కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ హామీతో రిలే దీక్షలు విరమణ
రాజోలి (జనంసాక్షి) : పెద్ద ధన్వాడ ఇథనాల్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు 20వ రోజు సందర్భంగా తాత్కాలికంగా వాయిదా వేసినట్టు రైతులు ప్రకటించారు. సోమవారం హైదరాబాద్‌లో ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్‌ఏ సంపత్ కుమార్ ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇథనాల్ వ్యతిరేక పోరాట సమితి సభ్యులు వెల్లడిరచారు. ఈ మేరకు మంగళవారం నాడు రిలే నిరాహార దీక్షలను రాజోలి మండలం ఎమ్మార్వో రామ్ మోహన్, ఆర్‌ఐ చంద్రకాంత్, శాంతినగర్ సిఐ టాటా బాబు, రాజోలి ఎస్‌ఐ జగదీశ్వర్, రాజోలి మండల కాంగ్రెస్ అధ్యక్షులు దస్తగిరి, అలంపూర్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పచ్చర్ల కుమార్ సమక్షంలో దీక్షలో కూర్చున్నవారికి నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. సంపత్ కుమార్ స్పష్టమైన హామీ మేరకు వాయిదా వేస్తున్నామని, సర్కారు స్పందించకపోతే తిరిగి ఆందోళనలు చేపడతామని గ్రామాల ప్రజలు స్పష్టం చేశారు. రిలే దీక్షలకు సహకరించి, మద్దతిచ్చిన ప్రతి ఒక్కరికీ ఇథనాల్ వ్యతిరేక పోరాట సమితి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.