ఆదమరిస్తే…..అంతే సంగతులు

మంగపేట నవంబర్ 08(జనంసాక్షి)
గుట్ట రోడ్డు మార్గంలోని మూలమలుపుల వద్ద చెట్లను తొలగించాలి
భక్తుల వాహనాలు ప్రమాదాలకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని భక్తుల విన్నపాలు…
మూలమలుపుల వద్ద చెట్లు ఉండటంతో ప్రయాణంలో తీవ్ర ఇబ్బంది గురవుతున్నాం…
తెలంగాణ రాష్ట్రంలో రెండవ యాదగిరిగుట్టగా సుప్రసిద్ధి చెందిన స్వయంభువుక్షేత్రం మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనరసింహస్వామి ఆలయం. ఈ ఆలయానికి నిత్యం భక్తులు వేలాది సంఖ్యలో తమ తమ వాహనాలతో రాకపోకలు సాగిస్తూ ఉంటారు. కానీ ఈ గుట్ట మార్గం ద్వారా ప్రయాణం కొనసాగిస్తున్న సమయంలో ఆదమరిస్తే…అంతే సంగతి అని భక్తులు ఆరోపిస్తున్నారు. మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ప్రతి శని, ఆదివారాలల్లో స్వామివారికి తిల తైలాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. కానీ ఆ సమయాల్లో భక్తులు వేలాది సంఖ్యలో హేమాచల క్షేత్రానికి తరలివస్తారు. ఈ గుట్ట ద్వారా స్వామివారి సన్నిధికి చేరాలంటే కొన్ని ప్రమాదకరమైన మూలమలుపుల వాహనాల రాకపోకలు కనిపించకుండా భారీ ఎత్తున చెట్లు పెరగడంతో తిప్పలు తప్పడం లేదు. మల్లూరు గ్రామంలోని ఏటూరునాగారం – బూర్గంపహాడ్ జాతీయ రహదారి నుండి శ్రీ హేమాచల నరసింహస్వామి క్షేత్రానికి చేరాలంటే సుమారు ఈ గుట్ట మార్గం ద్వారా మూడు కిలోమీటర్ల మేర రోడ్డు ప్రయాణం కొనసాగించాలి. కానీ ఈ రోడ్డు మార్గంలో అనేక మూలమలుపులు ఉండడంతో భక్తులు ప్రయాణించే వాహనాలు ఏ మూలమలుపుల వద్ద ప్రమాదం పొంచి వస్తుందని భయం గుప్పిట్లోనే ప్రయాణాన్ని కొనసాగిస్తున్నామని భక్తులు తమ ఆవేదనలను వ్యక్తపరిచారు. గతంలో ఈ మూలమలుపుల వద్ద భక్తుల వాహనాలు ప్రమాదాలకు గురైన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఈ విషయంపై నేటి వరకు కూడా అధికారులు పట్టించుకోకపోవడం హేయమైన చర్య అని భక్తులు వాపోయారు. నాటి నుండి నేటి వరకు కూడా ప్రమాదకరంగా ఉన్న మూలమలుపులు అలానే ఉన్నాయి. ప్రమాదాలకు మూలకారణం మూలమలుపుల వద్ద భారీ ఎత్తున చెట్లు పెరగడంమే ప్రధాన సమస్యగా మారి భక్తుల వాహనాల రాకపోకలు అంతరాయం కలుగుతుందని అలాగే భక్తులు ప్రమాదాలకు గురికావడం జరుగుతుందని భక్తులు వాపోయారు. ఇప్పటికైనా పంచాయతీరాజ్ అధికారులు, ఎండోమెంట్ అధికారులు దృష్టి సారించి భక్తులకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మూలమలుపుల వద్ద చెట్లను తొలగించి భక్తులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కలిగించే విధంగా చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.



