ఎమ్మెల్యేను మించి హామీలిస్తున్న కంజర్‌ గ్రామ సర్పంచ్‌ అభ్యర్థులు

నిజామాబాద్‌ (జనంసాక్షి) : నిజామాబాద్‌ జిల్లా మోపాల్‌ మండలంలోని కంజర్‌ గ్రామంలో సర్పంచ్‌ అభ్యర్థుల హామీలు ప్రతి ఒక్కరినీ నివ్వెర పరుస్తున్నాయి. ఎమ్మెల్యే స్థాయిని తలదన్నే రీతిలో హామీలు గుప్పించడం పట్ల ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. బ్రిడ్జీలు కట్టిస్తానని ఒకరు.. నిరుద్యోగులకు, యువతకు ఉపాధి మార్గాలు చూపుతామని ఇంకొకరు.. ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక సహాయాలు.. ట్రైనింగ్‌ సెంటర్లు తదితర ఎన్నో హామీలతో మేనిఫెస్టోగా పెడుతూ ప్రజలను గందరగోళ పరుస్తున్నారు. అసలు గ్రామ పంచాయతీకి వచ్చే నిధులెన్ని..? ఇక్కడ హామీలకు అవసరమైన నిధులెంత అనే తేడాలేకుండా.. ఎలాంటి అవగాహన లేకుండా పోస్టర్లు తయారు చేసి సెల్ఫ్‌ గోల్‌ అవుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో జరిగిన పనులెన్ని..? వాటి పెండింగ్ పనులేవీ? వాటి పరిస్థితిని వివరించకుండా ఇష్టారీతిన హామీలిస్తున్నారు సర్పంచ్‌ అభ్యర్థులు. ఎన్నికల కమిషన్‌ నిబంధనలకు నీళ్లొదులుతూ వ్యయానికి మించి ఖర్చు చేస్తున్నారు. ఒకవైపు గత సర్కారు హయాంలో సర్పంచ్‌లు చేసిన పనులకు బిల్లులే రాక కొందరు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు కళ్ల ముందుండగా… తాజా సర్పంచ్‌ అభ్యర్థులు మాత్రం ఎమ్మెల్యేలే ఆశ్చర్యపోయేలా హామీలిస్తుండటం గమనార్హం. అయితే.. అలవిమాలిన హామీలిస్తున్నారని గమనించిన గ్రామ ప్రజలు, మాజీ నాయకులు.. అవగాహన కలిగి అనుభవం ఉన్న అభ్యర్థిని గెలిపిస్తేనే ఊరికి ఉపయోగం జరుగుతుందనే ఆలోచనలో ఉన్నట్టు చర్చ జరుగుతోంది.