రైతులకు నీళ్లు ఇవ్వాలి మాజీ జడ్పీటీసీ నరసింహారెడ్డి

కల్హేర్, ఆగస్టు 5( జనం సాక్షి)నల్లవాగు ప్రాజెక్టు నుంచి ఆలుగు పారుతున్న నీటిని వృథాగా వదిలేయకుండా రైతులకు, చెరువులకు విడుదల చేయాలని కల్హేర్ మాజీ జడ్పీటీసీ నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రాజెక్టులో నీరు సమృద్ధిగా ఉన్నప్పటికీ ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే రైతుల అవసరాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు.పంటల సాగుకు అత్యవసరమైన ఈ సమయంలో కుడి, ఎడమ కాలువలను వెంటనే శుభ్రపరచి నీటిని విడుదల చేస్తే రైతులతో పాటు మండలంలోని చెరువులు కూడా నిండుతాయని అన్నారు. నీటిని సకాలంలో విడుదల చేయడంలో జరుగుతున్న జాప్యం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రచార కార్యక్రమాలు, ఫోటోలకు ప్రాధాన్యం ఇవ్వడం కంటే రైతుల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా వెంటనే చర్యలు తీసుకుని కాలువల ద్వారా సాగునీటిని అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో మాజీ జిల్లా కో-ఆప్షన్ సభ్యులు అలీ, మాజీ మండల కో-ఆప్షన్ సభ్యులు గాని, మాజీ సర్పంచ్ బాలయ్య, మాజీ ఉపసర్పంచ్ సాయిలు, గ్రామ పార్టీ ఉపాధ్యక్షుడు ప్రభు గౌడ్, సాయిరాం, ప్రమోద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.