హైదరాబాద్ చారిత్రక నగరం
అభివృద్ధికి తగ్గట్టుగా ప్రణాళిక : కేసీఆర్
కేసీఆర్ ప్రణాళిక భేష్ : వెంకయ్య
హైదరాబాద్ భిన్న సంస్కృతులకు నిలయం
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం
హైదరాబాద్, అక్టోబర్ 7 (జనంసాక్షి) : హైదరాబాద్ ఒక చారిత్రక నగరం అని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నామని వెల్లడించారు. కేసీఆర్ అభివృద్ధి ప్రణాళిక చాలా బాగుందని కేంద్ర పట్టణాభివృద్దిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు అభినందించారు. హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతులకు నిలయమని మాజీ రాష్ట్రపతి ఎ.పి.జె అబ్దుల్ కలాం అన్నారు. హైదరాబాద్ హైటెక్స్‌లో మెట్రోపొలిస్ సదస్సును ప్రారంభించిన అనంతరం కేసీఆర్ మాట్లాడారు. హైదరాబాద్‌తోపాటు ద్వితీయ శ్రేణి నగరాలను కూడా అభివృద్ది చేస్తున్నామని అన్నారు. హైదరాబాద్‌లో సంతులిత అభివృద్ధి సాధించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధికి సాయం చేస్తామని హావిూ ఇచ్చిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు కేసీఆర్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ మేజర్ హిస్టారికల్ సిటీ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఇది భిన్న సంస్కృతుల సమ్మేళనం కలిగి ఉందన్నారు. మెట్రో పొలిస్ సదస్సుకు వచ్చిన ప్రతినిధులకందరికీ హైదరాబాద్ నగరం తరపున సాదర స్వాగతం పలుకుతున్నట్లు సీఎం చెప్పారు. మెట్రో పొలిస్ సదస్సు నిర్వహిస్తున్నందుకు సంతోషంగా ఉందని సీఎం అన్నారు.. హైదరాబాద్ అభివద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో సంతులిత అభివృద్ధి సాధించాలని నిర్ణయించుకున్నామని పేర్కొన్నారు. తెలంగాణ పట్టణ జనాభా 40 శాతం దాటుతోందని తెలిపారు. దీనికి తగ్గట్లుగా అభివృద్ది చేస్తున్నామని అన్నారు. హైదరాబాద్ వాతావరణం అనుకూలంగా ఉండడమే అందరికి ఆకర్షించడానికి కారణమన్నారు. దీని ఇమేజ్‌ను కాపాడుకుంటూనే అభివృద్ది చేస్తున్నామన్నారు. ఆర్థికంగా హైదరాబాద్‌ను ప్రపంచ పట్టణాలకు అనుగుణంగా అభివృద్ది చేస్తున్నామని అన్నారు.
నగరీకరణకు తగ్గట్లుగా ప్రమాణాలు పెరగాలి
ప్రపంచవ్యాప్తంగా 60శాతం ప్రజలు పట్టణాల్లోనే నివసిస్తున్నారని, ఇందుకు అవసరాలే కారణమని కేంద్ర పట్టణాభివృద్దిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. విద్య, వైద్యం, ఉద్యోగంతోపాటు మెరుగైన సౌకర్యాల కోసం ప్రజలు నగరాల బాట పడుతున్నారని పేర్కొన్నారు. 