ప్రమాదకరంగా మారిన కాలనీ మట్టి రోడ్లు

నిత్యం నరకం చూస్తున్న కాలనీ వాసులు
జడ్చర్ల, ఆగస్టు 3 (జనంసాక్షి): కావేరమ్మపేట రోడ్డులో మైనార్టీ హాస్టల్ ఎదురుగా ఉన్న దాచని వెంకటరెడ్డి నగర్ కాలనీ రోడ్లు గుంతలమయంగా మారి అత్యంత ప్రమాదకరంగా తయారయ్యాయని, వెంటనే అధికారులు స్పందించి వాటిని పూడ్చి సిసి రోడ్డు నిర్మాణం చేపట్టాలని కాలనీవాసులు కోరుతున్నారు. మట్టి రోడ్లపై ఏర్పడిన గుంతల కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్కడే మెయిన్ రోడ్డుపై జరుగుతున్న కల్వర్టు రిపేరు పనుల కారణంగా వాహనాలన్నీ ఈ మార్గం గుండానే మళ్లించడంతో రోడ్డు పూర్తిగా దెబ్బతిందని, వర్షాల సమయంలో చెరువులను తలపించేలా రోడ్లపై నీరు నిలిచిపోవడంతో పిల్లల పాఠశాలలకు, ఆఫీసులకు వెళ్లేవారికి తీవ్ర అంతరాయం కలుగుతోందని వాపోయారు. ఈ గుంతల కారణంగా చిన్న పిల్లలు, వాహనదారులు కిందపడి తీవ్ర గాయాలపాలవుతున్నారని, అంతేకాకుండా, నిలిచిన నీటి వల్ల దోమల సమస్య, ఈగలు విపరీతంగా పెరిగిపోయి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి, కాలనీలో నెలకొన్న రోడ్డు, డ్రైనేజీ సమస్యలను వెంటనే పరిష్కరించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కాలనీవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. సోమవారం కాలనీ రోడ్ల సమస్యను పరిష్కరించాలని మున్సిపల్ కార్యాలయంలో వినిత పత్రం ఇచ్చినట్లు కాలనీ వాసులు తెలిపారు.



