ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడి
ఆగష్టు 12(జనం సాక్షి)ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై ఇవాళ దాడి జరిగింది. సీఎం నివాసంలో జన్ సున్వాయి కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో ఆ అటాక్ జరిగింది. తన సమస్యను చెప్పుకునేందుకు వచ్చిన ఓ వ్యక్తి సీఎం రేఖా గుప్తాపై అకస్మాత్తుగా దాడి చేశాడు. ఆ వ్యక్తి 30 ఏళ్ల ఉంటాడని బీజేపీ నేతలు చెబుతున్నారు. సీఎంపై దాడి చేసిన వ్యక్తిని.. అక్కడ ఉన్న సీఎం సిబ్బంది తక్షణమే అదుపులోకి తీసుకున్నారు. పబ్లిక్ మీటింగ్‌లో సమస్య చెప్పుకునేందుకు వచ్చిన వ్యక్తి ఎందుకు దాడికి పాల్పడ్డారన్న కోణంలో విచారణ నిర్వహిస్తున్నారు. గట్టిగా రెండు సార్లు ఆమె చెంపపై కొట్టినట్లు తెలుస్తోంది. జుట్టు పట్టుకుని మరీ బాదినట్లు చెబుతున్నారు. జుట్టు పట్టి పీకడంతో.. తలకు గాయాలైనట్లు తెలుస్తోంది.దాడి తర్వాత హుటాహుటిన సీఎంను ఆస్పత్రికి తరలించారు. ఢిల్లీలోని టాప్ ఆఫీసర్లు.. సీఎం ఇంటికి రక్షణ కల్పించేందుకు వెళ్లారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు.. సీఎం రేఖా గుప్తా నేరుగా ప్రజలతో దర్బార్ నిర్వహిస్తారు. ప్రతి వారం జరిగే జన్‌సున్వాయి కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను విన్నపం చేసుకుంటారు. సీనియర్ బీజేపీ నేత హరీశ్ ఖురానా మాట్లాడుతూ.. ఓ వ్యక్తి సీఎంపై దాడి చేశాడని, ప్రస్తుతం డాక్టర్లు సీఎంకు చికిత్స చేస్తున్నారని, ఆ దాడిని ఖండిస్తున్నామని ఆయన అన్నారు. రాజకీయ దురుద్దేశంతో ఆ దాడి చేశారా అన్న కోణంలో విచారణ జరపాలన్నారు. సీఎంను చెంపదెబ్బ కొట్టిన వ్యక్తి, ఆమె జుట్టును కూడా లాగేసినట్లు ఖురానా తెలిపారు.దీంట్లో రాజకీయ కుట్ర ఉన్నట్లు బీజేపీ ఆరోపించింది. సీఎం రేఖా గుప్తా నిర్వహిస్తున్న గ్రౌండ్‌వర్క్ కార్యక్రమాలను ప్రత్యర్థులు తట్టుకోలేకపోతున్నారని ఢిల్లీ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా తెలిపారు. దాడి వెనుక కారణాలను తెలుసుకోవాలన్నారు.