తెలంగాణలో ఇప్ప సారా? ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ప్రతిపాదనపై మంత్రి జూపల్లి కీలక వ్యాఖ్యలు

జడ్చర్ల, మార్చి 13 (జనంసాక్షి): తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఈసారి సారా అంశం హాట్ టాపిక్‌గా మారే సూచనలు కనిపిస్తున్నాయి. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన ఇప్ప పువ్వు సారా తయారీ ప్రతి పాదనపై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సానుకూలంగా స్పందించారు. శుక్రవారం జడ్చర్ల మున్సిపల్ నూతన కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి జూపల్లి మీడియాతో మాట్లాడుతూ ఇప్ప పువ్వుతో మద్యం తయారు చేసే అంశంపై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఇప్పటికే మంత్రికి విన్నవించినట్లు తెలిపారు. కేవలం విన్నపం మాత్రమే కాకుండా, దీనిపై స్వయంగా చేసిన సమగ్ర పరిశోధన పత్రాన్ని కూడా ఎమ్మెల్యే మంత్రికి సమర్పించినట్లు తెలిపారు. ఈ ప్రతి పాదనపై స్పందించిన మంత్రి జూపల్లి కృష్ణారావు, ఈ అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని, ప్రపంచవ్యాప్తంగా దేశంలోని ఇతర రాష్ట్రాల్లో, ముఖ్యంగా గోవా వంటి ప్రాంతాల్లో ఇప్ప పువ్వుతో మద్యం తయారీకి సంబంధించి ఉన్న విధానాలను, అక్కడ అమలవుతున్న పద్ధతులను నిశితంగా అధ్యయనం చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పసారా తయారీ ఎంతవరకు సమంజసం, దీనివల్ల ప్రభుత్వానికి, ప్రజలకు కలిగే లాభనష్టాలేమిటి అనే అంశాలపై రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో సుదీర్ఘంగా చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణలోని గిరిజన ప్రాంతాల్లో ఇప్ప పువ్వు సేకరణ ఒక ప్రధాన జీవనోపాధిగా ఉన్న నేపథ్యంలో, ఎమ్మెల్యే చేసిన ఈ వినూత్న ప్రతిపాదన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.



