ఆఫ్ఘానిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

 

 

 

 

ఆగష్టు20(జనం సాక్షి)ఆఫ్ఘానిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇరాన్‌ నుంచి తరలిపోతున్న వలసదారులు వెళ్తున్న బస్సు హెరాత్‌ ప్రావిన్స్‌లో ఓ ట్రక్కును ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 71 మంది వలసదారులు సజీవ దహనమయ్యారు.వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల బహిష్కరణకు గురైన ఆఫ్ఘానిస్తాన్‌ వలసదారులను ఇరాన్‌ ఇటీవల బలవంతంగా వెనక్కి పంపించింది. వారిలో కొంతమందితో వస్తున్న బస్సు ఆఫ్ఘానిస్థాన్‌లోని హెరాత్‌ ప్రావిన్స్‌కు వచ్చిన తర్వాత ముందుగా ఓ మోటార్‌ సైకిల్‌ను ఢీకొట్టింది. అనంతరం అదుపుతప్పి ఇంధనం తీసుకెళ్తున్న ట్రక్కును ఢీకొట్టింది. దీంతో బస్సులో మంటలు చెలరేగాయి.ప్రమాదం గురించి తెలియగానే అధికారులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కానీ అప్పటికే పెను ప్రమాదం జరిగిపోయింది. ఈ ఘటనలో 71 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 17 మంది చిన్నారులు ఉండటం గమనార్హం. ట్రక్కులోని ఇద్దరు, మోటార్‌ సైకిల్‌పై ఉన్న ఇద్దరితో కలిపి బస్సులోని ప్రయాణిస్తున్న వారు ఈ ప్రమాదంలో మరణించారు. బస్సులో ప్రయాణిస్తున్న వారిలో కేవలం ముగ్గురు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. నిర్లక్ష్యం, అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాదంపై పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసు అధికారులు తెలిపారు.