ఉప్పల్ బాగాయత్‌కు అభివృద్ధి మహర్దశ
ఉప్పల్, మే 27 (జనం సాక్షి): హైదరాబాద్ నగర విస్తరణలో కీలకంగా మారుతున్న ప్రాంతాల్లో ఉప్పల్ బాగాయత్ ప్రత్యేక స్థానం సంపాదించుకుంటోందని, రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం పరిపాలనా, క్రీడా, సామాజిక, మౌలిక వసతుల పరంగా ఆదర్శవంతమైన అభివృద్ధి కేంద్రంగా రూపుదిద్దుకోనుందని ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన ఉప్పల్ బాగాయత్ ప్రాంతంలో విస్తృతంగా పర్యటించి జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పలు కీలక ప్రకటనలు చేస్తూ ఉప్పల్ బాగాయత్ భవిష్యత్ రూపురేఖలను వివరించారు.పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, ఉప్పల్ బాగాయత్‌లో మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) నూతన భవన నిర్మాణానికి త్వరలోనే ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా భూమి పూజ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం 10 ఎకరాల విస్తీర్ణంలో స్థలాన్ని కేటాయించడంతో పాటు రూ.100 కోట్ల భారీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసినట్లు వెల్లడించారు.ఈ ఎంఎంసీ కార్పొరేషన్ భవనం నిర్మాణం పూర్తయితే ఉప్పల్ బాగాయత్ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు రావడంతో పాటు మల్కాజిగిరి పరిసర ప్రాంతాల పరిపాలనా కార్యకలాపాలకు ఇది ప్రధాన కేంద్రంగా మారే అవకాశముందని పేర్కొన్నారు. ప్రభుత్వ విభాగాలు, ప్రజా సేవా కేంద్రాలు, సమావేశ హాళ్లు, ఆధునిక సదుపాయాలతో కూడిన కార్యాలయాలు ఒకే ప్రాంతంలో అందుబాటులోకి రావడం వల్ల ప్రజలకు సేవలు మరింత వేగంగా, పారదర్శకంగా అందే అవకాశం ఉందన్నారు.ముఖ్యంగా ఉప్పల్ బాగాయత్‌లో విస్తారంగా ఖాళీ స్థలాలు అందుబాటులో ఉండటంతో భవిష్యత్తులో ఎంఎంసీ కార్యాలయ విస్తరణకు అపార అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఆధునిక పరిపాలనా భవనాలు, ప్రత్యేక పార్కింగ్ స్థలాలు, పౌర సేవల విభాగాలు, డిజిటల్ సర్వీస్ సెంటర్లు, సమావేశ భవనాలు, ప్రజా వినియోగ సదుపాయాలు వంటి అనేక నిర్మాణాలను ఒకే క్యాంపస్‌లో అభివృద్ధి చేసే అవకాశం ఉందన్నారు. భవిష్యత్తులో ఈ ప్రాంతం మున్సిపల్ పరిపాలనకు కీలక కేంద్రంగా ఎదిగే అవకాశాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.అదేవిధంగా ఉప్పల్ బాగాయత్ ప్రాంతం భౌగోళికంగా ఎత్తైన ప్రాంతంలో ఉండటం ఈ ప్రాంతానికి ప్రధాన బలమని తెలిపారు. నగరంలోని అనేక ప్రాంతాలు ట్రాఫిక్ రద్దీ, వరదలు, వర్షపు నీటి నిల్వలు, కాలుష్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఉప్పల్ బాగాయత్ మాత్రం ప్రశాంత వాతావరణంతో ప్రత్యేకతను నిలుపుకుంటోందన్నారు. ఎత్తైన ప్రాంతంగా ఉండటంతో భారీ వర్షాల సమయంలో నీటి నిల్వలు తక్కువగా ఉండటంతో పాటు ట్రాఫిక్ ఒత్తిడి కూడా తక్కువగా ఉంటుందని చెప్పారు.విస్తారమైన రహదారులు, భవిష్యత్తు రోడ్డు విస్తరణకు అవకాశాలు, పరిశుభ్రమైన వాతావరణం, పచ్చదనం, నివాసాలకు అనుకూలమైన ప్రశాంత పరిస్థితులు ఉండటంతో ఉప్పల్ బాగాయత్ రాబోయే రోజుల్లో అత్యంత ప్రీమియం రెసిడెన్షియల్ మరియు అడ్మినిస్ట్రేటివ్ జోన్‌గా ఎదిగే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే పలు సంస్థలు, నివాస కాలనీలు, అభివృద్ధి ప్రాజెక్టులు ఈ ప్రాంతంపై ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు.