జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తుంది

కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి

సిద్దిపేట బ్యూరో( జనంసాక్షి ) జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన గనుల శాఖ మంత్రి మరియు ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు.సోమవారం సిద్దిపేట ఐడిఓసి లో రాష్ట్ర మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ కే హైమావతితో కలిసి జిల్లాలోని జర్నలిస్టులకు మీడియా అక్రిడిటేషన్ కార్డులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దరిపెల్లి చంద్రం, జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ లక్ష్మీ కిరణ్, డిఆర్ఓ నాగరాజమ్మ, సిద్దిపేట ఆర్డిఓ సదానందం, ఆత్మ కమిటీ చైర్మన్, సభ్యులు, డిపిఆర్ఓ రవికుమార్, ఐ అండ్ పి ఆర్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భూపాల్, జర్నలిస్టులు, మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు, సమాచార పౌర సంబంధాల శాఖ సిబ్బంది తిరుపతి నాయక్, రాంబాబు, రాములు, మల్లికార్జున్, మహేష్, బావొద్దీన్, నీరజా, రేణుక, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి* మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని తెలిపారు. అర్హత ఉన్న జర్నలిస్టులందరికీ మీడియా అక్రిడిటేషన్ కార్డులను అందిస్తున్నామని తెలిపారు. దానిలో భాగంగా సిద్దిపేట జిల్లాలో ఈరోజు జర్నలిస్టులతో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి కార్డులను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఇంతమంది జర్నలిస్టులను ఒకేసారి కలుసుకొని వారితో మమేకమవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేసే తెలంగాణ మీడియా లేకపోవడంతో ప్రొఫెషనల్ గా మీడియా సంస్థను స్థాపించి ఉద్యమ తీవ్రతను ప్రజలలోకి తీసుకెళ్లడం జరిగిందని తెలిపారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందని తెలిపారు. ప్రస్తుతం మీడియా యువతతో ప్రొఫెషనల్ గా చాలా అడ్వాన్స్ గా ఉందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో టాప్ ప్రయార్టీలో జర్నలిస్టులకు అవకాశం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కు ఈ సందర్భంగా సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులు నాణ్యమైన వైద్య సేవలను రాష్ట్ర ప్రజలకు అందిస్తుందని ఆ సేవలను జర్నలిస్టులు కూడా సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం నిమ్స్ లాంటి ముఖ్యమైన ఆసుపత్రిలో కూడా విజయవంతంగా పనిచేస్తుందని తెలిపారు. అదేవిధంగా జర్నలిస్టులకు ఇచ్చే ప్రత్యేక హెల్త్ కార్డులు సరిగా ఉపయోగం అయ్యేలా నెట్వర్క్ ఆసుపత్రులలో ఏర్పాటు చేస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే మంచి పథకాలను ప్రజల్లోకి మరింత వెళ్లేలా ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా కృషి చేయాలని అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలులో ఏమైనా పొరపాట్లు ఉంటే ఎత్తిచూపాలని వాటిని ప్రభుత్వం సరి చేసుకుంటుందని తెలిపారు. తెలంగాణ ఉద్యమకారుల అభివృద్ధికి మరియు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, మెదక్ ఎంపీ రఘునందన్ రావు విజ్ఞప్తి మేరకు తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు వదిలిన జర్నలిస్ట్ లక్ష్మారెడ్డి కుటుంబాన్ని ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు మాట్లాడుతూ మంత్రి వివేక్ వెంకటస్వామి మరియు నాకు ఇద్దరికీ మీడియాతో సంబంధం ఉందని నేను గతంలో మీడియాలో కంట్రిబ్యూటర్ గా పనిచేశానని, మంత్రివర్యులు ఒక మీడియా సంస్థకు అధిపతిగా ఉన్నారని పేర్కొన్నారు. జర్నలిస్టుగా పనిచేసిన నాకు జర్నలిస్టుల సమస్యలు తెలుసని వాటి పరిష్కారానికి ప్రభుత్వం చొరువ తీసుకోవాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాల నుండి సిద్దిపేటకు మరియు మండల కేంద్రాలకు వచ్చి కుటుంబంతో జీవిస్తూ జర్నలిస్టులుగా పని చేస్తూ ఉంటారని ప్రతి జర్నలిస్టుకు అదనంగా నిధులు మంజూరు చేస్తూ ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలని అన్నారు. జనంలోకి మంచిని తీసుకెళ్లడంతో పాటు ప్రభుత్వం పథకాలలో లోపాలను కూడా ఎత్తి చూపేది జర్నలిస్టులని వారు ఎత్తిచూపే లోపాలను ప్రభుత్వం గుర్తించాలని అన్నారు. జర్నలిస్టుల అందరికీ హెల్త్ కార్డులు కార్పొరేట్ లెవెల్లో పని చేసేలా చూడాలనీ అన్నారు. జర్నలిస్టుగా పనిచేస్తూ తెలంగాణ ఉద్యమ సమయంలో దీక్షలు చేసి దీక్ష శిబిరంలోని చనిపోయిన జర్నలిస్టు లక్ష్మారెడ్డి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.జిల్లా కలెక్టర్ కె హైమావతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద కోసం ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సన్న బియ్యం సరఫరా, 200 యూనిట్లు ఉచిత కరెంటు, సబ్సిడీ గ్యాస్ సిలిండర్, ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలకు పెంపు, నూతన రేషన్ కార్డుల పంపిణీ, ప్రభుత్వ విద్యా, వైద్యం బలోపేతం, మహిళల అభివృద్ధి తదితర అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని వాటిని పేద ప్రజలకు చేర్చడంలో మీడియా ముందుండాలని సూచించారు.