వినువీధుల్లో మరో విజయం
ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1సి ఉపగ్రహ ప్రయోగం విజయవంతం
ఇస్రో శాస్త్రవేత్తలకు వెల్లువెత్తిన అభినందనలు
హైదరాబాద్, నెల్లూరు, అక్టోబర్ 16 (జనంసాక్షి) : వినువీధుల్లో మరో విజయం ఇస్రో సొంతమైంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1సి ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఇస్రోకు పలువురి నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇస్రోకు మరో గగన విజయం దక్కింది. భారత కీర్తిపతాకను మరోమారు సగర్వంగా ఎగురవేశారు. ఇప్పటికే గెలుపు గుర్రంగా పేరుగాంచిన పీఎస్‌ఎల్‌వీ రాకెట్ తన రికార్డును మరోసారి నిలుపుకొంది. 1425కిలోల బరువైన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1సీ ఉపగ్రహాన్ని గురువారం తెల్లవారుజామున విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం సిరీస్‌లో ఇది మూడో ఉపగ్రహం. శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం(షార్)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి వేకువజామున 1.32 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ26 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. 20 నిమిషాల ప్రయాణం తర్వాత ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1సీ ఉపగ్రహం నిర్ధేశిత గమ్యాన్ని చేరింది. దీంతో శాస్త్రవేత్తల్లో హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి. షార్ నుంచి అర్ధరాత్రి రాకెట్‌ను ప్రయోగించడం ఇస్రో చరిత్రలో ఇది రెండోసారి. ఈ ప్రయోగం కోసం సోమవారం ఉదయం 6.32 గంటలకు ప్రారంభంమైన కౌంట్‌డౌన్ 67 గంటలపాటు నిర్విఘ్నంగా కొనసాగింది. పీఎస్‌ఎల్‌వీ రాకెట్ సిరీస్‌లో జరిపిన 28 ప్రయోగాల్లో వరుసగా 27వ విజయం ఇస్రో సొంతం కావడం విశేషం. ఈ ప్రయోగంలో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలను కేంద్రమంత్రి జితేందర్ సింగ్ అభినందించారు. మేఘావృతమైన ఆకాశం.. బుధవారం నుంచే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం.. అక్కడక్కడా పిడుగులు.. వాతావరణంలో మార్పుల కారణంగా తొలుత సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్‌లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రయోగం జరుగుతుందా.. వాయిదా పడుతుందా అన్న అనుమానాలు కూడా కలిగాయి. శాస్త్రవేత్తలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఉత్కంఠకు తెరదించుతూ గురువారం తెల్లవారు జామున 1.32 గంటలకు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సీ26 నిప్పులు చిమ్ముతూ సగర్వంగా నింగిలోకి దూసుకెళ్లింది. దీంతో అనుమానాల మేఘాలన్నీ పటాపంచలు కాగా శాస్త్రవేత్తలకు పలువురు అభినందనలు అందించారు. ఇస్రో ఛైర్మన్ రాధాకృష్ణన్‌ను అభినందించారు. సాధారణంగా వాతావరణంలో మార్పులు ఏర్పడి ఉరుములు, మెరుపులు ఏర్పడితే కౌంట్‌డౌపన్ పనులు నిలిపేస్తారు. ఈ నేపథ్యంలోనే ఉదయం 5.30 గంటలకు మొబైల్ సర్వీసు టవర్‌ను (ఎంఎస్‌టీ) రాకెట్ నుంచి వెనక్కు పంపలేదు. వర్షం, ఉరుములు, మెరుపులు తగ్గిన తర్వాత ఉదయం 8.30 గంటల సమయంలో మొబైల్ సర్వీసు టవర్‌ను రాకెట్ నుంచి వేరుచేసి, వెనక్కు పంపారు. అనంతరం మూడు గంటల అలస్యంగా పీఎస్‌ఎల్‌వీ వాహక్పొకలో ద్రవ ఇంధనం నింపారు. మరికొన్ని పరీక్షలు నిర్వహించారు. అడ్డంకులను అధిగమించి.. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్‌ను ఈనెల పదో తేదీన నింగిలోకి పంపాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేశారు. ఏడో తేదీ కౌంట్‌డౌన్ ప్రారంభంకావాల్సి ఉంది. ఆరో తేదీన జరిగిన రాకెట్ సన్నద్ధత సమావేశంలో పీఎస్‌ఎల్‌వీలోని నాల్గో దశలో ఎక్విప్మెంట్‌బే (టెలీ కమాండ్స్ ఉపకరణాలు) సాంకేతిక లోపం ఉన్నట్లు గుర్తించారు. దాంతో ప్రయోగాన్ని వాయిదా వేశారు. సాంకేతిక లోపాన్ని అధిగమించేందుకు కమిటీని నియమించారు. ఈ కమిటీ సభ్యులు పీఎస్‌ఎల్‌వీలోని సాంకేతిక లోపంపై అధ్యయనం చేసి, కొత్త ఉపకరణాలు వేయాలని సూచించారు. దాంతో నాల్గో దశలోని హీట్‌షీల్డ్‌ను రాకెట్ నుంచి విడదీసి ఎక్విప్మెంట్‌బేలో కొత్త ఉపకరణాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత పరీక్షలు నిర్వహించి, ప్రయోగానికి సిద్ధం చేస్తుండగా, మళ్లీ వేరొకచోట లోపం ఉన్నట్లు గుర్తించారు. ఈ లోపాన్ని కమిటీ సరిచేసింది. అన్నీ అయిన తర్వాత హుద్‌హుద్ తుపాను భయం పట్టుకుంది. చివరకు దాని ప్రభావం నెల్లూరు జిల్లా వైపు లేకపోవడంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఊపిరి పీల్చుకున్నారు. అన్ని అడ్డంకులనూ అధికమించి పీఎస్‌ఎల్‌వీ-సీ26 ప్రయోగం వేకువజామున ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా పరీక్షించారు. పీఎస్‌ఎల్‌వీ-సీ26 వాహక నౌకచిమ్మ చీకట్లో నింగివైపు తారాజువ్వలా రివ్వున దూసుకెళ్లింది. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1సి ఉపగ్రహం నిర్ణీత కక్ష్యలోకి చేరడంతో శాస్త్రవేత్తల ఆనందానికి అవధుల్లేవు. పరస్పరాభినందనలు, అలింగనాలతో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ సంతోషకర వాతావరణాన్ని సంతరించుకుంది. మరో విజయాన్ని తన రికార్డుల్లో పదిలం చేసుకుంది. వీరికి ప్రధాని నరేంద్రమోడీ, రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అభినందనలు తెలిపారు.