కాంగ్రెస్‌లో అసంతృప్తి సెగ
పార్టీ వీడే యోచనలో లింగోజి కిరణ్ కుమార్
రాజకీయాల్లో పెరిగిన ఉత్కంఠ
చండూరు,ఏప్రిల్ 21 ( జనంసాక్షి)
నల్గొండ జిల్లా రాజకీయాల్లో, ముఖ్యంగా మునుగోడు నియోజకవర్గంలోని చండూరు మండలంలో ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు, కే.ఆర్జీ.ఆర్ ఫౌండేషన్ చైర్మన్ లింగోజి కిరణ్ కుమార్ పార్టీ అధిష్టానం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఆయన పార్టీ మారే యోచనలో ఉన్నారన్న వార్త ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.గతంలో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన కిరణ్ కుమార్, పార్టీ పెద్దల ఆదేశాల మేరకు తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. పార్టీ అధిష్టానం తనకు ఏదో ఒక నామినేటెడ్ పదవిని కట్టబెడుతుందని ఆయన గట్టిగా ఆశించారు. కానీ, ఇటీవల జరిగిన కో-ఆప్షన్ సభ్యుల ఎంపికలో ఆయనకు ఎటువంటి స్థానం కల్పించకపోవడంతో ఆయన తీవ్ర నిరాశకు గురైనట్లు తెలుస్తోంది. తనను పార్టీ విస్మరించిందన్న భావన ఆయనలో బలమైన అసహనాన్ని కలిగిస్తోంది.రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో, మునుగోడు నియోజకవర్గంలో కీలకమైన చండూరు మండలంలో కిరణ్ కుమార్ లాంటి యువ నాయకుడు అసంతృప్తితో ఉండటం కాంగ్రెస్ పార్టీకి పెద్ద సవాలుగా మారింది. అధిష్టానం తనను గుర్తించకపోవడాన్ని నిరసిస్తూ, ఎంపీటీసీ లేదా జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఆయన సొంతంగా పోటీ చేసినా లేదా పార్టీ మారినా, అది కాంగ్రెస్ ఓటు బ్యాంకుపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కిరణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీని వీడి ఇతర పార్టీలో చేరడానికి సిద్ధమైనట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అందుతున్న సమాచారం ప్రకారం, ఈ నెల 25న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమక్షంలో ఆయన ఆ పార్టీలో చేరడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.ఈ పరిణామాలు మునుగోడు రాజకీయాల్లో కీలక మలుపులు తిరిగేలా కనిపిస్తున్నాయి. మేధావులు, రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, అధిష్టానం తక్షణమే రంగంలోకి దిగి ఆయనతో చర్చలు జరపకపోతే, రాబోయే ఎన్నికల్లో పార్టీకి ఊహించని నష్టం వాటిల్లే అవకాశం ఉందని స్పష్టమవుతోంది. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది వేచి చూడాలి.



