వడగండ్ల బీభత్సం… 213 మేకల మృతి

వికారాబాద్ జిల్లా బ్యూరో/ పూడూర్ మార్చి 18 (జనం సాక్షి) : ఉరుములు మెరుపులు ఈదుడు గాలులు పిడుగులతో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. ఈ వాన వల్ల రైతులకు కడగండ్లు మిగిలింది. అకాల వర్షం బీభత్సం సృష్టించిన కారణంగా చేతికొచ్చిన చేతికి రావలసిన పంటలు దెబ్బతినగా. పొలంలో మేత కోసం వెళ్ళిన మేకలపై వడగండ్ల వాన విసిరిన పంజాతో మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలోని చౌడాపూర్ మండలంలో మంగళవారం రాత్రి జరిగింది. మంగళవారం రాత్రి కురిసిన వడగండ్ల వాన కారణంగా చౌడపూర్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన మేకల కాపర్ల 213 మేకలు అక్కడికక్కడే మృతి చెందాయి. వడగండ్ల దెబ్బకు మరిన్ని మేకలు మృతి వాతపడే అవకాశం ఉంది. ఆరుగురు మేకల కాపర్లు పూడూరు మండలం నిజాంపేట మేడిపల్లి 250 మేకలను తోలుకొని మేత కోసం ఆ పరిసరాల ప్రాంతానికి వచ్చారు. చీకటి పడడంతో పొలంలోనే మేకలను ఒకచోట చేర్చి మందవేశారు. రాత్రివేళ క్రూర జంతువులు మేకల పై దాడి చేయకుండా వలలు ఏర్పాటు చేసి కాపలాగా మేకల కాపర్లు ఆరుగురు ఉన్నారు. మంగళవారం అర్ధరాత్రి అకాల వర్షం వడగండ్లతో బీభత్సం సృష్టించింది. దీంతో మేకల కాపర్లు తలదాచుకోవడానికి గుడిసెలోకి పరిగెత్తారు. కానీ దాదాపు 250 పైగా మేకలు మేకల కాపర్లు వేసిన వల వలయంలో చిక్కుకున్నాయి. భీకరంగా కురిసిన వడగండ్ల వాన దెబ్బ వల్ల అక్కడికక్కడే 213 మేకలు మృతి చెందాయి. మిగతా కొన్ని మేకలు వడగండ్ల దెబ్బకు మృత్యువుతో పోరాడుతున్నాయి. ఈ విషయం తెలియగానే వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి విచారణకు ఆదేశించారు. పూడూరు తాసిల్దార్ విజయ్ కుమార్ పశు వైద్యశాల డాక్టర్లు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. కొన ఊపిరితో మృత్యువుతో పోరాడుతున్న మేకలకు ప్రాథమిక చికిత్స అందించారు. వడగండ్ల వాన మృతి చెందిన మేకలను పోస్టుమార్టం నిమిత్తం పశు వైద్యశాలకు ట్రాక్టర్ లో తరలించారు. కొత్తపల్లి కి చెందిన మేకల కాపర్లు యాదమ్మ కేశవులు గోపాల్ యాదయ్య జంబుల యాదయ్యలు ఒకచోట చేరి మేకలను మేపుకొని జీవనోపాధి గడుపుతున్నారు. ఒకేసారి ఆరు కుటుంబాలకు చెందిన మేకలు మృతి చెందడంతో వారి కుటుంబాలు వీధిన పడే అవకాశం ఉంది. అకాల వర్షం కారణంగా మృతి చెందిన మేకలకు నష్టపరిహారం చెల్లించి వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటామని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. అలాగే వర్షం వలన నష్టపోయిన పంటలను అంచనా వేయాలని కోరారు. పోస్టుమార్టం అనంతరం సమగ్ర నివేదికను జిల్లా కలెక్టర్ కు అందజేస్తామని తాసిల్దార్ విజయ్ కుమార్ పశు వైద్య ఆరోగ్యశాఖ డాక్టర్లు తెలియజేశారు. ఒకేసారి తమ బతుకు జీవనాధారమైన మేకలు మృత్యువాత పడడంతో మేకల కాపర్ల బాధ వర్ణానితం.



