సీఎం వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌తా విధుల నుంచి బెటాలియ‌న్ పోలీసుల తొల‌గింపు హరీశ్‌ రావు తీవ్ర ఆగ్ర‌హం

 

రాష్ట్ర ముఖ్య‌మంత్రి వ్యక్తిగత భద్రతా విధుల నుంచి స్పెషల్ పోలీసులను తప్పిస్తూ తీసుకున్న నిర్ణయంపై మాజీ మంత్రి హరీశ్‌ రావు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బెటాలియ‌న్ పోలీసులను విధుల నుంచి తొల‌గించ‌డం.. 17 వేల మంది స్పెషల్ పోలీసులను అవమానించడమే అని పేర్కొన్నారు. సస్పెండ్, డిస్మిస్ చేసిన స్పెషల్ పోలీసులను వెంటనే విధులోకి తీసుకోవాలని కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని హ‌రీశ్‌రావు డిమాండ్ చేశారు.

తెలంగాణ స్పెషల్ పోలీసుల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి వివేకంతో నిర్ణయాలు తీసుకోవాలి. తన వ్యక్తిగత భద్రత నుంచి తెలంగాణ స్పెషల్ పోలీసులను తప్పించడం అనాలోచిత నిర్ణయం. పదిహేడు వేల మంది స్పెషల్ పోలీసులను తన చర్యతో సీఎం అవమాన పరిచారు. తండ్రి కొడుకులను విశ్వాసంలోకి తీసుకోనట్లుగా ఉంది రేవంత్ రెడ్డి చర్య అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

స్పెషల్ పోలీసులు అంటే రాష్ట్రానికి మిలిటరీ లాంటి వారు. వారి ఆత్మస్థైర్యాన్ని సీఎం దెబ్బతీయకూడదు. స్పెషల్ పోలీసుల సమస్యల పరిష్కారానికి సీఎం తక్షణమే కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి, నిర్ణీత కాలవ్యవధిలో నిర్ణయం తీసుకోవాలి. ఏక్ పోలీస్ విధానాన్ని తీసుకురాబోతానని ఎన్నికల్లో హామీ ఇచ్చిన సీఎం ఇప్పుడు స్పెషల్ పోలీసుల ఆందోళనపై కనీసం స్పందించకపోవడం ఎంతవరకు సమంజసం? అని హ‌రీశ్‌రావు నిల‌దీశారు.

సస్పెండ్, డిస్మిస్ అయిన స్పెషల్ పోలీసు కానిస్టేబుళ్లను తక్షణమే విధుల్లోకి చేర్చేందుకు సీఎం జోక్యం చేసుకోవాలి. స్పెషల్ పోలీసులపై సచివాలయ ముఖ్య భద్రతా అధికారి ఎమర్జెన్సీ తరహాలో ఆంక్షలు పెడుతూ విడుదల చేసిన సర్క్యూలర్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలి. సోషల్ మీడియాలో లైక్‌లు, షేర్‌లు చేసినా, ఆ పోలీసులు పట్ల చర్యలు ఉంటాయని పేర్కొనడం దుర్మార్గం. భావప్రకటన స్వేచ్ఛ అనే రాజ్యాంగ ప్రాథమిక హక్కును హరించే అధికారం ఎవరికీ లేదు అని హ‌రీశ్‌రావు తెలిపారు.