సమస్యల పరిష్కారానికి గ్రామసభలు
భీమదేవరపల్లి:ఏప్రిల్ 03 (జనం సాక్షి)రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా భీమదేవరపల్లిమండలంలోని గ్రామాల్లో గ్రామసభలు ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా కొప్పూరు గ్రామంలో జరిగిన గ్రామసభలో గ్రామస్తులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.గ్రామంలో విద్యుత్ స్తంభాల కొరత,కోతుల బెడద,వీధి కుక్కల సమస్యలు తీవ్రంగా ఉన్నాయని ప్రజలు వెల్లడించారు. అదనంగా సీసీ రోడ్ల నిర్మాణం,సైడ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు కొత్త గ్రామపంచాయతీ భవనం మరియు వీవో భవనం నిర్మాణం అత్యవసరమని కోరారు.
ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కొత్త వాటర్ ట్యాంకుల నిర్మాణం, మిషన్ భగీరథ ద్వారా శుద్ధమైన తాగునీటి సరఫరా కల్పించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.అలాగే అర్హులైన వారికి కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.గ్రామసభకు హాజరైన ప్రత్యేక అధికారి, నాయబ్ తహసీల్దార్ సూర్యకు గ్రామ సర్పంచ్ గద్ద కుమారస్వామి గ్రామ సమస్యలను వివరించారు.ప్రజల నుంచి వచ్చిన వినతులను సంబంధిత అధికారులకు పంపించి తక్షణచర్యలు తీసుకునేలా కృషి చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు.
పంచాయతీ కార్యదర్శి రత్నకుమారి కొత్త పెన్షన్ దరఖాస్తుదారుల పేర్లను సభలో చదివి వినిపించారు. ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రణాళిక ద్వారా గ్రామ సమస్యలు పరిష్కారమై గ్రామం మరింత అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మిర్యాల రాణి రాజు,వార్డు సభ్యులు, తూముల చిరంజీవి, బాకీ ఐలమ్మ,కొమ్ముల పద్మ,గుడికందుల సప్న,శంకర్,సంగేం శ్రీనివాస్,హనుమకొండ జిల్లా టీఎంఆర్పీఎస్ ఉపాధ్యక్షులు అంబాల చక్రపాణి,కొమ్ముల నాగేష్,కొమ్ముల రవీందర్,మండల యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.


