హుదూద్ జలగండం
ఉత్తర తెలంగాణకు ప్రభావం
తెలంగాణ సచివాలయంలో కంట్రోల్ రూం
అధికారులను అప్రమత్తం చేసిన సీఎం కేసీఆర్
అత్యవసర సమావేశం నిర్వహించి సమీక్షించిన ప్రధాని
హైదరాబాద్, అక్టోబర్ 11 (జనంసాక్షి) : హుదూద్ జలగండం ముంచుకొస్తోంది. ఉత్తర తెలంగాణకు తుపాను ప్రభావం ఉంటుందనే అంచానతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. తెలంగాణ సచివాలయంలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటుచేసింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను అప్రమత్తంచేశారు. ప్రధాని నరేంద్రమోడీ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. హదూద్ తుపాను తీవ్రత వల్ల తెలంగాణలోనూ భారీ నుంచి, అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్న దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని, జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తంగా ఉంచాలని తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టర్లను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ముఖ్యమంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలియజేస్తున్న సందర్భంలో ఆయా జిల్లాల మంత్రులు కూడా అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. రెవెన్యూ కార్యదర్శి, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారి, బీఆర్.మీనా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి తనకు సమచారం అందించాలని సీఎం ఆదేశించారు. ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్ రెవెన్యూ కార్యదర్శి మీనా, ఇతర అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. తగు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులు, సీఎంఓ అధికారులు ఎప్పటికప్పుడు తుపాను గమనాన్ని, ప్రభావాన్ని తెలుసుకుంటున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అక్కడి కలెక్టర్లు, మంత్రులు, ఇతర అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని, తహశీల్దార్, ఎంపీడీఓ స్థాయి అధికారులు స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. తుపాను ప్రభావం ఆదివారం సాయంత్రం నుంచి తెలంగాణపై, ముఖ్యంగా ఉత్తర తెలంగాణపై ఉంటుందని అంచనాలున్నాయి. భారీ వర్షాల వల్ల చెరువు కట్టలు తెగడం, కాలువలు పొంగిపొర్లడం, లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం లాంటి అనర్థాలు జరిగే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేసింది. రెవెన్యూ, పోలీస్, ఫైర్, ఆర్‌అండ్‌బి, మెడికల్, పంచాయతీ రాజ్, నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండడంతోపాటు పూర్తి సమన్వయంతో విధులు నిర్వర్తించాలని ప్రభుత్వం ఆదేశించింది. చెరువు కట్టలకు గండ్లు పడే అవకాశం ఉన్నచోట మరింత అప్రమత్తంగా ఉండాలని, గండ్లు వెంటనే పూడ్చడానికి అవసరమైన సామగ్రి, సిబ్బందితో సిద్ధంగా ఉండాలని ఆదేశాలు అందాయి. నీటిపారుదల ప్రాజెక్టుల రిజర్వాయర్ల వద్ద కూడా సీనియర్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, నాగార్జునసాగర్ వద్ద కూడా పరిస్థితిని గమనించుకుంటూ అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం ఉన్నందున అక్కడి ప్రజల కోసం పునరావాసాలను సిద్ధం చేయాలని, ఆహార ధాన్యాలను కూడా నిల్వ ఉంచుకోవాలని స్థానిక అధికారులకు ఆదేశాలు అందాయి. సెక్రటేరియట్‌లో 23454088, 23454293 నెంబర్లతో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రాలు, డివిజన్ కేంద్రాలు మండల కేంద్రాల్లో కూడా కంట్రోల్ రూములు ఏర్పాటుచేశారు. ప్రజలు ఎలాంటి సహాయం కావాలన్నా, సమాచారం కావాలన్నా ఈ నెంబర్లకు ఫోన్ చేయవచ్చు. ఈ కంట్రోల్ రూములు తుపాను ముప్పు పూర్తిగా తొలిగిపోయే వరకు 24గంటలపాటు పనిచేస్తాయి.
