నడిరోడ్డుపై నరకం.. మాడుగులపల్లి ముట్టడి!

మండల కేంద్రంలో స్తంభించిన రవాణా.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
కనీస ప్రణాళిక లేని సిసి రోడ్డు పనులు.. ప్రజల ప్రాణాలతో కాంట్రాక్టర్ ఆటలు
నిత్యం యుద్ధ వాతావరణం.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అధికారులు!
మాడుగులపల్లి, జూన్ 20 ( జనం సాక్షి): మాడుగులపల్లి మండల కేంద్రం ప్రస్తుతం ఒక పెద్ద నరకకూపాన్ని తలపిస్తోంది. మాడుగులపల్లి నుంచి ఎల్లమ్మగూడెం వరకు నిర్మిస్తున్న రహదారి పనుల్లో కాంట్రాక్టర్ నిర్వాకం వల్ల మండల కేంద్రం మొత్తం నిత్యం ట్రాఫిక్ జామ్‌తో ఊపిరాడకుండా కొట్టుమిట్టాడుతోంది కనీసం సర్వీస్ రోడ్డు కూడా ఇవ్వకుండా అడ్డగోలుగా సిసి రోడ్డు పనులు ప్రారంభించడంతో, మండల కేంద్రం గుండా ప్రయాణించాలంటేనే ప్రజలు, వాహనదారులు వణికిపోతున్నారు.
మండల కేంద్రం అంతా జామ్ స్తంభించిన జనజీవనం
ప్రధాన చౌరస్తాతో పాటు మండల కేంద్రంలోని అంతర్గత రహదారులన్నీ వాహనాలతో నిండిపోతున్నాయి ఒకే వైపు రోడ్డుపై పనులు చేస్తుండటం, ప్రత్యామ్నాయంగా దారి చూపకపోవడంతో ఎదురెదురుగా వచ్చే బస్సులు, లారీలు, ద్విచక్ర వాహనాలతో మాడుగులపల్లి కేంద్రం మొత్తం గంటల తరబడి స్తంభించిపోతోంది. అత్యవసరంగా వెళ్లే అంబులెన్సులు, పాఠశాల వాహనాలు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు ఈ ట్రాఫిక్ ఉచ్చులో చిక్కుకుని తీవ్ర అవస్థలు పడుతున్నారు
రోడ్డుపైనే పంచాయతీలు రక్తం చిందించాలా?
గంటల తరబడి ఎండలో వాహనాలు నిలిచిపోతుండటంతో వాహనదారుల సహనం నశిస్తోంది దారి ఇచ్చే విషయంలో ప్రతిరోజూ ఇక్కడ ప్రయాణికుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదాలు, భౌతిక దాడుల వరకు వెళ్లేలా గొడవలు, పంచాయతీలు జరుగుతున్నాయి మండల కేంద్రంలో ఇంత పెద్ద ఎత్తున యుద్ధ వాతావరణం కనిపిస్తున్నా అటు పోలీసులు గానీ, ఇటు రెవెన్యూ యంత్రాంగం గానీ పట్టించుకోకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు ఏదైనా పెద్ద ప్రమాదం జరిగి ప్రాణాలు పోతే కానీ అధికారులు నిద్ర లేవరా? అని ప్రశ్నిస్తున్నారు
అంతా వారి ఇష్టం పత్తాలేని అధికారులు!
ఈ నిర్మాణ ప్రాంతంలో పనులను పర్యవేక్షించాల్సిన సంబంధిత అధికారులు గానీ, జవాబుదారీగా ఉండాల్సిన కాంట్రాక్టర్ గానీ కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండటం లేదు అంతా వారి ఇష్టారాజ్యంగా, అడ్డగోలుగా సాగుతోంది. ఇక్కడ పనులు జరుగుతున్నాయనే కనీస హెచ్చరికా బోర్డులు లేదా ట్రాఫిక్‌ను నియంత్రించే సిబ్బందిని కూడా కాంట్రాక్టర్ ఏర్పాటు చేయకపోవడం వారి నిర్లక్ష్యానికి పరాకాష్ట.
జిల్లా కలెక్టర్
తక్షణమే స్పందించండి
మండల కేంద్రం ప్రజలు నిత్యం నరకం అనుభవిస్తున్నా ఉన్నతాధికారులు మౌనంగా ఉండటం వెనుక అంతర్యమేమిటనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, మాడుగులపల్లి మండల కేంద్రంలో క్షేత్రస్థాయి పరిశీలన చేయాలి. నిబంధనలు ఉల్లంఘించిన కాంట్రాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, వెంటనే ప్రత్యామ్నాయ దారి చూపి, ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని మండల ప్రజలు అత్యంత ఘాటుగా డిమాండ్ చేస్తున్నారు.



