హుస్సేన్‌సాగర్‌కు శుద్ధి

1

తాగునీటి సరస్సుగా మన సాగరం

ఇక నుంచి నిమజ్జనాలుండవు : కేసీఆర్‌

తెలంగాణ సర్కారు విప్లవాత్మక నిర్ణయం

తెలంగాణకు కొత్త భూ సేకరణ చట్టం

హైదరాబాద్‌, అక్టోబర్‌ 15 (జనంసాక్షి) : తెలంగాణ సర్కారు విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. హుస్సేన్‌సాగర్‌ను శుద్ధి చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. తాగునీటి సరస్సుగా ఈ సాగర్‌ను తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇక నుంచి వినాయక నిమజ్జనాలు హుస్సేన్‌సాగర్‌లో ఉండవని, ప్రత్యామ్నాయంగా ఇందిరాపార్కులో మరో సరస్సు ఏర్పాటుచేస్తామని చెప్పారు. అలాగే తెలంగాణకు కొత్త భూ సేకరణ చట్టం తీసుకురాన్నుట్లు సీఎం తెలిపారు. సాగర్‌కు పునర్వైభవం తీసుకురావాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. సాగర్‌ ప్రక్షాళనను సత్వరమే పూర్తి చేయాలని, మురికికూపంగా మారిన జలాశయాన్ని మంచినీటి వనరుగా మార్చాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం మధ్యాహ్నం హుస్సేన్‌సాగర్‌ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. నెక్లెస్‌రోడ్‌, జలవిహార్‌, సంజీవయ్య పార్కు తదితర ప్రాంతాల్లో కేసీఆర్‌ పర్యటించారు. అనంతరం హుస్సేన్‌సాగర్‌ ప్రస్తుత పరిస్థితి, ప్రక్షాళనపై ఉన్నతాధికారులతో సవిూక్షించారు. నాలాలు, డ్రైనేజీ, సాగర్‌ ప్రక్షాళన తదితర అంశాలపై సీఎం ఆరా తీశారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సోమేశ్‌కుమార్‌, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌లు సాగర్‌ ప్రక్షాళన పనులను వివరించారు. సాగర్‌లో చేరుతున్న మురికినీటిని శుద్ధి చేసే సీవరేజ్‌ వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు, ప్రక్షాళన పనులను కేసీఆర్‌కు తెలిపారు. ప్రధానంగా బాలానగర్‌ పారిశ్రామిక వాడ నుంచి వస్తున్న రసాయన జలాలను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉందని తెలిపారు. డ్రైనేజీలు, నాలాల ఆధునికీకరణ, కలుషిత జలాల నియంత్రణ ద్వారా సాగర్‌కు పూర్వ వైభవం తీసుకురావాలని కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. వీలైనంత త్వరగా సాగర్‌కు వచ్చే కలుషిత జలాలను నియంత్రించాలని, తద్వారా మురికికూపంగా మారిన జలాశయాన్ని మంచినీటి వనరుగా తీర్చిదిద్దాలని సూచించారు. సీవరేజి వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ద్వారా మంచినీటిని సాగర్‌లోకి వదలాలని, సాగర్‌లో చేరే కలుషిత జలాలను నియంత్రించాలని ఆదేశించారు.

తెలంగాణకు భూ సేకరణ చట్టం : కేసీఆర్‌

తెలంగాణకు అవసరమైన భూ సేకరణ చట్టాన్ని రూపొందించాలని, బాధితులకు పునరావాస ప్యాకేజీ వీలైనంత త్వరగా ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. భూసేకరణపై సవిూక్ష నిర్వహించిన ఆయన భూ సేకరణలో భూమి కోల్పోయే వారికి అండగా నిలబడాలన్నారు. వారికి చెల్లించాల్సిన మొత్తాన్ని నేరుగా బ్యాంకులో జమ చేసేలాచూడాలన్నారు. మానేరు డ్యామ్‌ నిర్మాణంలో తమదీ బాధిత కుటుంబమేనని, ఆ బాధ తనకు తెలుసని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. భూ నిర్వాసితులకు పరిహారం నిర్దారణకు రాష్ట్ర, జిల్లా కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. పరిహారం డబ్బు ముందుగానే బ్యాంకులో డిపాజిట్‌ చేయాలని, కార్యాలయాల చుట్టూ తిరిగే దుస్థితి నిర్వాసితులకు రాకూడదని ఆయన అధికారులకు సూచించారు. భూసేకరణ అనేది నిర్వాసితులకు శాపంగా మారకూడదన్నారు. సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నతాధికారులతో భూసేకరణపై సుదీర్ఘంగా సవిూక్షా సమావేశం నిర్వహించారు. బాధితులకు పునరావాస ప్యాకేజ్‌ వీలైనంత త్వరగా ఇవ్వాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీచేశారు. తెలంగాణకు అవసరమైన భూసేకరణ చట్టాన్ని రూపొందించాలని ఆదేశించారు. భూసేకరణలో భూమి కోల్పోయే వారికి అండగా నిలవాలని సూచించారు. రిజిస్టేష్రన్‌ విలువ కంటే ఎక్కువ మొత్తం నిర్వాసితులకు ఇవ్వాలని చెప్పారు. ఈ సమావేశంలో మంత్రు మహ్మూద్‌ అలీ,హరీష్‌ రావు తదితరులు పాల్గొన్నారు. ఇదిలావుంటే హుస్సేన్‌సాగర్‌ పరిశీలనకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాన్వాయ్‌లో గందరగోళం చోటుచేసుకుంది. ఈ పర్యటనలో భాగంగా ఆయన ట్యాంక్‌బండ్‌, నెక్లెస్‌రోడ్‌, జలవిహార్‌, సుందరయ్య పార్కులను పరిశీలించారు. అనంతరం తిరిగి వెళ్తున్న సమయంలో సీఎం వాహనానికి ముందు వెళ్తున్న ఎస్కార్ట్‌ వాహనాలు హఠాత్తుగా ఎడమవైపునకు తిరిగి మినిస్టర్‌ రోడ్‌లోకి వెళ్లిపోయాయి. సీఎం కేసీఆర్‌ వాహనం మాత్రం నేరుగా వెళ్లి బుద్ధభవన్‌ వద్ద యూ టర్న్‌ తీసుకుంది. ఎస్కార్ట్‌ సిబ్బంది తేరుకుని సీఎం కాన్వాయ్‌ను అందుకునేందుకు ప్రయత్నించారు. అప్పటికే ఆయన కారు ముందుకు వెళ్లిపోయింది. దీంతో ముఖ్యమంత్రి వాహనం ముందు ఉండవలసిన ఎస్కార్ట్‌ వాహనాలు ఆయన కారును అనుసరించాయి.