ప్రకృతిని ప్రేమిద్దాం – పర్యావరణాన్ని పరిరక్షిద్దాం
ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవీ రెడ్డి సుధీర్ రెడ్డి
హయత్ నగర్, జూన్ 8 (జనం సాక్షి)ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని నాగోల్, బండ్లగూడ ప్రాంతాలకు చెందిన ఐకాన్ వాకర్స్ గ్రూప్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరైనారు. ఈ సందర్భంగా దేవి రెడ్డి సుధీర్ రెడ్డి మాట్లాడుతూ నాగోల్, బండ్లగూడ ప్రాంతాలకు చెందిన ఐకాన్ వాకర్స్ గ్రూప్ సభ్యులు ఆరోగ్యకరమైన జీవనశైలి, ప్రకృతి పరిరక్షణ, పర్యావరణ అవగాహన లక్ష్యాలతో నిర్వహిస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని పేర్కొన్నారు.”ప్రకృతిని ప్రేమిద్దాం – పర్యావరణాన్ని పరిరక్షిద్దాం” అనే సందేశంతో ఐకాన్ వాకర్స్ గ్రూప్ సభ్యులు ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై చైతన్యం కల్పిస్తూ, మొక్కలు నాటడం, పరిశుభ్రత వంటి కార్యక్రమాలు నిర్వహించడం హర్షించదగ్గ విషయము అని అన్నారు. ఆరోగ్య పరిరక్షణకు నడక ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుందని తెలిపారు.పెరుగుతున్న కాలుష్యం, పర్యావరణ సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ ప్రకృతి సంరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రతి వ్యక్తి కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షిస్తే భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించగలమని తెలిపారు. ప్రతిరోజూ నడక అలవాటు చేసుకోవడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని, సమాజంలో ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పెంపొందించేందుకు ఐకాన్ వాకర్స్ గ్రూప్ నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐకాన్ వాకర్స్ గ్రూప్ అధ్యక్షులు చెరుకు ప్రశాంత్ గౌడ్, జనరల్ సెక్రెటరీ రమేష్ గౌడ్, వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి, కోశాధికారి రమేష్, జాయింట్ సెక్రెటరీ పెంటారెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ లక్ష్మీనారాయణ, సలహాదారులు ప్రతాప్ రెడ్డి, తూర్పాటి చిరంజీవి, చెరుకు చిరంజీవి, ఈశ్వర్ గౌడ్ సభ్యులు సీతారాములు, పర్యావరణ ప్రేమికులు, తదితరులు పాల్గొన్నారు.



