పెద్ద వాల్గొట్ ప్రాథమిక పాఠశాలలో పాఠ్యపుస్తకాలు, నోటుబుక్కుల పంపిణీ

విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు కృషి చేయాలని నాయకుల సూచన
సిరికొండ జూన్ 19 (జనం సాక్షి): సిరికొండ మండలంలోని పెద్ద వాల్గొట్ గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోటుబుక్కులను పంపిణీ చేశారు. నూతన విద్యా సంవత్సరాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో సర్పంచ్ పిట్ల వనిత నర్సింగ్ విద్యార్థులకు పుస్తకాలు అందజేసి విద్య యొక్క ప్రాముఖ్యతను వివరించారు.ఈ సందర్భంగా ఉపసర్పంచ్ రాము మాట్లాడుతూ, “విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేది పాఠశాలే. ప్రభుత్వం అందిస్తున్న పాఠ్యపుస్తకాలు, నోటుబుక్కులను సద్వినియోగం చేసుకుని ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి. నేటి విద్యార్థులే రేపటి దేశ నిర్మాణ కర్తలు. తల్లిదండ్రులు కూడా పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపించి వారిని విద్యలో ప్రోత్సహించాలి” అని అన్నారు.గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజు, ప్రధానోపాధ్యాయుడు యవన్, ఉపాధ్యాయులు ప్రియాంక, సౌందర్య మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వీఈసీ చైర్మన్ సాగర్, వార్డు సభ్యులు, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోటుబుక్కులను పంపిణీ చేశారు.