ప్రభుత్వ ఆసుపత్రి వద్ద బస్సు స్టాప్ ఏర్పాటు చేయాలి

బెల్లంపల్లి, ఆగష్టు 1, (జనంసాక్షి) బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద బస్ స్టాప్ ఏర్పాటు చేయాలని ఎంసిపిఐయూ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం వారు ఆసుపత్రిని సందర్శించి ఆస్పత్రిలో వసతులను పరిశీలించారు. నియోజకవర్గంలోని ఏడు మండలాలకు పెద్దదిక్కైనా ఈ గవర్నమెంట్ ఆసుపత్రిని పట్టించుకునే నాధుడే కరువయ్యారని ఆరోపించారు. ఏడు మండలాల నుండి వస్తున్న ప్రజలు నరకయాతన అనుభవిస్తున్న ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికార యంత్రాంగం చోద్యం చూస్తుందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో 30 పడకల ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా పెద్ద బోర్డు పెట్టారే తప్ప ఇంతవరకు వంద పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయకపోవడం దారుణం అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిని రెండున్నర సంవత్సరాల నుండి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పట్టించుకోక పోవడంతో సరైన డాక్టర్లు లేక, గైనకాలజిస్ట్, సర్జన్లు లేక రోగులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. రోగుల సౌకర్యార్థం ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఆర్టీసీ బస్సులు ఆపే విధంగా బస్ స్టాప్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యులను నియమించాలని అన్నారు. ఈకార్యక్రమంలో ఎంసిపిఐయూ జిల్లా కార్యదర్శి సబ్బని రాజేంద్ర ప్రసాద్, సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ నాయకులు బాపు, పోలోజి రామకృష్ణ , తోగరి రాహుల్ తదితరులు పాల్గొన్నారు.