అల్లకల్లోలంగా విశాఖ సముద్రతీరం
హుదుద్ పెనుతుపాను ముంచుకొస్తున్న నేపథ్యంలో విశాఖలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు భారీగా ఎగసిపడుతున్నాయి. అలల ఉద్థృతి అధికంగా ఉండటంతో ఆర్కేబీచ్‌లో పర్యాటకులను అనుమతించడంలేదు. చేపలవేట నిషేధించడంతో బోట్లన్నీ ఫిష్షింగ్ హార్బర్‌కే పరిమితమయ్యాయి.రైళ్ల సర్వీసులు రద్దుతో ప్రయాణీకులు లేక విశాఖ రైల్వేస్టేషన్ నిర్మానుష్యంగా మారింది. హుదుద్ తుపాను ఆదివారం విశాఖ సవిూపంలోనే తీరం దాటనుండటంతో అధికారులతో పాటు ప్రజల్లోనూ ఆందోళన నెలకొంది.పెనుతుపాను హుదుద్ విశాఖపట్టణానికి ఆగ్నేయదిశలో 260 కిలోవిూటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. గోపాలపూర్‌కు దక్షిణ-ఆగ్నేయ దిశలో 350 కిలోవిూటర్ల దూరంలో ఉంది. ఇది క్రమంగా పశ్చిమ వాయవ్యం దిశగా కదులుతూ రేపు మధ్యాహ్నంలోపు విశాఖ సవిూపంలో తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. రేపు తీరం దాటే సమయంలో సుమారు 170-180 కిలోవిూటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయి. తుపాను ప్రభావం ఉత్తరాంధ్రతోపాటు ఒడిశాలోని 8 జిల్లాలపై ఉంటుందని ఐఎండీ డీజీ ఎల్.ఎస్. రాథోడ్ అన్నారు. రేపు మధ్యాహ్నం తీరం దాటే అవకాశం ఉందని ఆయన తెలిపారు. తీరం దాటే సమయంలో 170 కిలోవిూటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. తీరం దాటిన 12గంటల తర్వాత పెనుతుపాను నుంచి సాధారణ తుపానుగా మారుతుందన్నారు. హుదుద్ కారణంగా మేఘాలపై అతిశీతల వాతావరణం నెలకొందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా తెలిపింది. సాధారణంగా -20 నుంచి -25 డిగ్రీల వరకు ఉండే ఉష్ణోగ్రత ప్రస్తుతం -53కు చేరుకుందని తెలిపింది. తుపాను తీరం దాటే సమయంలో 185 కిలోవిూటర్ల వేగంతో ఈదురు గాలులు వీయవచ్చని హెచ్చరించింది. ఇవి హరికేన్లంత బలంగా ఉంటాయని పేర్కొంది.
మూడు జిల్లాల్లో రెండు లక్షల మంది తరలింపు
క్షణక్షణం ఏం జరుగుతోందో అన్న ఆందోళన. ఎక్కడ సముద్రం దూసుకొస్తుందో అన్న భయం. హుదూద్ తుఫాన్ భీకరంగా ఉంటుందన్న హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాగం అప్రమత్తం అయ్యింది. సహాయక చర్యలకు యంత్రాంగాన్ని సిద్దం చేసుకుంది. హుదూద్ తుఫాను ముంచుకొస్తుండటంతో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తం అవుతోంది. ముందుజాగ్రత్త చర్యగా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి రెండు లక్షల మందిని తరలించాలని నిర్ణయించారు. మరోవైపు ఒడిషాలోని 11 జిల్లాల నుంచి ఇప్పటికే దాదాపు 4 లక్షల మందిని తరలించేశారు. మొత్తం 200కు పైగా సహాయ శిబిరాలను అధికారులు ఏర్పాటు చేయనున్నారు. అధికారులు, ఉద్యోగులు అందరికీ సెలవులు రద్దుచేశారు. డీజిల్, పెట్రోలు నిల్వలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం తుఫాను విశాఖకు 330 కిలోవిూటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. దీని గమనం వేగంగా ఉంది. ఇది క్రమంగా పశ్చిమ వాయువ్యదిశగా పయనించి … విశాఖ వద్ద రేపు మధ్యాహ్నం లోగా తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావం వల్ల ఈ సాయంత్రం నుంచి ఉభయగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 70 నుంచి 80 కిలోవిూటర్ల వేగంతో, రేపటి నుంచి 170 నుంచి 180 కిలోవిూటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముంది. గాలుల తీవ్రతకు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. తూర్పుగోదావరి, విశాఖపట్నం విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో అలలు రెండు విూటర్ల ఎత్తు ఎగిసిపడే అవకాశముంది. సహాయ కార్యక్రమాల కోసం 15 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు. సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ దళాలు రెడీగా ఉన్నాయి. నాలుగు నౌకలు, పది హెలికాప్టర్లను సిద్ధం చేశారు. ఇప్పటికే 250 మంది సైనికులు చేరుకున్నారు. తుఫాను బలహీనపడే అవకాశాలు ఏమాత్రం లేవని వాతావరణ శాఖ తెలిపింది. యుద్ధ ప్రాతిపదికన సిద్ధం కావాలని అధికారులకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అప్రమత్తంగా ఉండాలంటూ టెలికం కంపెనీలు ప్రజలకు ఎస్‌ఎంఎస్లు పంపుతున్నాయి. ఆంధప్రదేశ్ సచివాలయంలో కంట్రలో రూం ఏర్పాటుచేశారు. దీని నెంబర్లు 040 23456005, 23450419.
నక్కపల్లిలో ముందుకు వచ్చిన సముద్రం హుదుద్ తుపాను ప్రభావంతో విశాఖజిల్లా నక్కపల్లి మండలంలోని రాజయ్యపేట, బోయపాడు, బంగారంపేట గ్రామాల వద్ద సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. సముద్రం దాదాపు 60 అడుగుల మేర ముందుకొచ్చిందని గ్రామస్థులు చెబుతున్నారు. మత్య్సకారులంతా ముందు జాగ్రత్తగా తెప్పలు, వలలను సురక్షిత ప్రాంతాలకు చేర్చుకుంటున్నారు. సీఐ గఫొర్ ఆధ్వర్యంలో ఎస్సైలు విజయ్‌కుమార్, జోగారావులు ఆయా గ్రామాలకు వెళ్లి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వీరితోపాటు విశాఖ నుంచి వచ్చిన ప్రత్యేక పోలీసు బలగాలు మత్య్సకారులు సముద్రంలోకి వెళ్లకుండా గస్తీ నిర్వహిస్తున్నాయి