మా రాష్ట్రం మా పాలన
కొమురం భీమ్ స్ఫూర్తితోటే తెలంగాణ
ఆదివాసీ వర్సిటీ, కొత్తగా ఏర్పడబోయే జిల్లాకు భీమ్ పేరు
యోధుడి కుటుంబానికి ఆర్థిక సాయం, ఉద్యోగాలు
జోడేఘాట్‌లో సీఎం కేసీఆర్ ఘనంగా నివాళి
ఆదిలాబాద్, అక్టోబర్ 8 (జనంసాక్షి) : కొమురం భీమ్ స్ఫూర్తితోనే ఉద్యమించి తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పరుచుకున్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ్తఆదివాసీ వర్సిటీకి, కొత్తగా ఏర్పడబోయే జిల్లాకు భీమ్ పేరును పెడుతామన్నారు. జోడేఘాట్‌లో కొమురం భీమ్ సమాధికి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. కొమురం భీమ్ స్మారక స్థూపాన్ని సీఎం ఆవిష్కరించారు. కొమురం భీమ్ మ్యూజియం నిర్మాణానికి ఏర్పాటుచేసిన పైలాన్‌కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో సిఎం మాట్లాడుతూ పోరాటయోదుడి కుటుంబానికి ఆర్థికసాయం, ఆయన కుటుంబీకులకు ఉద్యోగం ఇస్తామన్నారు. భీమ్ పుట్టి పెరిగిన గడ్డ జోడేఘాట్‌లో వంద ఎకరాల విస్తీర్ణంలో పర్యాటక కేంద్రాన్ని అభివృద్ది చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఇక్కడున్న భూమికి తోడు మరికొంత భూమిని సేకరించి పర్యాక కేంద్రంగా అభివృద్ది చేస్తానని హావిూ ఇచ్చారు. కొమురం భీం గొప్పతనాన్ని గుర్తుకు తెచ్చుకునేలా ఇక్కడ అభివృద్ది కార్యక్రమాలు చేపడతామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో కొమురంభీమ్‌కు గుర్తింపు తెచ్చేందుకే తాను ఇక్కడికి వచ్చానని కేసీఆర్ అన్నారు. జోడేఘాట్‌లో అభివృద్ధి పనులకు మూడు రోజుల్లో నిధులు మంజూరు చేస్తమని..వచ్చే ఏడాదిలోపు పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. తిరిగి వచ్చే ఏడాది వర్ధంతి సభను ఘనంగా చేసుకునేలా చేస్తామన్నారు. ఈ ప్రాంతానకి రోడ్డు సౌకర్యం కల్పించి రవాణా మెరుగుపరుస్తామన్నారు. చుట్టూ పచ్చని వాతావరణంతో ఆహ్లాదకరంగా ఉన్న ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేస్తామన్నారు. ఆదిలాబాద్ మరో కాశ్మీర్ అని అన్నారు. కొమురం భీం పేరు విూద జిల్లాలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కొమురం భీం వర్ధంతి సభలో ఆయన మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లాను రెండు జిల్లాలుగా విభజిస్తామని హావిూనిచ్చారు. కొత్తగా ఏర్పడేబోయే జిల్లాకు కొమురం భీం పేరు పెడతానని స్పష్టం చేశారు. గిరిజన యూనివర్సిటీకి కొమురంభీం పేరు పెడ్తమని తెలిపారు. అయితే ఆదిలాబాద్ జిల్లా పేరు మార్చమన్నారు. కొమురం భీం కుటుంబానికి పదిలక్షల పరిహారం అందచేస్తామన్నారు. అలాగే వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని అన్నారు. హైదారబాద్ బంజారాహిల్స్‌లో ఎకరా స్థలంలో బంజారా భవన్, ఆదివాసీ భవన్ నిర్మిస్తమని అన్నారు. గిరిజనులకు అంటురోగాలు రాకుండా చైతన్యం చేయాలని ఆకాంక్షించారు. 500 కళాకారులతో 20 బృందాలుగా ఏర్పాటుచేసి గిరిజనులను చైతన్యం చేసేలా కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని కార్పోరేట్ ఆస్పత్రుల నుంచి గిరిజన తండాలకు డాక్టర్లను పంపించి వైద్యాన్ని అందిస్తమని అన్నారు. ఇక్కడి వ్యాధులకు ఆస్పత్రుల ఏర్పాటు ద్వారా సమస్య పరిష్కారం కాదన్నారు. అసలు రోగాలు ఎందుకు వస్తున్నాయో అర్థం చేసుకోవాల్సి ఉందన్నారు. కేవలం ఉట్నూరులో ఓ ఆస్పత్రి ఏర్పాటు వల్ల సమస్య దూరం కాదన్నారు. గిరిజనుల్లో పౌష్టికాహార లోపం ఉందన్నారు. సమతుల్య ఆహారం లేక వారు వ్యాధుల బారిన పడుతున్నారని అందువల్ల వారికి పౌష్టికాహారం అందించాల్సి ఉందన్నారు. దీనికోసం కళాబృందాల ద్వారా చైతన్యం చేస్తామన్నారు. కొమురంభీమ్ బాటలోనే తెలంగాణ కోసం పోరాటం చేసినం, తెలంగాణ రాష్టాన్న్రి సాధించుకున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. సమైక్య పాలనలో కొమురంభీమ్‌కు సరైన గుర్తింపు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ అడవిబిడ్డలు, అన్నదమ్ములంతా కలిసి ఏకపక్షంగా టీఆర్‌ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలను గెలిపించి అధికారం ఇచ్చారని సీఎం గుర్తు చేశారు. ఆదిలాబాద్ జిల్లాను బాగు చేయాలని జిల్లా ప్రజలు మాకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా రూ.25కోట్లతో కొమురంభీమ్ స్మారక చిహ్నాన్ని నిర్మిస్తామని పేర్కొన్నారు. కొమురం భీమ్ సమాధి చుట్టూ ప్రదక్షణలు చేసేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. కొమురంభీమ్ కుటుంబానికి రూ.10లక్షలు మంజూరు చేస్తున్నామని తెలిపారు. కొమురంభీమ్ కుటుంబంలోని ఇద్దరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పారు. జోడేఘాట్ కేంద్రంగా వంద ఎకరాల్లో అద్భుతమైన పర్యాటక కేంద్రాన్ని నిర్మిస్తామన్నారు. ఆసిఫాబాద్‌లో వంద పడకల ఆసుపత్రి నిర్మిస్తామన్నారు. ప్రాణహిత-చేవెళ్ల నీళ్లు ముందుగా జిల్లాకే కేటాయించి, ఆతర్వాతనే ఆ నీటిని బయటకు పంపిస్తామని ముఖ్యమంతి కేసీఆర్ అన్నారు.ఆదిలాబాద్ జిల్లాలో 2,3 రోజులు ఉండి ఇక్కడి సమస్యలను తెలుసుకుంటానన్నారు. అవసరమైతే 2,3 హెలికాప్టర్లలో అవసరమైన అధికారులను తీసుకొచ్చి ఇక్కడి సమస్యలను పరిష్కరిస్తామని హావిూనిచ్చారు. భారీగా గిరిజనులు హాజరైన ఈ సభలో మంత్రి జోగురామన్న, ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి , కవి దేశిపతి శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.