నిస్వార్థ ప్రేమకు నిలువుటద్దం నాన్న

త్యాగానికి ప్రతిరూపం నాన్న

రేపు (పితృ దినోత్సవం) ఫాదర్స్ డే

హ్యాపీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు

జడ్చర్ల, జూన్ 20 (జనంసాక్షి): మన కోసం నిరంతరం శ్రమించే నిస్వార్థ జీవి నాన్న. తనలోని బాధను బయటపడనివ్వకుండా, కుటుంబ బాధ్యతలను తన భుజాలపై వేసుకుని నడిపించే గొప్ప వ్యక్తి నాన్న. మనం ఆకాశంలో ఎగిరే గాలిపటం అయితే, మనల్ని ఎగిరేసేది అమ్మ.. ఆ రెండింటినీ గాలిలో స్థిరంగా ఉంచే ‘దారం’ నాన్న. ఆ దారం కంటికి కనిపించనట్లే, నాన్న ప్రేమ కూడా చాలావరకు బయటకు కనిపించదు.

తల్లికి ఉన్నంత గుర్తింపు తండ్రికి లభించలేదా?.

సమాజంలో తల్లికి ఉన్నంత గుర్తింపు, కీర్తి తండ్రికి లభించడం లేదనే వాదన ఎప్పటి నుంచో ఉంది. కవిత్వం నుండి సినిమా వరకు తల్లి గొప్పతనాన్ని చాటినట్లుగా, తండ్రి పాత్రను తగినంతగా గుర్తించలేదనే భావన ఉంది. అయితే, తండ్రి త్యాగాలను గుర్తించి, ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోవడానికే ‘ఫాదర్స్ డే’ (పితృ దినోత్సవం) ఉద్దేశించబడింది.

ఫాదర్స్ డే వెనుక ఉన్న స్ఫూర్తి:

ప్రతి సంవత్సరం జూన్ 3వ ఆదివారం ఫాదర్స్ డే జరుపుకోవడం ప్రపంచవ్యాప్తంగా ఆనవాయితీగా వస్తోంది. ఈ సంప్రదాయం అమెరికాలో మొదలైంది. సోనోరా స్మార్ట్ డాడ్ అనే మహిళ, తన తండ్రి విలియం జాక్సన్ స్మార్ట్ జ్ఞాపకార్థం దీనిని ప్రారంభించారు. ఆరుగురు పిల్లలను ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసిన తన తండ్రి త్యాగాలను చూసిన ఆమె, తండ్రుల కోసం కూడా ఒక ప్రత్యేక రోజు ఉండాలని బలంగా ఆకాంక్షించారు. దీని ఫలితంగా, 1910 జూన్ 3వ ఆదివారం వాషింగ్టన్ యంగ్ మెన్స్ క్రిస్టియన్ అసోసియేషన్‌లో మొదటిసారిగా ఫాదర్స్ డే వేడుకలు జరిగాయి. అప్పటి నుండి అమెరికాతో పాటు భారతదేశంలో కూడా తండ్రుల త్యాగాలను స్మరించుకుంటూ, ఈ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు.

నేటి తరం బాధ్యత:

కేవలం ఒక రోజు మాత్రమే తండ్రిని గుర్తు చేసుకోవడం కాకుండా, మన భవిష్యత్తు కోసం నిరంతరం కష్టపడే నాన్నకు, వృద్ధాప్యంలో తోడుగా నిలవడం ప్రతి బిడ్డ ప్రథమ కర్తవ్యం. నాన్నకు ప్రేమతో, నాన్న పట్ల మీకున్న గౌరవాన్ని, ప్రేమను తెలియజేయడానికి ఈ పితృ దినోత్సవం ఒక చక్కని అవకాశం. ఈ సందర్భంగా లోకంలోని తండ్రులందరికీ ‘హ్యాపీ ఫాదర్స్ డే’ శుభాకాంక్షలు.

తాజావార్తలు