“ఉప్పల్ బాగాయత్‌ను కేవలం ఒక కాలనీగా కాకుండా, భవిష్యత్తు హైదరాబాద్ అభివృద్ధిలో కీలక ప్రాంతంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. నగర విస్తరణలో భాగంగా ఇక్కడ అన్ని రకాల మౌలిక వసతులను కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళికతో పనిచేస్తున్నాం” అని పరమేశ్వర్ రెడ్డి వెల్లడించారు.ఖాళీ ప్రభుత్వ స్థలాలను ఆక్రమణల నుంచి రక్షించేందుకు రూ.3.10 కోట్ల వ్యయంతో భారీ ప్రహారీ గోడల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. ప్రభుత్వ భూముల సంరక్షణ ద్వారా భవిష్యత్తులో ప్రజా అవసరాలకు ఉపయోగపడే అనేక ప్రాజెక్టులను అమలు చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా జరుగుతున్న ప్రహారీ గోడల నిర్మాణ పనులు, కొత్తగా ఏర్పాటు చేస్తున్న బోర్‌వెల్ పనులను పరిశీలించి నాణ్యత ప్రమాణాలు పాటించాలని అధికారులకు సూచించారు.ఇందులో భాగంగా త్వరలోనే రూ.10 కోట్ల వ్యయంతో అత్యాధునిక సౌకర్యాలతో మల్టీలెవల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. యువత క్రీడల్లో రాణించేందుకు ఇండోర్ గేమ్స్, జిమ్ సదుపాయాలు, ఫిట్‌నెస్ సెంటర్లు, మినీ స్టేడియంలు, వాకింగ్ ట్రాక్‌లు వంటి ఆధునిక వసతులు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ద్వారా స్థానిక యువతకు రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడల్లో అవకాశాలు కల్పించడమే లక్ష్యమన్నారు.అదేవిధంగా స్థానిక ప్రజలకు వివాహాలు, సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలకు ఉపయోగపడేలా రూ.3.5 కోట్లతో అత్యాధునిక కమ్యూనిటీ హాల్ నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఇందులో పార్కింగ్, డైనింగ్ హాల్, సమావేశ వేదికలు, ఆధునిక సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు.ఇక రోడ్ల విస్తరణ, సీసీ రోడ్లు, ఆధునిక డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సౌకర్యాలు, పార్కుల అభివృద్ధి, ఎల్ఈడి వీధి దీపాలు, పచ్చదనం పెంపు, కాలనీల సుందరీకరణ వంటి పనులను కూడా దశలవారీగా చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రతి కాలనీ సమానంగా అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.“రేవంతన్న మార్క్ అభివృద్ధి అంటే మాటలు కాదు… పనులు. ప్రజలు కోరుకునే అభివృద్ధిని నేలమీద చూపించడమే మా లక్ష్యం. ఉప్పల్ బాగాయత్‌ను రాష్ట్రంలోనే అత్యుత్తమ అభివృద్ధి చెందిన ప్రాంతంగా నిలబెట్టే వరకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుంది” అని పరమేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఉప్పల్ భగాయత్ కాలనీ వాసులు వక్కంటి శ్రీనివాస్ రావు, బిజ్జుల రవీందర్ రెడ్డి, వంశీ చందర్ రెడ్డి, గోనె అర్జున్ రెడ్డి, విశ్వనాథ్, ఈగ సంతోష్ ముదిరాజ్, పూజల ప్రభాకర్, విప్లవ్ రెడ్డి, శివ ప్రసాద్ రావు, రావళి, స్వప్న, సుజాత, సూర్యగోపాల్, చారి, మూర్తి, మనోహర్ రెడ్డి, మహేష్, మురళి, రాఘవేంద్ర రెడ్డి, మల్లికార్జున్, సందీప్, యాదవల్లి రాజు, శ్రీనాథ్ రావు, శ్రీధర్ రెడ్డి, వెంకటయ్య, సల్ల ప్రభాకర్ రెడ్డి, లింగంపల్లి రామకృష్ణ, తుమ్మల దేవి రెడ్డి, మంద మురళి కృష్ణారెడ్డి, వరకల మదన్ గౌడ్, ఖాజా మౌలానా, అలుగుల అనిల్, వెంకటేశ్, బీమ్ సేన్, ఉపేందర్, నాగి రెడ్డి, లింగ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



