నల్లగొండలో ఏసీబీ వలలో వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్

నల్లగొండ ప్రతినిధి,జూన్ 6,(జనం సాక్షి):నల్లగొండ ఏసీబీ అధికారులకు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు వక్ఫబోర్డు ఇన్స్పెక్టర్ మహమూద్.పెద్దవూర మండలంలో మసీదు భూమి సర్వే నివేదిక పంపించేందుకు రూ.10 వేల లంచం డిమాండ్ చేసిన వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ మహమూద్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.వివరాల ప్రకారం, పెద్దవూర మండలంలోని 900 గజాల స్థలంలో ఉన్న మసీదు మరియు ఖాళీ స్థలం విషయంలో 2025 ఫిబ్రవరిలో సంబంధిత వ్యక్తులు వక్ఫ్ బోర్డు సీఈవోకు ఫిర్యాదు చేశారు. తమ మసీదు, ఖాళీ స్థలాన్ని వక్ఫ్ బోర్డు ఆధీనంలోకి తీసుకోవాలని కోరారు. దీనిపై సీఈవో ఆదేశాల మేరకు వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ మహమూద్, సర్వేయర్‌తో కలిసి స్థలాన్ని పరిశీలించి సర్వే నిర్వహించారు.అయితే సర్వే పూర్తి అయినప్పటికీ నివేదికను సీఈవోకు పంపకుండా నిలిపివేసిన ఇన్స్పెక్టర్, రిపోర్టు పంపాలంటే రూ.10 వేల లంచం ఇవ్వాలని బాధితుడిని డిమాండ్ చేసినట్లు సమాచారం. దీంతో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో మిర్యాలగూడ బస్టాండ్ ప్రాంతంలో నిఘా ఏర్పాటు చేసి, ఇన్స్పెక్టర్ మహమూద్ రూ.10 వేల లంచం స్వీకరిస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని నల్లగొండ వక్ఫ్ కార్యాలయంలో, అలాగే మిర్యాలగూడలోని అతని నివాసంలో ప్రత్యేక బృందాలతో సోదాలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ జగదీష్ చంద్ర మాట్లాడుతూ, ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు వెంటనే ఏసీబీని సంప్రదించాలని సూచించారు. కేసుకు సంబంధించిన పూర్తి విచారణ అనంతరం సాక్ష్యాధారాలతో నిందితుడిని నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు.