర్పాటుచేసిన లేజర్‌ వెలుగులు వీక్షకులకు కనువిందు కలిగించాయి. బతకమ్మ పండగ ప్రాశస్త్యాన్ని తెలియజేసే విధంగా ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో సాగరతీరం రంగు రంగుల లేజర్‌ కాంతుల వెలుగుల్లో తళుక్కుమంది. మైసూర్‌ దసరా ఉత్సవాలను మించేలా జిహెచ్‌ఎంసి అన్ని ఏర్పాట్లు చేసింది. బతుకమ్మ పండుగను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విశ్వవ్యాప్తం చేయాలని, ఇందుకోసం ఇంటర్నెట్‌ను ప్రత్యేక వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించింది. ఇందులో బతుకమ్మ చరిత్ర, పాటలు, వీడియో, ఇతర సమాచారాన్ని పొందుపరిచారు.