నృసింహ క్షేత్రాన.. భక్తి పారవశ్యం

* వైభవంగా ప్రారంభమైన స్తంభాద్రి లక్ష్మీనృసింహ స్వామి బ్రహ్మోత్సవాలు
* పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
* ఏకశిలా గరుడ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రముఖులు
ఖమ్మం , ఏప్రిల్ 28, (జనంసాక్షి) : ఖమ్మం నగర నడిబొడ్డున కొలువైన శ్రీ స్తంభాద్రి లక్ష్మీనృసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల పాటు కనువిందు చేయనున్న ఈ వేడుకల్లో భాగంగా మొదటి రోజున ఆలయ పరిసరాలు భక్తుల గోవింద నామస్మరణతో మారుమోగాయి. ఉత్సవాల తొలి రోజే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.
* శోభాయమానంగా పట్టువస్త్రాల సమర్పణ
రాష్ట్ర ప్రభుత్వం తరపున వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చక బృందం ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలకగా, స్వామివారికి మంత్రి పట్టువస్త్రాలను సమర్పించారు. ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్ మంత్రి తుమ్మలకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.
* ఆకట్టుకున్న ఏకశిలా గరుడ విగ్రహం
బ్రహ్మోత్సవాల సందడిలో భాగంగా ఆలయ ప్రాంగణంలోని పార్కులో నూతనంగా ప్రతిష్టించిన ఏకశిలా గరుడ విగ్రహాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆలయ అభివృద్ధిలో భాగంగా చేస్తున్న ఈ పనులు ఆధ్యాత్మిక శోభను మరింత పెంచుతున్నాయని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
* అట్టహాసంగా కార్యక్రమం
ఈ కార్యక్రమంలో ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహార,, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ యార్లగడ్డ హనుమంతరావు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు సాదు రమేష్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్, కార్యనిర్వహణాధికారి కె. జగన్మోహనరావు ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు స్వామివారికి వాహన సేవలు నిర్వహించనున్నారు. ఆలయ కమిటీ సభ్యులు, అర్చక బృందం ఈ వేడుకలకు భక్తులందరూ తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.



