వరుణుడి కోసం రైతన్న ఎదురుచూపు


మండుతున్న ఎండలతో అల్లాడుతున్న పంటలు
జడ్చర్ల, జూలై 15 (జనం సాక్షి): మృగశిర కార్తె ప్రవేశించి నెల రోజులు గడుస్తున్నా వరుణ దేవుడు కరుణించకపోవడంతో జడ్చర్ల నియోజకవర్గ వ్యాప్తంగా అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా ఈ సమయానికి తొలకరి జల్లులు కురిసి భూమి చల్లబడాలి, కానీ అందుకు భిన్నంగా జూలై నెలలో కూడా ఎండలు మండుతుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
ఆశగా విత్తితే.. నిరాశే మిగిలేలా: కొద్దిపాటి వర్ష సూచనలతో, ఆశతో రైతులు తమ పొలాల్లో విత్తనాలు వేశారు. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో, మొలకెత్తిన పంటలు నీరు లేక ఎండిపోతున్నాయి. ముఖ్యంగా మొక్కజొన్న పంట వర్షాభావం వల్ల పూర్తిగా ఎండిపోతుండగా, వేసిన పత్తి పంటనైనా కాపాడుకోవాలని రైతులు నానా తంటాలు పడుతున్నారు. పంటను కాపాడేందుకు స్వయంగా వాటర్ పైపుల ద్వారా నీరు పడుతూ తమ పత్తి చేనును దక్కించుకునేందుకు రైతులు పడుతున్న ఆరాటం అక్కడి పరిస్థితులకు అద్దం పడుతోంది. ఎండ తీవ్రతకు భూమి పగుళ్లు ఇచ్చి, పంటలు విలవిలలాడుతున్నాయి.
ఆగం అవుతున్న రైతన్న: పెట్టుబడుల కోసం అప్పులు చేసి, ఎన్నో ఆశలతో సాగు చేసిన పంటలు చేతికి అందకముందే ఎండిపోతుండటంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. ఇప్పటికే సాగుకు చేసిన ఖర్చు అంతా వృథా కావడంతో పాటు, తిరిగి మళ్లీ విత్తనాలు వేయాలంటే తమ దగ్గర డబ్బులు లేక, వాతావరణం సహకరించక రైతులు ఆగం అవుతున్నారు.
ప్రభుత్వం స్పందించాలి: వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం అప్రమత్తమై, ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఆలోచించాలని, ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. వరుణుడు కరుణించి, త్వరలోనే వర్షాలు కురిపించాలని జడ్చర్ల మండల రైతన్నలు ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు.