2025వరకు భారత దేశంలో పత్రి ఒక్కరికి ఇల్లు, స్వచ్ఛమైన పరిసరాలు లక్ష్యంగా ఓ మిషన్‌తో పనిచేస్తున్నామని చెప్పారు. అభివృద్ధిలో హైదరాబాద్ అగ్రగామిగా ఉందని హైటెక్స్‌లో జరుగుతున్న మెట్రో పొలిస్ సదస్సులో ఆయన అన్నారు. హైదరాబాద్‌కు గొప్ప చారిత్రక నేపథ్యం ఉందన్నారు. అభివృద్ధిలో అగ్రగామిగా ఉన్న చారిత్రక హైదరాబాద్ నగరాన్ని చూసేందుకు ఎంతో మంది ఉత్సాహం చూపుతున్నారని తెలిపారు. ప్రపంచంలోనే హైదరాబాద్ అన్ని రకాలుగా అనువైన నగరం అని కొనియాడారు. నగరాల మధ్య అవగాహన, ప్రజల మధ్య అభిప్రాయాల మార్పిడికి ఇది గొప్ప వేదిక అని చెప్పారు. దేశంలో పట్టణీకరణ ఇంకా బాగా పెరగాల్సి ఉందని వెంకయ్యనాయుడు అన్నారు. పట్టణాల్లో కాలుష్య సమస్య విూద ఎక్కువగా దృష్టిసారించాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తు చేశారు. పట్టణాలకు వస్తున్న ప్రజలకు అనుగుణంగా అవసరాలు పెరగాల్సి ఉందన్నారు. ఆసియా, ఆఫ్రికా దేశాల్లో 46శాతం ప్రజలు పట్టణాల్లోనే ఉన్నారని, ప్రధానంగా విద్య, వైద్యం, ఉద్యోగం లాంటి అవసరాల కోసం పల్లె ప్రజలు కూడా పట్టణాల బాట పడుతున్నారని చెప్పారు. మొత్తం ప్రపంచంలో చూసుకుంటే 60 శాతం జనాభా పట్టణాల్లోనే ఉందని ఆయన తెలిపారు. ప్రపంచంలోని నగరాల మధ్య అవగాహన, అభిప్రాయాల మార్పిడికి మెట్రోపొలిస్ వేదికగా నిలిచిందని వెంకయ్య అన్నారు. వలసలు పెరిగినంత వేగంగా నగరాలు అభివృద్ధి చెందటం లేదని అభిప్రాయపడ్డారు. వలసలు అనుహ్యంగా పెరిగిపోవడంతో పలు నగరాల్లో మురికి వాడలు ఏర్పడుతున్నాయని వెల్లడించారు. నగరీకరణ అన్నది వాస్తవం.. దానికి తగ్గట్టుగా మార్పులు చేయాలన్నారు. 2011 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 54శాతం మంది నగరాల్లో జీవిస్తున్నారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆసంఖ్య పెరిగిందన్నారు. నగరాల్లో పేదరికాన్ని రూపుమాపేందుకు కృషి చేస్తామన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం అన్నివిధాలా సహకరిస్తుందని స్పష్టంచేశారు. తెలంగాణ సిఎం కెసిఆర్ హైదరాబాద్‌ను నంబర్ వన్ సిటీగా అభివృద్ది చేయాలన్న సంకల్పాన్ని అభినందించారు. అందుకు అనుగుణంగా కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ అభివృద్దికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. రాష్టాల్ర సహకారంతోనే దేశం అభివృద్ది చెందుతుందన్నారు. ఇందుకు మోడీ నాయకత్వంలో ఓ విజన్‌తో ముందుకు వెళుతున్నామని అన్నారు. భారతదేశంలో వంద స్మార్ట్ సిటీలను నిర్మించాల్సిన అవసరం ఉందని చెప్పారు. స్మార్ట్‌సిటీల అభివృద్ధికి స్మార్ట్ నాయకత్వం అవసరమన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ఎంతో కృషిచేస్తున్నారని వెంకయ్య పేర్కొన్నారు. కేసీఆర్ చిత్తశుద్ధిని తాము అభినందిస్తున్నామని తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తుందని హావిూనిచ్చారు. 2020 నాటికి అందరికి గృహ సౌకర్యాన్ని కల్పిస్తామని హావిూనిచ్చారు. దేశంలో మూడో వంతు ప్రజాప్రతినిధులు మహిళలే కావడం గర్వకారణంగా ఉందన్నారు. 2019 నాటికి దేశాన్ని క్లీన్ ఇండియాగా తీర్చిదిద్దుతామని విశ్వాసం వ్యక్తంచేశారు. ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోందని వెంకయ్య ఈ సందర్భంగా తెలిపారు. వివిధ దేశాల్లో అభివృద్దిని ఉదాహరిస్తూ అందుకు ఆయా దేశాల నిర్వహణ తీరును అభినందించారు.
