చండూరులో పేకాట రాజాళ్ల గుట్టు రట్టు..

లాడ్జిపై పోలీసుల మెరుపు దాడి, ఏడుగురు అరెస్ట్!

చండూరు జూన్ 6 (జనంసాక్షి): చండూరు మున్సిపాలిటీలో స్థానిక లాడ్జిలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న పేకాట స్థావరంపై పోలీసులు శుక్రవారం రాత్రి మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో ఏడుగురు పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకుని, వారిపై కేసు నమోదు చేసినట్లు గట్టుప్పల ఎస్సై సంజీవరెడ్డి తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు.ప్రస్తుతం చండూరు ఎస్సై సెలవులో ఉండటంతో, గట్టుప్పల ఎస్సై సంజీవరెడ్డి ఇక్కడి బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి స్థానిక ఒక లాడ్జిలో కొంతమంది చేరి పెద్ద ఎత్తున పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు ఖచ్చితమైన సమాచారం అందింది. నమ్మదగిన సమాచారం మేరకు గట్టుప్పల ఎస్సై సంజీవరెడ్డి, చండూరు హెడ్ కానిస్టేబుల్ శ్రీరాములుతో కలిసి సదరు లాడ్జిపై హఠాత్తుగా దాడి (రైడ్) చేశారు.ఈ దాడిలో పేకాట ఆడుతూ.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన ఏడుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి రూ. 8,300/- నగదును, పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు.మండల పరిధిలో ఎక్కడైనా ఎవరైనా పేకాట ఆడటంతో పాటు ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. చట్టవ్యతిరేక పనుల గురించి పోలీసులకు సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని, కాబట్టి ప్రజలు ధైర్యంగా ముందుకు వచ్చి సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా వారు కోరారు.