రామంతపూర్‌లో డ్రగ్స్ కంట్రోల్ దాడులు
ఉప్పల్ / రామంతపూర్, మే 31 (జనం సాక్షి): నగరంలో మత్తు పదార్థాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు డ్రగ్స్ కంట్రోల్ పరిపాలన విభాగం అధికారులు చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో రామంతపూర్ ప్రాంతంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నియంత్రిత ఔషధాలను నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్నారనే సమాచారంతో అధికారులు పలు మెడికల్ షాపులపై ఆకస్మికంగా దాడులు నిర్వహించారు.ఈ సందర్భంగా రామంతపూర్‌లోని ఎస్‌ఎస్‌ఆర్ మెడికల్స్‌లో నిర్వహించిన తనిఖీల్లో కోడైన్ కలిగిన దగ్గు సిరప్‌లు, ట్రమడోల్ కలిగిన క్యాప్సూల్స్ అక్రమంగా నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ప్రజారోగ్యానికి ముప్పు కలిగించే విధంగా ఈ మందులు సరైన వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం.తనిఖీల సమయంలో కోడైన్ ఫాస్ఫేట్ కలిగిన టాసెక్స్ దగ్గు సిరప్ మరియు ట్రమడోల్ కలిగిన స్పాస్మో ప్రాక్సీవాన్ ప్లస్ క్యాప్సూల్స్ నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్నట్లు బయటపడింది. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం ప్రకారం ప్రత్యేక నియంత్రణలో ఉండే ఈ ఔషధాలను వైద్యుల సూచన లేకుండా విక్రయించడం తీవ్రమైన ఉల్లంఘనగా అధికారులు పేర్కొన్నారు.దాడుల సందర్భంగా భారీ మొత్తంలో మందులను స్వాధీనం చేసుకున్న అధికారులు, స్టాక్ రిజిస్టర్లు, కొనుగోలు–అమ్మకాల బిల్లులు, ప్రిస్క్రిప్షన్ రికార్డులు, నిల్వల వివరాలు తదితర పత్రాలను పరిశీలన నిమిత్తం స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో పలు అవకతవకలు బయటపడినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో మెడికల్ షాపు నిర్వహణకు సంబంధించిన రాజు మరియు వి. సావిత్రిపై విచారణ కొనసాగుతోంది.ఇటీవలి కాలంలో యువతలో కోడైన్ సిరప్‌లు, ట్రమడోల్ వంటి ఔషధాలను మత్తు కోసం దుర్వినియోగం చేస్తున్న ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో డ్రగ్స్ కంట్రోల్ శాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. కోడైన్ కలిగిన సిరప్‌లను అధిక మోతాదులో తీసుకోవడం వల్ల మత్తు ప్రభావం కలుగుతుందని, ట్రమడోల్ వంటి మందులు వైద్యుల పర్యవేక్షణ లేకుండా వినియోగిస్తే వ్యసనానికి దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఈ సందర్భంగా డ్రగ్స్ కంట్రోల్ అధికారులు మాట్లాడుతూ, ప్రజారోగ్యానికి హాని కలిగించే విధంగా నియంత్రిత ఔషధాలను అక్రమంగా విక్రయించే మెడికల్ షాపులపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే సంబంధిత లైసెన్సులను రద్దు చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు కూడా చేపడతామని హెచ్చరించారు.ప్రజలు మందులు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని, వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా నియంత్రిత ఔషధాలను వినియోగించవద్దని సూచించారు. నగరవ్యాప్తంగా ఇటువంటి ప్రత్యేక తనిఖీలు మరింత విస్తృతంగా కొనసాగనున్నట్లు అధికారులు వెల్లడించారు.ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు అక్రమ ఔషధాల విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్న డ్రగ్స్ కంట్రోల్ శాఖ చర్యలు నగరంలో చర్చనీయాంశంగా మారాయి.



