కావేరమ్మపేటకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని మార్చాలని విజ్ఞప్తి

జడ్చర్ల, కావేరమ్మపేట ప్రజల కోరిక
జడ్చర్ల, ఆగస్టు 5 (జనంసాక్షి): ప్రభుత్వ కార్యాలయాలు సొంత భవనాలలో ఉండాలన్న ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా జడ్చర్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని కావేరమ్మపేటలోని పాత మున్సిపల్ కార్యాలయ భవనానికి మార్చాలని స్థానిక ప్రజలు, పార్టీలకు అతీతంగా నాయకులు విజ్ఞప్తి చేశారు. బుధవారం జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేట పాత మున్సిపల్ కార్యాలయంలో జడ్చర్ల, కావేరమ్మపేట పరిధి 9 వార్డుల ప్రజలు, పార్టీలకు అతీతంగా నాయకులు అధిక సంఖ్యలో సమావేశమై సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థం పలు కీలక అంశాలను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారు. ప్రస్తుతం బాదేపల్లి గంజి ప్రాంతంలో అద్దె భవనంలో కొనసాగుతున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ప్రభుత్వ భవనంలోకి మార్చితే ప్రభుత్వానికి అద్దె భారం తప్పుతుందని కోరారు. అందుకోసం కావేరమ్మపేటలోని పాత మున్సిపల్ కార్యాలయ భవనంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి కావలసిన అన్ని రకాల వసతులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయని, ప్రస్తుతం ఆ భవనం నిరుపయోగంగా వృథాగా మారుతోందని తెలిపారు. అట్టి కార్యాలయం ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల స్థానిక ప్రజలకు వ్యాపార నిమిత్తం ఆర్థికంగా బాగుపడే అవకాశం ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అదనంగా ఆదాయం సమకూరుతుందని వారు అభిప్రాయపడ్డారు. అందువల్ల 9 వార్డుల ప్రజల కోరిక మేరకు, ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి కి వినతిపత్రం అందజేసి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని కావేరమ్మపేట మున్సిపల్ కార్యాలయానికి మార్చాలని కోరడం జరుగుతుందని సమావేశమైన వారు స్పష్టం చేశారు. సొంత ప్రభుత్వ భవనం అందుబాటులో ఉన్నందున ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు సానుకూలంగా స్పందించి జడ్చర్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని కావేరమ్మపేటకు మార్చేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.



