రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

>వరి కొనుగోలు కేంద్రాల తనిఖీ.

జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్

ఉప్పునుంతల జనంసాక్షి : మండలంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై క్షేత్రస్థాయి పరిశీలించిన జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్,ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు పూర్తిస్థాయిలో చేరేలా అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ సూచించారు.శనివారం ఉదయం అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని ఉప్పునుంతల మండలంలోని మామిళ్ళపల్లి, లక్ష్మాపూర్ గ్రామాలను సందర్శించిన కలెక్టర్ వివిధ ప్రభుత్వ పథకాల అమలు తీరును పరిశీలించారు. ముందుగా మామిళ్ళపల్లి గ్రామంలోని చెరువు కట్టపై కొనసాగుతున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను పరిశీలించి, పనుల నాణ్యత, కార్మికుల హాజరు, వేతనాల చెల్లింపులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంపొందించే దిశగా పనులను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.అనంతరం గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన కలెక్టర్, లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి నిర్మాణాల పురోగతి, ఎదురవుతున్న సమస్యలను తెలుసుకున్నారు. ఇళ్ల నిర్మాణాలను నిర్ణీత గడువులో పూర్తి చేసి అర్హులైన కుటుంబాలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండరాదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో కొనసాగుతున్న జనాభా గణన ప్రక్రియను కూడా కలెక్టర్ పరిశీలించారు.