కొడంగల్ ఎత్తిపోతలకు సీవోటీ మెలిక
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం (ఎన్‌కేఎల్‌ఐఎస్) ఆది నుంచీ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇప్పుడు ఆ పథకానికి ఆమోదముద్ర వేసేందుకు కమిటీ ఆఫ్ టెండర్స్(సీవోటీ) షరతులు విధించడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా, నిబంధనల మేరకే జరిగిందని లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని, అప్పుడే ఆమోదం తెలుపుతామని సీవోటీ స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఎలాంటి వివాదాలు తలెత్తినా సులభంగా తప్పించుకునేందుకు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశాల మేరకే ఈ షరతు విధించినట్టు తెలిసింది. గతంలో ఎప్పుడూ, ఏ ప్రాజెక్టు టెండర్లకూ లేనివిధంగా సీవోటీ షరతు విధించడంపై ఇంజినీర్లు నానావిధాలుగా చర్చించుకుంటున్నారు.
ఎన్నడూ లేనివిధంగా సీవోటీ మెలిక
నారాయణపేట, కొడంగల్, మక్తల్ నియోజకవర్గాల్లోని లక్ష ఎకరాలకు సాగునీటితోపాటు నారాయణపేట జిల్లాలో తాగునీటి అవసరాల కోసం 2 ప్యాకేజీలుగా ఎన్‌కేఎల్‌ఐఎస్ పనులను చేపట్టాలని నిర్ణయించింది. మొదటి ప్యాకేజీకి రూ.1,134.62 కోట్లు, రెండో ప్యాకేజీ పనులకు రూ.1,126.23 కోట్లు అవసరమవుతాయన్న అంచనాతో ఇటీవల టెండర్లను ఆహ్వానించడంతో ఎన్‌సీసీ, ఎల్‌అండ్‌టీ, మేఘా, రాఘవ కన్‌స్ట్రక్షన్ కంపెనీలు టెక్నికల్ బిడ్లు దాఖలు చేశాయి. వారం రోజుల క్రితం తెరిచిన ఆ బిడ్లలో 4 కంపెనీలూ అర్హత సాధించాయి. దీంతో తాజాగా ప్రైస్ బిడ్లను తెరిచారు. వాటిలో ఎన్‌సీసీ, ఎల్‌అండ్‌టీ బిడ్లు అర్హత సాధించలేదని ప్రకటించిన అధికారులు.. చివరికి మొదటి ప్యాకేజ్ పనులను మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్ కంపెనీకి, 2వ ప్యాకేజీ పనులను మేఘా కంపెనీకి కట్టబెట్టారు. ఆ రెండు కంపెనీలు అంచనా వ్యయం కంటే 3.95 శాతం అధికంగా కోట్ చేయడం కొసమెరుపు. ఆపై సదరు టెండర్ల ప్రక్రియ సజావుగా కొనసాగిందా? లేదా? సాకేంతిక అంశాలను పరిశీలించారా? లేదా? అనే అంశాలను పరిశీలించిన అధికారులు.. ఇటీవల ఆ టెండర్లను తుది ఆమోదం కోసం సీవోటీకి పంపించారు. కానీ, టెండర్లను ఆమోదించిందీ? లేనిదీ ఇప్పటివరకూ అటు ఇరిగేషన్ అధికారులు గానీ, ఇటు సీవోటీ వర్గాలు గానీ ఖరారు చేయలేదు
ముందస్తు జాగ్రత్త కోసమే
టెండర్ల పక్రియపై ఆదినుంచీ అనేక అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. మేఘా, రాఘవ కంపెనీలకు టెండర్లను కట్టబెట్టేందుకే టెక్నికల్ ఎవాల్యూయేషన్‌ను సరిగా నిర్వహించలేదని, మిగిలిన రెండు కంపెనీలను ఉద్దేశపూర్వకంగానే తప్పించారని ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. వాస్తవానికి టెక్నికల్ ఎవాల్యూయేషన్ చేసేటప్పుడు ఆయా కంపెనీల ట్రాక్ రికార్డును పరిశీలిస్తారు. గతంలో కంపెనీ చేపట్టిన నిర్మాణాలు, వాటిలో తలెత్తిన వైఫల్యాలు, ప్రమాదాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఎన్‌కేఎల్‌ఐఎస్ టెండర్ల విషయంలోనూ ఇదే పద్ధతిని పాటించి ఉంటే టెక్నికల్‌గా మేఘా కంపెనీ అర్హత సాధించే అవకాశమే లేదని, ఆ కంపెనీ బిడ్‌ను ప్రాథమికంగానే తిరిస్కరించాల్సి ఉంటుందని ఇంజినీరింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆ కంపెనీ నిర్మిస్తున్న సుంకిశాల ప్రాజెక్టులో ఇటీవల భారీ ప్రమాదం సంభవించడమే ఇందుకు కారణమని పేర్కొంటున్నారు.