నెల రోజుల్లో డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి.. లేకుంటే నిరాహార దీక్ష” ప్రభుత్వానికి కవిత అల్టిమేటం

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రభుత్వానికి నెల రోజులు గడువు ఇస్తున్నానని, లేదంటే ఇక్కడికే వచ్చి నిరాహార దీక్ష చేస్తానని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అల్టిమేటం జారీ చేశారు.జెండా పండుగలో భాగంగా భూపాలపల్లిలో పార్టీ జెండా ఆవిష్కరించిన అనంతరం కవిత మాట్లాడారు.
కార్మికుల గోస చూసి కళ్లలో నీళ్లు గత ఐదు రోజులుగా కార్మికులతో మాట్లాడుతున్నాను. వాళ్లకు తాగేందుకు మంచి నీళ్లు కూడా ఇవ్వటం లేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో ఒక పెద్ద మనిషి కలిసి గోస చెప్పుకుంటే కళ్లలో నీళ్లు వచ్చాయని చెప్పారు. బొగ్గుబాయిల ప్రాంత ప్రజలు సింగరేణిలో కనీసం కార్మికుడిగా జాబ్ వస్తుందని ఆశిస్తారని అన్నారు. రిటైర్ అవుతున్న వాళ్లు పిల్లలకు డిపెండెంట్ ఉద్యోగాలు కావాలని భావిస్తారు. కానీ ప్రభుత్వం మెడికల్ బోర్డు పెట్టకుండా రిటైర్ అవుతున్న వాళ్లను ఆవేదనకు గురి చేస్తోందని విమర్శించారు.
కాంగ్రెస్ గ్యారంటీలపై విమర్శలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అని చెప్పి ఫ్రీ బస్ తప్ప ఒక్కటీ అమలు చేయలేదని కవిత మండిపడ్డారు. ఫ్రీ బస్ వల్ల మహిళలు గొడవ పడుతున్నారని, పురుషులకు సీట్లు లేకుండా పోయిందని అన్నారు. ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారని, బస్సుల సంఖ్య పెంచటం లేదని చెప్పారు.వికలాంగులకు, 60 ఏళ్లు నిండిన సీనియర్ సిటిజన్లకు ఉచిత ప్రయాణం కల్పించాలని డిమాండ్ చేశారు. షాదీ ముబారక్, తులం బంగారం, కేసీఆర్ కిట్ లాంటివి ఇవ్వటం లేదని విమర్శించారు.
భూపాలపల్లి అభివృద్ధిపై ప్రశ్నలు భూపాలపల్లి జిల్లా కేంద్రం అయిన తర్వాత కూడా వసతులు రాలేదని కవిత అన్నారు. బ్రిడ్జిలు పాడయ్యాయని, అవుటర్ రింగ్ రోడ్డు అవసరమని తెలిపారు. రాజకీయ నాయకుల జాగాలు ఉంటే రోడ్డును వంకర తిప్పుతున్నారని ఆరోపించారు.గత ఎమ్మెల్యే భూకబ్జాలు చేశారని, చెరువులు, అడవులు వదలేదని ఆరోపించారు. 190 ఎకరాల అటవీ భూమి కబ్జాపై సుప్రీంకోర్టు తెలంగాణ ఇజ్జత్ తీసిందని చెప్పారు. ఇప్పుడున్న ఎమ్మెల్యే కూడా అవే పనులు చేస్తున్నారని విమర్శించారు.ఓపెన్ కాస్ట్ కోసం 140 ఎకరాలు ఇచ్చిన ప్రజలకు ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదని కవిత అన్నారు. భూములు ఇచ్చిన వారికి కచ్చితంగా పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే సీటు గెలుస్తాం భూపాలపల్లిలో ఇవాళ మొదటి జెండా ఎగురవేశామని, రానున్న రోజుల్లో ఎమ్మెల్యే సీటు కూడా గెలుస్తామని కవిత ధీమా వ్యక్తం చేశారు. ఆడబిడ్డలను నమ్ముకొని పార్టీ పెట్టానని, ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు.నిరంతరం కార్మికుల పక్షాన ఉంటానని కవిత స్పష్టం చేశారు.



