చిన్నారులకు నరకయాతన
* పానీపూరి తిని 15 మంది చిన్నారులకు అస్వస్థత
* ఘటనపై అయిజ పోలీసులు విచారణ
రాజోలి/అయిజ, మే 26 (జనంసాక్షి): సరదాగా పానీపూరి తిన్న చిన్నారులకు ఆ ఆనందం కాసేపటికే నరకయాతనగా మారింది. జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీలో మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో పానీపూరి తిన్న 15 మంది చిన్నారులు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో బాధపడుతూ విలవిల్లాడిపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. పిల్లలు నొప్పితో ఏడుస్తుంటే తల్లిదండ్రులు కళ్లలో నీళ్లతో ఆసుపత్రుల చుట్టూ పరుగులు తీశారు. బాధితులను వెంటనే అయిజలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం చిన్నారుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. పిల్లలు సరదాగా పానీపూరి తిన్నారు కానీ ఇలా ఆసుపత్రి పాలవుతారని ఊహించలేదంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పానీపూరి తయారీలో కల్తీ నీరు, నాసిరకం పదార్థాలు ఉపయోగించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపిస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు చేసి ఉంటే మా పిల్లలకు ఈ పరిస్థితి వచ్చేదా..? అంటూ బాధితుల కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. వీధి ఆహార విక్రయాలపై అధికారుల పర్యవేక్షణ లోపమే ఇలాంటి ఘటనలకు కారణమవుతోందని స్థానికులు మండిపడుతున్నారు.అయిజలో చోటుచేసుకున్న ఈ ఘటనతో పట్టణ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఘటనపై అధికారులు స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.