ఆలోచనల మార్పిడికి సదస్సులు ఉపయోగం : గవర్నర్
మెట్రోపొలిస్ లాంటి సదస్సులు పరస్పర ఆలోచనల మార్పిడికి ఉపయోగపడతాయని గవర్నర్ నరసింహన్ అన్నారు. హైటెక్స్‌లో జరుగుతున్న మెట్రోపొలిస్ సదస్సులో గవర్నర్ ప్రసంగించారు. ఈ సదస్సుకు హైదరాబాద్‌ను ఎన్నుకున్నందుకు గర్వంగా ఉందన్నారు. మెట్రో పొలిస్ సదస్సులో పాల్గొనడం సంతోషంగా ఉందని గవర్నర్ తెలిపారు. ఇలాంటి సదస్సులతో ఒకచోట జరిగిన మంచిని మరోచోటికి ఎంచుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. నగరాలు ఒకప్పుడు ఉన్నతవర్గాలు, ధనికులకే పరిమితమని.. అయితే కాలంతోపాటు నగరాలు మారాయని అన్నారు. అన్ని తరగతుల ప్రజలు నగరజీవనంలో భాగస్వాములయ్యారని చెప్పారు. నగరాల అభివృద్ధి విషయంలో ‘సిటీస్ ఫర్ ఆల్’ కాన్సెప్ట్ బాగుందని గవర్నర్ నరసింహన్ వ్యాఖ్యానించారు. ఈ సదస్సులో ప్రతినిధులు వ్యక్తంచేసిన అభిప్రాయాలను పుస్తక రూపంలో తీసుకొస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. నగరాలకు వలసలు పెరగడంతో మౌలిక సదుపాయాలపై ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. నగరాలు ఒకప్పుడు ఉన్నత వర్గాలు, ధనికులకు మాత్రమే పరిమితమయ్యేవని గుర్తుచేశారు. కాలం మారింది.. కాలంతోపాటు నగరాలు కూడా మారాయని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ చర్చలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మంచిని పోగుచేయడానికి ఉపకరిస్తాయని చెప్పారు. ఇలాంటి సదస్సులు పరస్పర ఆలోచనల మార్పిడికి ఉపయోగపడుతాయని అభిప్రాయపడ్డారు. ఒక చోట జరిగిన మంచిని మరోక చోటికి ఎంచుకునే అవకాశం కలిగిస్తుందన్నారు. పెరుగుతున్న జనాభా దృష్ట్యా ప్రధాన కార్యకలాపాలను కేవలం నగరానికే పరిమితం చేయలేమన్నారు. విద్యుత్ విషయంలోనూ నగరాలు కొత్త పంథాను అనుసరించాలని సూచించారు. సంప్రదాయ ఇంధన వనరులు ఏదో ఒక రోజు అంతరించిపోక తప్పదన్నారు. తాము ఇక సంప్రదాయేతర ఇంధన వనరులపైనే ఆధారపడాలని చెప్పారు. నగరాల్లో సౌర విద్యుత్ ఉత్తమ పరిష్కారమని తెలిపారు. నగరాల్లో వర్షపు నీటిని సంరక్షణ తప్పనిసరి చేయాలన్నారు. వర్షపు నీటి సంరక్షణ ఏర్పాటు చేయని వారికి భవన నిర్మాణ అనుమతులు నిరాకరించాలని సూచించారు.
ఆరోగ్యవంతమైన నగరాలు కావాలి: కలాం
మంచి నాగరికత, ఆరోగ్యవంతమైన జీవనం ఉన్న నగరాలు కావాలని మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం అన్నారు. ప్రజలకు అవసరాలు తీర్చగలిగేలా నగరాలను తీర్చిదిద్దాలన్నారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో మెట్రోపొలిస్ సదస్సులో ‘అందరి కోసం నగరాలు-ప్రజల కోసం, ప్రజల చేత.. ప్రజల నగరాలు’ అనే అంశంపై అబ్దుల్ కలాం కీలకోపన్యాసం చేశారు. సహజసిద్ధమైన వాతావరణంతో కూడిన నగరాలు ఏర్పడాలని ఆకాంక్షించారు. కాలుష్య రహిత, సహజవనరుల వినియోగంతో కూడిన నగర జీవనం ఆహ్లాదాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. హైదరాబాద్ నగర గొప్పతనాన్ని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం శ్లాఘించారు. హైదరాబాద్ నగరాన్ని చూడగానే చరిత్ర, సంస్కృతి గుర్తుకు వస్తాయని మాజీ రాష్ట్రపతి వ్యాఖ్యానించారు. చరిత్రకు చిహ్నమైన ఎన్నో కట్టడాలు నగరంలో ఉన్నాయని పేర్కొన్నారు. హైదరబాద్‌లో భిన్న సంస్కృతులు మిళితమై ఉన్నాయని అన్నారు. దేశానికి మంచి నాగరికత, ఆరోగ్యవంతమైన జీవనం ఉన్న నగరాలు కావాలని తెలిపారు. కాలుష్యరహిత, సహజ వనరుల వినియోగంతో కూడిన నగరజీవనం ఆహ్లాదాన్నిస్తుందని వివరించారు. మన దేశంలో చండీగఢ్‌ను ప్రణాళికాబద్దంగా నిర్మించారని చెప్పారు. ఇలాంటి నగరాల వల్ల నాగరికత పరిఢవిల్లుతుందన్నారు.