నందిపేట్ కు బస్సులు లేక ప్రయాణికుల అవస్థలు

ఆర్మూర్, ఫిబ్రవరి 6 ( జనం సాక్షి): ఆర్మూర్ వెల్మల్ మీదుగా నందిపేట్ బస్టాండ్ కు చేరుకునే ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఉదయాన్నే స్కూల్ విద్యార్థినీ విద్యార్థులకు, ప్రభుత్వ ప్రైవేటు టీచర్లకు, ప్రయాణికులకు ఎంతో సౌకర్యంగా ఉండే బస్సు లేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం ప్రైవేట్ వ్యక్తులు చేతుల్లో బస్సు ఉండడమే. బస్సు ఉన్న డ్రైవర్ లేరనే ప్రధాన కారణంతో ఆర్మూర్, వెల్మల్, నందిపేట్ కు బస్సు సౌకర్యాన్ని గత నాలుగు రోజులుగా నిలిపివేస్తున్నారు. ప్రైవెట్ వ్యక్తుల చేతుల్లో కాకుండా, ఆర్మూర్ ఆర్టీసీ రవాణా సంస్థ ప్రాతినిధ్యం వహించి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. ఆర్మూర్ నందిపేట్ కు వెల్మల్ మీదుగా రోజుకు వందల మంది ప్రయాణికులు వెళ్తుంటారు. ఇతర మార్గాల గుండా నందిపేట్ కు బస్సులు ఉన్నప్పటికీ, నందిపేట్ పరిసర ప్రాంతాల్లో ప్రైవేట్ ఆటోలు, రవాణా సదుపాయం సరిగా ఉండక ఈ బస్సు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇకనైనా ఆర్మూర్ డిపో మేనేజర్ ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా వెల్మల్ మీదుగా నందిపేట్ కు బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.