ఉదండాపూర్ నిర్వాసితులకు ప్రభుత్వం అండ : ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
రేపు జడ్చర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాక
భూ నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ నిధులు పూర్తిస్థాయిలో చెల్లిస్తాం
జడ్చర్ల, జూన్ 4 (జనంసాక్షి): ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసితుల సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యతతో వ్యవహరిస్తోందని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఉదండాపూర్ ప్రాజెక్టు పరిశీలనకు వస్తున్నారని, ప్రాజెక్టు సందర్శన, ఉన్నత స్థాయి సమీక్ష అనంతరం ముఖ్యమంత్రి జడ్చర్ల పట్టణంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొంటారని ఎమ్మెల్యే తెలిపారు. జడ్చర్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తో కలిసి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ ఉదండాపూర్ భూ నిర్వాసితులకు ప్రకటించిన ఆర్అండ్ఆర్ ప్యాకేజీకి సంబంధించిన నిధులను పూర్తిస్థాయిలో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. నిర్వాసితులను గౌరవ ప్రదంగా పునరావాస ప్రాంతాలకు తరలించి, వారికి అవసరమైన అన్ని మౌలిక వసతులు, సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మధ్యాహ్నం నేరుగా ఉదండాపూర్ ప్రాజెక్ట్ దగ్గరికి చేరుకొని, అక్కడ జరుగుతున్న పనులను స్వయంగా పరిశీలిస్తారని, ప్రాజెక్టు పరిశీలన ముగిసిన అనంతరం సీఎం నేరుగా జడ్చర్ల పట్టణంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు రానున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఎల్లప్పుడూ ఉదండాపూర్ నిర్వాసితులకు అండగా ఉంటారని, వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు. ఉదండాపూర్ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజల ఆశయాలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోందని, సీఎం నాయకత్వంలో భూ నిర్వాసితుల కళ్లల్లో ఆనందం నింపే నిర్ణయాలు తీసుకుంటున్నామని అన్నారు. నేడు నిర్వహించే బహిరంగ సభలో జడ్చర్ల అభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన కీలక సందేశాలు వెలువడనున్నాయని వెల్లడించారు. ముఖ్య మంత్రి జడ్చర్ల పర్యటనను పురస్కరించుకుని ఉమ్మడి జిల్లా, నియోజకవర్గంలోని అన్ని మండలాల ప్రజలు, రైతులు, మహిళలు, యువజనులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కార్యక్రమంలో పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు యాదయ్య, అశోక్ కుమార్ యాదవ్, శివకుమార్, పిఎసిఎస్ చైర్మన్ సుదర్శన్ గౌడ్, రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.



